కుప్పంలో నడిరాత్రి పేలుళ్లు
ABN, First Publish Date - 2023-06-26T23:50:27+05:30
కుప్పంలో ఆదివారం నడిరాత్రి గడిచాక జరిగిన పేలుళ్లు కలకలం సృష్టించాయి. ఈ పేలుళ్లలో స్టీలు గిన్నెల వ్యాపారం చేసుకునే దంపతులకు తీవ్రగాయాలు కాగా.. వారు నివశిస్తున్న ఇల్లు.. వస్తువులు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. ఆ కుటుంబంమీద కక్ష ఉన్న వారెవరో నాటుబాంబులు ప్రయోగించి ఈ విధ్వంసానికి కారణమయ్యారని అనుమానిస్తున్నారు.
ఇల్లు, వస్తువులు ధ్వంసం
నాటుబాంబుగా అనుమానం
కుప్పం, జూన్ 26: కుప్పంలో ఆదివారం నడిరాత్రి గడిచాక జరిగిన పేలుళ్లు కలకలం సృష్టించాయి. ఈ పేలుళ్లలో స్టీలు గిన్నెల వ్యాపారం చేసుకునే దంపతులకు తీవ్రగాయాలు కాగా.. వారు నివశిస్తున్న ఇల్లు.. వస్తువులు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. ఆ కుటుంబంమీద కక్ష ఉన్న వారెవరో నాటుబాంబులు ప్రయోగించి ఈ విధ్వంసానికి కారణమయ్యారని అనుమానిస్తున్నారు. స్థానికులు, పోలీసులు తెలిపిన ప్రకారం.. కుప్పం పట్టణం కొత్తపేట పెద్దపల్లి గంగమాంబ దేవస్థానం వీధిలోని బొరుగుల రాణెమ్మ ఇంట్లో మురుగేశ్, ధనలక్ష్మి దంపతులు అద్దెకు ఉంటున్నారు. వీరికి సత్యవేణి అఅనే 13 ఏళ్ల కుమార్తె ఉంది. గ్రామాలు తిరిగి పాత సామాన్లు పోగేసి, కొత్త స్టీలు సామాన్లు మారకం చేసే వ్యాపారంతో జీవనం సాగిస్తున్నారు. ఆదివారం రాత్రి సుమారు ఒకటిన్నర రెండు గంటల సమయంలో వీరి ఇంటి బయట, తలుపునకు దగ్గరగా ఏదో పేలిన శబ్దం పెద్దగా వినిపించింది. ఉలిక్కిపడి లేచేలోగానే పేలుడు ధాటికి ఇంటి తలుపు ఊడిపోయింది. కిటికీ.. ఇంట్లోని షోకేసుకున్న అద్దాలు పగిలి విరజిమ్మాయి. ఈ అద్దాల ముక్కలు గుచ్చుకుని మురుగేశ్, ధనలక్ష్మి దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరి కుమార్తె బెడ్ మీద పడుకోవడంతో ఆమె స్వల్ప గాయాలతో బయట పడింది. అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన ఈ పేలుడుతో కుప్పం పట్టణం ఉలిక్కి పడింది. స్థానికులు అక్కడికి చేరుకుని పోలీసులకు, 108కు సమాచారమిచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక వివరాలు సేకరించారు. కేసు నమోదు చేశారు. గాయపడిన భార్యాభర్తలను చికిత్సకోసం పీఈఎస్ ఆస్పత్రికి తరలించారు. సోమవారం ఉదయం పోలీసులు మళ్లీ పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టారు. సంఘటనా స్థలం వద్ద అడవి జంతువుల వేటకు ఉపయోగించే ట్వయన్ నాటు బాంబులు పోలీసులకు లభించినట్లు సమాచారం. ఈ బాంబులు ఎక్కడనుంచి వచ్చాయి? పేలుడుకు పాల్పడింది ఎవరు? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కక్షల నేపథ్యంలో వీరిని మట్టుపెట్టడానికి వారి కుటుంబంలోనే నేర చరిత్ర కలిగిన వ్యక్తి ఎవరో ఈ పేలుళ్లకు పాల్పడి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో వీరి కుటుంబం అడవి జంతువుల వేటకు వెళ్లేదని, అప్పట్లో ఉపయోగించిన నాటుబాంబులేవో ఇంట్లో ఉండిపోయి, ప్రమాదవశాత్తు పేలుంటాయన్న మరో వాదన కూడా వినిపిస్తోంది. దీనిపై కుప్పం అర్బన్ సీఐ శ్రీధర్‌ను వివరణ కోరగా.. బాణసంచా పేలుడు వల్లనే ఈ ఘటన జరిగి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. విచారణ పూర్తయ్యాక ఎవరు.. ఎందుకు చేశారన్న విషయంలో స్పష్టత వస్తుందన్నారు.
Updated Date - 2023-06-26T23:50:27+05:30 IST