సమసిన పోలాక్షమ్మ ఆలయ వివాదం
ABN, First Publish Date - 2023-08-21T01:43:04+05:30
పుత్తూరు మండల పరిధిలోని రామకృష్టాపురం పంచాయతీ, గొల్లపల్లెలో ఉన్న పోలాక్షమ్మ ఆలయం కేంద్రంగా తలెత్తిన వివాదం ఆదివారం పోలీసుల జోక్యంతో పరిష్కారమైంది.
పుత్తూరు అర్బన్/టౌన్, ఆగస్టు 20 : పుత్తూరు మండల పరిధిలోని రామకృష్టాపురం పంచాయతీ, గొల్లపల్లెలో ఉన్న పోలాక్షమ్మ ఆలయం కేంద్రంగా తలెత్తిన వివాదం ఆదివారం పోలీసుల జోక్యంతో పరిష్కారమైంది. దళితుల్లోని తెలుగు, తమిళ వర్గాల మధ్య నెలకొన్న విభేదాలకు ఆలయం కేంద్రమైంది. స్థానికుల కథనం మేరకు .... దాదాపు 40 సంవత్సరాల తర్వాత పోలాక్షమ్మ ఆలయానికి తిరణాలు నిర్వహించారు.ఇందులో భాగంగా చుట్టుపక్కలున్న ఏడు గ్రామాలకు ఒక్కో రోజు ఒక ఉభయం లెక్కన ఉత్సవాలు నిర్వహించే విధంగా ఆలయ ధర్మకర్తలు తీర్మానించారు. ఇందులో భాగంగా చివరి రోజైన ఆదివారం అమ్మవారు గొల్లపల్లె దళిత వాడకు వెళ్లి పూజలు అందుకోవాల్సి ఉంది. అయితే ఇక్కడే సమస్య మొదలైంది. దళితవాడలో తెలుగు, తమిళుల మధ్య కొన్ని సంవత్సరాల నుంచి విభేదాలున్నాయి. దీంతో అమ్మవారు ప్రత్యేకంగా తమ వీధిలోకి రావాలని తమిళ సంస్కృతి అనుసరించే దళితులు పట్టుబట్టారు. దీనికి ధర్మకర్తలు ఒప్పుకోకపోవడంతో సమస్య మొదలైంది. శనివారం సాయంత్రం అమ్మవారికి నివేదన సమర్పించేందుకు తమిళ సంస్కృతి అనుసరించే దళితులు ఆలయానికి వెళ్లారు. అప్పటికే పూజలు పూర్తి కావడంతో పూజారి ఆలయానికి తాళాలు వేసి ఇంటికి వెళ్లారు. దీంతో అపార్థం చేసుకున్న దళితులు తమకు ఆలయ ప్రవేశం కల్గించకుండా ఉండేందుకే ఆలయానికి తాళాలు వేశారని నిరసనకు దిగారు.చివరకు ఆలయం బయటే పొంగళ్లు పెట్టి మొక్కులు తీర్చుకున్నారు.ఈ నేపథ్యంలో దళితులు ప్రవేశించకుండా పోలాక్షమ్మ ఆలయానికి తాళాలు వేశారని, తమకు న్యాయం చేయాలని దళిత హక్కుల పోరాట సమితి జిల్లా ఉపాధ్యక్షుడు మహేష్, కేవిపీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటేష్, దళిత సంఘాల నాయకుడు నందయ్య కలిసి ఆదివారం పుత్తూరు తహసీల్దారుకు వినతి పత్రం అందజేశారు. అనంతరం పుత్తూరు ఎస్‌ఐకి ఫిర్యాదు చేశారు.స్థానిక అంబేద్కర్ సర్కిల్ వద్ద నిరసన వ్యక్తం చేశారు.వివాదం ముదురుతుండడంతో ఆలయ ధర్మకర్తలు, గ్రామస్తులు, దళితులతో సీఐ లక్ష్మీనారాయణ చర్చించారు. శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా సహకరించాలని కోరారు. అమ్మవారిని ఆలయంలోనే ఉంచి దళితులతో పూజలు చేయించారు.
Updated Date - 2023-08-21T01:43:04+05:30 IST