Nara Lokesh 'Yuvagalam': నేటి నుంచే యువగళం
ABN, First Publish Date - 2023-01-27T02:30:31+05:30
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ‘యువగళం’ పాదయాత్రకు శుక్రవారం చిత్తూరు జిల్లా కుప్పంలో తొలి అడుగు పడనుంది. యువతను కలుస్తూ, జనం సమస్యలు తెలుసు కుంటూ 400 రోజులపాటు నాలుగువేల కిలోమీటర్ల మేర రాష్ట్రమంతా ఆయన నడవనున్నారు.
కుప్పం నుంచి లోకేశ్ పాదయాత్ర
ఉదయం 11:03 గంటలకు తొలి అడుగు
400 రోజులు.. 4000 కిలోమీటర్ల నడక
అచ్చెన్న సహా 300 మంది నేతల హాజరు
తిరుమల నుంచి నేరుగా కుప్పానికి లోకేశ్
హారతులిచ్చి ఆహ్వానించిన ఆడపడుచులు
ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో రాత్రికి బస
నేడు అక్కడి నుంచే కార్యక్రమాలకు శ్రీకారం
చిత్తూరు, తిరుమల, జనవరి 26 (ఆంధ్రజ్యోతి) /పలమనేరు: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ‘యువగళం’ పాదయాత్రకు శుక్రవారం చిత్తూరు జిల్లా కుప్పంలో తొలి అడుగు పడనుంది. యువతను కలుస్తూ, జనం సమస్యలు తెలుసు కుంటూ 400 రోజులపాటు నాలుగువేల కిలోమీటర్ల మేర రాష్ట్రమంతా ఆయన నడవనున్నారు. కుప్పంలోని వరదరాజస్వామి ఆలయం వద్ద పూజలు ముగించుకుని ఉదయం 11.03 గంటలకు లోకేశ్ యాత్రను ఆరంభిస్తారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకుని గురువారం సాయంత్రం 5.42 గంటలకు ఆయన కుప్పం చేరుకున్నారు. ఆర్‌అండ్‌బీ అతిథి గృహానికి చేరుకున్న లోకేశ్‌కు మహిళా నాయకులు హారతులిచ్చి దిష్టి తీశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు తదితర ప్రధాన నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికి శాలువాలతో సన్మానించారు. దాదాపు 40నిమిషాల పాటు 200మంది యువత ఆయనతో ఫొటోలు దిగింది. కొందరిని గుర్తుపట్టి పేర్లతో లోకేశ్ పలకరించారు. మరికొందరిని ...అన్న, తమ్ముడూ అంటూ ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. రాత్రి గెస్ట్‌హౌ్‌సలో నాయకులతో పాదయాత్ర, బహిరంగ సభ ఏర్పాట్ల గురించి చర్చించారు. అనంతరం గెస్ట్‌హౌస్ ప్రాంగణంలో ఉన్న క్యారవాన్‌లో రాత్రి బస చేశారు ఒకరోజు ముందుగానే కుప్పం పట్టణానికి పాదయాత్ర కళ వచ్చేసింది. టీడీపీ కార్యాలయం సమీపంలోని ఓ ప్రైవేటు స్థలంలో బహిరంగ సభ నిర్వహణకు ఏర్పాట్లు టీడీపీ నేతలు పూర్తి చేశారు. ఎమ్మెల్యేలు నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్, మాజీమంత్రి అమరనాథరెడ్డి, చిత్తూరు పార్లమెంటు పార్టీ అధ్యక్షుడు పులివర్తి నాని, మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, కుప్పం నియోజకవర్గ ఇన్‌చార్జి పీఎస్ మునిరత్నం తదితరులు బహిరంగ సభకు, పాదయాత్రకు అవసరమైన ఏర్పాట్లకు తుదిమెరుగులు దిద్దుతున్నారు. 175 నియోజకవర్గాల ఇన్‌చార్జీలు, ప్రధాన నాయకులు, సుమారు 90మంది స్థానిక నాయకులు, నిర్వాహకులతోపాటు టీడీపీ అనుబంధ సంఘాల రాష్ట్ర అధ్యక్షులు సుమారు 300 మంది కూర్చునేలా వేదికను సిద్ధం చేస్తున్నారు. వేదిక మీదకు కూర్చునే వారికి పాసులను అందిస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 3గంటలకు సభ ప్రారంభమవుతుంది. లోకేశ్ వేదిక మీదకు వచ్చాక ఆయన మాత్రమే మాట్లాడతారని పార్టీ వర్గాలు తెలిపాయి.
నాయకగణమంతా కదిలొచ్చే...
టీడీపీ అధినేత చంద్రబాబు మినహా శుక్రవారం నాటి లోకేశ్ పాదయాత్ర ప్రారంభోత్సవానికి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సహా రాష్ట్రంలోని 175 నియోజవర్గాల ఇన్‌ఛార్జిలు, ప్రధాన నాయకులు హాజరుకానున్నారు. గురువారం ఉదయం నుంచే రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి ప్రముఖ టీడీపీ నాయకులంతా కుప్పానికి చేరుకోవడం మొదలయింది. నిమ్మల రామానాయుడు నాలుగు రోజుల ముందే కుప్పం చేరుకుని, ఏర్పాట్లను పర్యవేక్షిస్తుండగా, ఆ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కళా వెంకట్రావు, ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు, ఎమ్మెల్యే బాలవీరాంజనేయ స్వామి, మాజీ మంత్రి దేవినేని ఉమా, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, బీసీ జనార్దన్‌రెడ్డి, టీడీపీ మైనారిటీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ముస్తాక్ అహ్మద్, రాయలసీమ మీడియా కో-ఆర్డినేటర్ బీవీ రాముడు, కుప్పం నియోజకవర్గ పరిశీలకుడు గాజుల ఖాదర్‌బాషా, పట్టాభి తదితర ప్రముఖులతో అనుబంధ సంఘాల రాష్ట్ర అధ్యక్షులు కుప్పంలో పర్యటించి పనులను పర్యవేక్షిస్తున్నారు. ఇంకా ఉమ్మడి చిత్తూరుజిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాలకు చెందిన ద్వితీయశ్రేణి నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చారు. తొలిరోజు బహిరంగ సభకు తొలుత 30 వేల మంది వస్తారని అంచనా వేసినా, ఆ సంఖ్య రెట్టింపయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని బహిరంగ సభ వేదిక సమీపంలో సుమారు 50 వేల మందికి సరిపడేలా మూడు ఫుడ్ కోర్టులను ఏర్పాటు చేశారు.
500 మంది పోలీసులు...
500 మంది పార్టీ వలంటీర్లు
పాదయాత్రకు ముందుగా లోకేశ్ వరదరాజస్వామి ఆలయంలో పూజలు, లక్ష్మీపురంలోని మసీదులో ప్రార్థనలు నిర్వహిస్తారు. పోలీసులు రెండు చోట్లా వేర్వేరుగా బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. చిత్తూరు ఏఎస్పీ జగదీశ్ ఆధ్వర్యంలో పలమనేరు డీఎస్పీ సుధాకర్‌రెడ్డి సహా మరో ముగ్గురు డీఎస్పీలు, సుమారు 500 మంది పోలీసులు తొలిరోజు బందోబస్తు నిర్వహించనున్నారు. హాజరయ్యే జనాలను బట్టి రెండో రోజు నుంచి బందోబస్తులో మార్పులు ఉంటాయి. పోలీసుల ఆంక్షల్లో సూచించినట్లు టీడీపీ నాయకులు తొలి రోజు బహిరంగ సభ, పాదయాత్ర కోసం సుమారు 200 మంది ప్రైవేటు సెక్యూరిటీ బౌన్సర్లను, మరో 500 మంది వలంటీర్లను సిద్ధం చేసుకున్నారు.
లోకేశ్ పాదయాత్రకు కొత్త షరతు
కుప్పం నియోజకవర్గంలో అనేక షరతులతో లోకేశ్ పాదయాత్రకు మూడు రోజుల అనుమతి ఇచ్చిన పోలీసులు, అదనంగా మరొక షరతు విధించారు. మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించడానికి లేదని ఆంక్ష పెట్టారు. మొగిలినుంచి బంగారుపాళ్యం వరకు మోటారు సైకిల్ ర్యాలీకి మాజీ మంత్రి అమరనాథరెడ్డి అనుమతి కోరారు. అందుకు నిరాకరిస్తూ పలమనేరు డీఎస్పీ సుధాకరరెడ్డి కొత్త షరతును ప్రకటించారు. జాతీయ రహదారిపై వందలాది వాహనాలు వెళ్తుంటాయని, అలాంటిచోట మోటారు సైకిల్ ర్యాలీకి అనుమతి ఇవ్వలేమని తేల్చేశారు. పలమనేరు పట్టణం, బంగారుపాళ్యంలో బహిరంగ సభలకు పోలీసులు అనుమతులను నిరాకరించారు.
పాదయాత్రకు శ్రీవారి ఆశీస్సులు
లోకేశ్ తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. సుదీర్ఘ పాదయాత్ర నేపథ్యంలో శ్రీవారి ఆశీస్సులు పొందారు. గురువారం ఉదయం సంప్రదాయ వస్త్రధారణతో వైకుంఠం క్యూకాంప్లెక్స్ ద్వారా ఆలయంలోకి వెళ్లారు. ధ్వజస్తంభానికి మొక్కుకుని తర్వాత గర్భాలయంలోని మూలమూర్తిని దర్శించుకున్నారు. ఆలయం వెలుపలకు వచ్చిన లోకేశ్‌ను కలిసేందుకు కార్యకర్తలు, అభిమానులు ఎగబడ్డారు. అనంతరం తిరుమలలోని ఓ ప్రైవేట్ సత్రంలో జరిగిన మాజీమంత్రి కాల్వ శ్రీనివాసులు కుమారుడి వివాహానికి లోకేశ్ హాజరయ్యారు. ఇదిలాఉండగా, లోకేశ్‌ను క్యూక్లాంప్లెక్స్‌లో గంటకు పైగా నిలిపివేయడం విమర్శలకు దారితీసింది. తిరుమల ఆలయంలో వైసీపీ నాయకులు, వ్యాపారవేత్తలకు అధికారులు ప్రాధాన్యం ఇచ్చి, లోకేశ్‌కు దర్శనం ఆలస్యం చేశారంటూ టీడీపీ నేతలు విమర్శలు చేశారు. శ్రీవారి ఆలయంలోనూ వైసీపీ ప్రభుత్వం చీప్‌ట్రిక్స్ ప్లే చేస్తోందని ఎమ్మెల్సీ బీటెక్ రవి మండిపడ్డారు.
తొలిరోజు షెడ్యూల్...
ఉదయం 10.15: కుప్పం ఆర్‌అండ్‌బీ
గెస్ట్ హౌస్ నుంచి అడుగు బయటకు..
10.30: వరదరాజస్వామి ఆలయంలో పూజలు
11.03: పాదయాత్ర ప్రారంభం...
11.30: లక్ష్మీపురంలోని మసీదులో ప్రార్థనలు
11.55: అర్బన్ హౌస్ ప్రాంతంలోని చర్చిలో ప్రార్థనలు
12.45: బస్టాండు వద్ద అంబేడ్కర్, ఎన్టీఆర్,
పొట్టిశ్రీరాములు, గాంధీ విగ్రహాలకు నివాళులు
2.40: కుప్పంలో కార్యకర్తలతో సమావేశం
3.00: బహిరంగ సభ
4.35: కుప్పం ప్రభుత్వాస్పత్రికి పాదయాత్ర
5.35: శెట్టిపల్లె క్రాస్
6.05: బిజిలిపల్లె క్రాస్
6.45: పీఈఎస్ మెడికల్ కాలేజీ ఎదురుగా రాత్రి బస
యువగళం మీడియా కోఆర్డినేటర్‌గా నాగేంద్ర కుమార్
లోకేశ్ పాదయాత్రకు రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్‌గా ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలానికి చెందిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొత్త నాగేంద్ర కుమార్ నియమితులయ్యారు. నాగేంద్రకుమార్‌కు పార్టీ అధిష్ఠానం ఈ బాధ్యతలు అప్పగించింది. పాదయాత్ర సాగినంతకాలం నిత్యం మీడియాకు సమాచారం ఆయన అందిస్తారు.
యువతలో యమ క్రేజ్
యాత్ర విజయానికి సర్వత్రా పూజలు, మొక్కులు
సామాజిక మాధ్యమాల్లో మార్మోగుతున్న ప్రచారం
తిరుపతి, జనవరి 26(ఆంధ్రజ్యోతి): లోకేశ్ తలపెట్టిన యువగళం పాదయాత్ర టీడీపీ శ్రేణులను ఉర్రూతలూగిస్తోంది. యాత్ర నేపఽథ్యంలో కొద్ది రోజులుగా యువతలో లోకేశ్ పట్ల క్రేజ్ అమాంతం పెరిగిపోతోంది. పాదయాత్ర విజయవంతం కావాలని సర్వత్రా పూజలు, హోమాలు జరిపిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో యువగళం పాదయాత్రకు ప్రచారం వెల్లువలా సాగుతోంది. ఏ ఇద్దరు మాట్లాడుకున్నా పాదయాత్రే చర్చకు వస్తోంది. ఒక్కమాటలో చెప్పాలంటే రాష్ట్రంలో యువగళం పాదయాత్ర హాట్ టాపిక్‌గా మారింది. కొంతకాలంగా టీడీపీ కార్యక్రమాలను అడ్డుకునే రీతిలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుండడం, దానికి కొనసాగింపుగా జీవో-1ని జారీ చేయడంతో పార్టీ శ్రేణుల్లో ప్రతిఘటించే తత్వం మొదలైంది. చంద్రబాబును సొంత నియోజకవర్గమైన కుప్పంలోనే ఆంక్షలు విధించి ఇబ్బంది పెట్టాలని చూడడం శ్రేణులను రగిలించింది. మరోవైపు లోకేశ్ పాదయాత్రకు అనుమతులు ఇవ్వకుండా సాగదీయడం, తర్వాత సవాలక్ష పరిమితులతో అనుమతులు ఇవ్వడం వారిల పట్టుదలను పెంచింది. వీటన్నింటి కారణంగా లోకేశ్ పాదయాత్ర పట్ల పార్టీ శ్రేణుల్లోనూ, ముఖ్యంగా తెలుగు యువతలో ఆసక్తిని పెంచినట్టు కనిపిస్తోంది. ప్రాదయాత్రకు కేవలం 3రోజుల ముందు పోలీసులు అనుమతి ఇవ్వడం, యాత్రకు, బహిరంగసభకు వేర్వేరుగా షరతులు విధించడం కార్యకర్తలకు చిర్రెత్తించింది. ఈ పరిణామాలన్నీ కలగలసి కార్యకర్తలు ఎవరికి వారు పాదయాత్రను వ్యక్తిగత ప్రతిష్ఠగా భావించే పరిస్థితికి తీసుకొచ్చాయి. ఇవే కారణాలతో ప్రత్యేకించి యువతలో లోకేశ్ పట్ల క్రేజ్ పెరిగిపోయింది. సినీనటులకు దీటుగా ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ బయల్దేరింది. టీడీపీని అభిమానించేవారంతా యువగళం లోగోతో పోస్టింగులు పెడుతున్నారు. ఫలితంగా గతంలో ఏ పార్టీ నేతకూ, ఏ సినీ నటుడి కార్యక్రమానికీ రానంత ప్రచారం, హైప్ ప్రారంభానికి ముందే యువగళం పాదయాత్ర సొంతం చేసుకుందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
Updated Date - 2023-01-27T03:37:36+05:30 IST