లక్ష్మీనగర్ కాలనీలో భూవిలువలు రెట్టింపు
ABN, First Publish Date - 2023-05-26T00:37:28+05:30
భూవిలువలు జూన్ ఒకటో తేది నుంచి పెరగనున్న దృష్ట్యా ప్రతిపాదనలను ప్రజల అందుబాటులోకి రిజిస్ట్రేషన్ శాఖ ఉంచింది.
ప్రజలకు అందుబాటులో జాబితా
కొనసాగుతున్న అభ్యంతరాల స్వీకరణ
చిత్తూరు కలెక్టరేట్, మే 25: భూవిలువలు జూన్ ఒకటో తేది నుంచి పెరగనున్న దృష్ట్యా ప్రతిపాదనలను ప్రజల అందుబాటులోకి రిజిస్ట్రేషన్ శాఖ ఉంచింది. వెబ్‌సైట్‌తో పాటు అన్ని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అధికారులు ఉంచారు. చిత్తూరు (ఆర్వో) సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలోని చిత్తూరు నగరపాలక సంస్థ, యాదమరి, గుడిపాల, చిత్తూరు మండలాలకు చెందిన 16 రెవెన్యూ గ్రామాల పరిధిలో స్పెషల్ రివిజన్ ద్వారా భూవిలువల పెంపు జరిగాయి. పలు ప్రాంతాల్లో 20 నుంచి వంద శాతం దాకా భూవిలువలు పెరుగుతాయి. చిత్తూరు నగరంలోని పాత 22వ వార్డుకు చెందిన లక్ష్మీనగర్ కాలనీలో చదరపు గజానికి రూ.7250 నుంచి రూ.14,000, మరి కొన్నిచోట్ల రూ.13,000కు పెంచారు. మురకంబట్టులో రూ.1830 నుంచి రూ.3,000, తేనబండలో రూ.1300 నుంచి రూ.1700 మేర పెరుగుతున్నది. యాదమరి మండలం కుక్కలపల్లిలో రూ.1830 నుంచి రూ.2,000, యాదమరి కేంద్రం, మాధవరంలో రూ.780 నుంచి రూ.1,100, పెరియంబాడిలో రూ.560 నుంచి రూ.700, జంగాలపల్లె, 189 కొత్తపల్లిలో రూ.630 నుంచి రూ.800, గుడిపాల మండలంలోని గుడిపాల, నంగమంగళం తదితర ప్రాంతాల్లో రూ.780 నుంచి రూ.1,100, అదేవిధంగా 36, 37, 39 వార్డుల్లోని నరిగపల్లి, వరిగపల్లి, మాపాక్షిల్లో రూ.930 నుంచి రూ.1200కు పెరగనున్నాయి. వీటితో పాటు కట్టమంచి, గాండ్లపల్లి, చెన్నై - బెంగుళూరు జాతీయ రహదారుల వెంబడి వున్న గ్రామాల్లో, 2021 వ్యవసాయేతర భూములుగా మార్పుచెందిన ప్రాంతాల్లో 10 నుంచి 30 శాతం వరకు భూ విలువలు పెరగనున్నాయి.
Updated Date - 2023-05-26T00:37:28+05:30 IST