మత్తులో యువత!
ABN, First Publish Date - 2023-04-03T01:30:40+05:30
తిరుపతి, చంద్రగిరి నియోజకవర్గాల్లో విద్యార్థులు గంజాయికి బానిసలవుతున్నారు. గంజాయి వల్ల యువత తమ బంగారు భవిష్యత్తును కోల్పోతున్నారు. పాఠశాల, కళాశాలల్లోనే గంజాయి దొరకడాన్ని బట్టి చూస్తే వైసీపీ ప్రభుత్వం గంజాయి స్మగ్లర్లకు కొమ్ముకాస్తోంది - యువగళం పాదయాత్రలో నారా లోకేశ్ విమర్శ
తిరుపతి, చంద్రగిరి నియోజకవర్గాల్లో విద్యార్థులు గంజాయికి బానిసలవుతున్నారు. గంజాయి వల్ల యువత తమ బంగారు భవిష్యత్తును కోల్పోతున్నారు. పాఠశాల, కళాశాలల్లోనే గంజాయి దొరకడాన్ని బట్టి చూస్తే వైసీపీ ప్రభుత్వం గంజాయి స్మగ్లర్లకు కొమ్ముకాస్తోంది
- యువగళం పాదయాత్రలో నారా లోకేశ్ విమర్శ
ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల్లేక రాష్ట్రంలో యువత గంజాయి, డ్రగ్స్, మద్యం వ్యసనాలకు బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకొంటున్నారు. జగన్ పాలనలో గంజాయి, అక్రమ రవాణాల్లో ఏపీ ప్రథమ స్థానంలో ఉందని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో చెబుతోంది. 2021లో గంజాయి, మత్తు పదార్థాలకు బానిసలై రాష్ట్రంలో 571 మంది యువత ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎన్‌సీఆర్‌బీ నివేదిక వెల్లడిస్తోంది. జగన్ అసమర్థత, చేత కాని పాలనే వీటన్నింటికి కారణం.
- మీడియాతో మాజీ మంత్రి అమరనాథరెడ్డి
ఫ పలమనేరు మండలం అటవీ సరిహద్దు ప్రాంతమైన చెత్తపెంటకు చెందిన ఓ వ్యక్తి తన పొలంలోనే గంజాయి సాగుచేశాడు. పోలీసులకు సమాచారం తెలియడంతో 1.2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఫ గత ఏడాది చివర్లో రేణిగుంటలో పనిచేసే రైల్వే కానిస్టేబుల్ గంజాయిని అక్రమ రవాణా చేస్తూ పట్టుబడ్డాడు. అతడితోపాటు మరో ఇద్దరిని అరెస్టు చేసి రూ.50వేల విలువైన 3.6 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే.
- చిత్తూరు
రాత్రికి రాత్రే లక్షాధికారులు కావాలనుకునే స్మగ్లర్లు వివిధమార్గాల్లో మత్తు పదార్థాలను జిల్లాలోకి తెచ్చి విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. దీనివల్ల యువతతోపాటు రోజువారీ కూలీలు మత్తు పదార్థాలకు బానిసలుగా మారుతున్నారు. వీటిని అరికట్టాలని జిల్లాస్థాయి అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తున్నప్పటికీ కిందిస్థాయిలో అమలు కావడం లేదన్న విమర్శలున్నాయి.
జోరుగా అక్రమ రవాణా
జిల్లాలో గంజాయి, సారా, హాన్స్, పాన్‌పరాగ్, డ్రగ్స్ తదితర మత్తుపదార్థాల అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. గతంలో తమిళనాడు, కర్ణాటక రాష్ర్టాల నుంచి హాన్స్, పాన్‌పరాగ్ మాత్రమే జిల్లాకు సరఫరా అవుతుండేది. ఇపుడు వైజాగ్ నుంచి గంజాయి కూడా జిల్లాకు వచ్చేస్తోంది. గతంలో చిన్నచిన్న పొట్లాల్లో వస్తుంటే.. ఇప్పుడు కిలోల లెక్కన వస్తోంది. ఇటీవల పలమనేరు డివిజన్‌లో 96 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, ముగ్గురిని అరెస్టు చేయడమే దీనికి నిదర్శనం.
మత్తులోనే ఎక్కువ నేరాలు
పోలీస్ స్టేషన్లలో నమోదవుతున్న నేరాల్లో అత్యధికంగా మత్తులో జరిగినవి కావడం గమనార్హం. ఘర్షణలు, యువతులపై అఘాయిత్యాలకు పాల్పడిన వారిలో ఎక్కువమంది గంజాయి, మద్యం, డ్రగ్స్ వంటివి తీసుకుంటున్నారని గుర్తించారు.
నమోదైన కేసుల వివరాలిలా..
2022లో గంజాయిపై 25 కేసులు నమోదయ్యాయి. 123 కిలోలు స్వాధీనం చేసుకుని 86 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. 2023లో ఇప్పటివరకు ఆరు కేసులు నమోదవగా, 105 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని పదిమందిని అరెస్టు చేశారు. గత ఏడాది నవంబరు ఆరో తేదీన చిత్తూరులో 34 గ్రాముల ఎండీఎం డ్రగ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని సూడాన్ దేశస్తుడితోపాటు తొమ్మిదిమందిని అరెస్టు చేశారు. ఎక్సైజ్ కేసుల్లో 2022లో 1,243 కేసులు నమోదు చేసి 9,779 లీటర్ల సారా సీజ్‌చేసి, 1,518 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. 2023లో ఇప్పటివరకు 95 కేసులు నమోదు చేసి 500 లీటర్ల సారా స్వాధీనం చేసుకుని 97 మందిని అరెస్టు చేశారు.
విక్రయదారులపై పీడీ యాక్టు నమోదు చేస్తాం
యువత గంజాయికి బానిసలైతే వారి జీవితం నాశనమైపోతుంది. ఇప్పటికే కళాశాలలు, పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. యువత కూడా తమవంతు బాధ్యతగా పోలీసులకు సహకరించాలి. గంజాయి మంచి సంస్కృతి కాదు. విక్రయదారులపై ప్రత్యేక నిఘా ఉంచాం. ఇలాంటి వారిపై పీడీ యాక్టు పెట్టడానికీ వెనుకాడం.
- శ్రీనివాసమూర్తి, డీఎస్పీ, చిత్తూరు
Updated Date - 2023-04-03T01:30:40+05:30 IST