సలహాదారు పదవి నాకొద్దు
ABN, First Publish Date - 2023-03-05T03:48:34+05:30
తిరుమల తిరుపతి దేవస్థానాల ధార్మిక సలహాదారు పదవిని సుప్రసిద్ధ ప్రవచనకారుడు చాగంటి కోటేశ్వరరావు తిరస్కరించారు. తిరుపతిలో టీటీడీ అనుబంధ విభాగాలైన హిందూ ధర్మప్రచార పరిషత్, ఎస్వీబీసీ కార్యనిర్వాహక కమిటీల సమావేశాలు గత జనవరి 20న జరిగాయి.
టీటీడీ ధార్మిక సలహాదారు పోస్టును తిరస్కరించిన చాగంటి
తిరుపతి, మార్చి 4(ఆంధ్రజ్యోతి): తిరుమల తిరుపతి దేవస్థానాల ధార్మిక సలహాదారు పదవిని సుప్రసిద్ధ ప్రవచనకారుడు చాగంటి కోటేశ్వరరావు తిరస్కరించారు. తిరుపతిలో టీటీడీ అనుబంధ విభాగాలైన హిందూ ధర్మప్రచార పరిషత్, ఎస్వీబీసీ కార్యనిర్వాహక కమిటీల సమావేశాలు గత జనవరి 20న జరిగాయి. ఆ సమావేశంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి ధార్మిక సలహాదారుగా చాగంటి కోటేశ్వరరావును నియమించాలని సభ్యులు సూచించడంతో ఆ మేరకు కమిటీ నిర్ణయం తీసుకుంది. టీటీడీ బోర్డు చైౖర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్వయంగా ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. తర్వాత ఫిబ్రవరి 23న చాగంటి సతీసమేతంగా సీఎం నివాసానికి వెళ్లి జగన్‌ను కలిశారు. సీఎం ఆయన్ను సత్కరించి పంపించారు. రేపో, మాపో ఆయన నియామకానికి సంబంధించిన ఉత్తర్వులు వస్తాయని భావిస్తున్న తరుణంలో ఓ వెబ్‌సైట్‌కు చాగంటి ఇచ్చిన ఇంటర్వ్యూ హఠాత్తుగా వెలుగులోకి వచ్చింది. వారం రోజుల కిందట ఇచ్చినట్టు భావిస్తున్న ఈ ఇంటర్వ్యూలో చాగంటి తనకు టీటీడీ ధార్మిక సలహాదారు పదవి అవసరం లేదని వెల్లడించారు.
‘‘నామీద నమ్మకంతో, గౌరవంతో టీటీడీ ధర్మ ప్రచార పరిషత్‌కు గౌరవ సలహాదారుగా నియమించాలని భావించారు. దానికి టీటీడీ ధర్మకర్తల మండలికి, అధ్యక్షుడికి, కార్యనిర్వాహణాధికారికి కృతజ్ఞతలు. అసలు సలహాదారు అంటే ఏమిటి? ఎపుడైనా ధర్మప్రచార పరిషత్ సమావేశం కావాలి. అప్పుడు ఏదైనా అనుమానం రావాలి. ఇది చేస్తే సమాజానికి పనికొస్తుందా అని. అలాంటి అవకాశమే ఉండదు. పరిషత్‌లో బోలెడంత మంది సభ్యులు, అధ్యక్షులు ఉంటారు. కార్యనిర్వహణాధికారి ఉంటారు. వారంతా విశేషమైన అనుభవశాలురు, వారికి అనుమానం వచ్చే అవకాశమే తక్కువ.... వస్తే నన్ను అడగాలి. అడిగితే అంతమందికి తట్టని సలహా చెప్పే శక్తి నాకు ఉండాలి. దానికి పదవి ఎందుకు? నా వల్ల ఈ పని జరుగుతుంది. నువ్వు వచ్చి ఈ పనిచేసి పెట్టు అని అడగాలే కానీ అవకాశం ఉంటే పరుగున వచ్చి చేస్తా. పదవిలో ఉంటేనే చేస్తా అనే మాటే లేదు’’ అంటూ ముగించారు.
అయోమయంలో టీటీడీ వర్గాలు
చాగంటి కోటేశ్వరరావు ఇంటర్వ్యూలో సున్నితంగా వివరణ ఇచ్చినప్పటికీ అసలు కారణం అదేనా? లేక తెర వెనుక ఇంకేదైనా కారణాలు ఉన్నాయా? అన్నది అంతుబట్టక టీటీడీ వర్గాలు అయోమయంలో పడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుల విషయంలో హైకోర్టు ఇప్పటికే తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ప్రవచనకారుడిగా పేరు ప్రతిష్ఠలు కలిగిన ఆయన కోర్టు వ్యాఖ్యల నేపథ్యంలోనే వెనుకడుగు వేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ సలహాదారుల నియామకాన్ని కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు వెల్లడిస్తే అది తన ప్రతిష్ఠకు తగింది కాదని ఆయన భావించి ఉంటారని, అందుకే తిరస్కరించి ఉండొచ్చని అత్యధికులు భావిస్తున్నారు.
Updated Date - 2023-03-05T03:48:34+05:30 IST