రిజిస్ట్రేషన్లకు ఇక ‘ఈ స్టాంపింగ్’
ABN, First Publish Date - 2023-05-11T01:14:10+05:30
రిజిస్ట్రేషన్లకు ‘ఈ స్టాంపింగ్’ను ప్రభుత్వం గురువారం నుంచి అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటి వరకున్న నాన్ జుడీషియల్ స్పెషల్ అడ్హెసివ్ ఫ్రాంకింగ్ స్టాంపు పేపర్ల విధానంలో ప్రభుత్వం మార్పులు తీసుకొచ్చింది.
చిత్తూరు కలెక్టరేట్, మే 10: రిజిస్ట్రేషన్లకు ‘ఈ స్టాంపింగ్’ను ప్రభుత్వం గురువారం నుంచి అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటి వరకున్న నాన్ జుడీషియల్ స్పెషల్ అడ్హెసివ్ ఫ్రాంకింగ్ స్టాంపు పేపర్ల విధానంలో ప్రభుత్వం మార్పులు తీసుకొచ్చింది. ఈ వివరాలను బుధవారం సాయంత్రం చిత్తూరులో రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీ గిరిబాబు మీడియాకు వెల్లడించారు. ఎంపిక చేసిన బ్యాంకులు, సీఎ్‌సఈ కేంద్రాలు, ఈ-సేవా కేంద్రాల్లో ఈ-స్టాంపు పత్రాలు లభిస్తాయన్నారు. ఇందుకోసం చిత్తూరు జిల్లాలో 46, తిరుపతి బాలాజీ రిజిస్ట్రేషన్ జిల్లా పరిధిలో 48 చొప్పున 94 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. అవసరమైతే మరిన్ని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఈ-స్టాంపు పత్రాల కొనుగోలు తర్వాత సులభంగా స్టాంపుడ్యూటీ, రిజిస్ట్రేషన్ రుసుం, యూజర్ ఛార్జీలు చెల్లించి దస్తావేజుతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో దాఖలు చేయొచ్చన్నారు. ఈ-స్టాంపు పేపర్లను డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ కోసం వినియోగించుకోవచ్చన్నారు. స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎస్‌హెచ్‌సీఐఎల్) ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నాన్-జుడీషియల్ పత్రాలు, స్టాంపుల స్థానంలో ఈ సేవలను అమల్లోకి తెచ్చినట్లు వివరించారు. వీరు ప్రభుత్వానికి, ఇటు కలెక్షన్ సెంటర్లకు సంధానకర్తలుగా వ్యవహరిస్తారన్నారు. ప్రస్తుతమున్న స్టాంపు వెండర్లు కూడా ఇందులో ఏజెంట్లుగా నియమితులు కావచ్చన్నారు. దీనికోసం వీరు ఆథరైజ్డ్ కలెక్షన్ సెంటర్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఇంకా, గుర్తింపు పొందిన బీమా, ఫైనాన్స్ సంస్థలు, బ్యాంకులు కూడా లైసెన్సులు పొందవచ్చని తెలిపారు. వీరి నియామకాల కోసం ప్రభుత్వం కొన్ని నిబంధనలు జారీచేసిందన్నారు. ప్రజలకు సులభంగా, సత్వరం పారదర్శక సేవలు అందించడానికి ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చినట్లు చెప్పారు. ఆథరైజ్డ్ కలెక్షన్ సెంటర్ల లైసెన్సుదారులు ఆయా సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలోనే పనిచేయాల్సి ఉంటుందని జిల్లా రిజిస్ట్రార్ శ్రీనివాసరావు స్పష్టంచేశారు. ఎట్టి పరిస్థితిలోనూ పరిధి దాటి విక్రయించరాదన్నారు. ఏసీసీ లైసెన్సుదారుల జాబితా జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో లభిస్తుందని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాల్లోని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఉన్న రూ.10 నుంచి రూ.100 విలువ గల జుడీషియల్ స్టాంపు పత్రాలు, స్టాంపులు కూడా చెలామణిలో ఉంటాయని ఆయన చెప్పారు. స్టాంపు పత్రాలు, స్టాంపుల నిల్వలు తగినంతగా లేకుంటే పొరుగు జిల్లాలనుంచి సర్దుబాటు చేస్తున్నామని వివరించారు. నాన్ జుడీషియల్ స్టాంపులు కృత్రిమ కొరత సృష్టించినా, అధిక ధరలకు విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Updated Date - 2023-05-11T01:14:10+05:30 IST