ఎన్నికల నిబంధనలపై అవగాహన పెంచుకోండి
ABN, First Publish Date - 2023-09-22T00:52:21+05:30
త్వరలో జరగనున్న ఎన్నికలకు సంబంధించి నియమ నిబంధనలపై అవగాహన పెంచుకోవాలని అధికారులకు కలెక్టర్ షన్మోహన్ సూచించారు.
అధికారులకు కలెక్టర్ సూచన
చిత్తూరు కలెక్టరేట్, సెప్టెంబరు 21: త్వరలో జరగనున్న ఎన్నికలకు సంబంధించి నియమ నిబంధనలపై అవగాహన పెంచుకోవాలని అధికారులకు కలెక్టర్ షన్మోహన్ సూచించారు. కలెక్టరేట్‌లో గురువారం ఫొటో ఓటర్ల ప్రత్యేక సంక్షిప్త సవరణ జాబితాకు సంబంధించి అధికారులతో ఆయన సమీక్షించారు. ఓటరు జాబితా తయారీలో మండలస్థాయిలో తహసీల్దార్లు ప్రధాన భూమిక పోషించాలన్నారు. మార్పులు- చేర్పులు- తొలగింపులకు సంబంధించి ఇప్పటివరకు అందిన క్లెయిమ్‌లను తహసీల్దార్లు క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు. మరణాలు, వలస, డూప్లికేట్ ఓట్లను నిశితంగా పరిశీలించాలని సూచించారు. ఓటరు జాబితా నుంచి తొలగించిన ఓట్లను బీఎల్వోలు అందుకు సంబంధించిన డాక్యుమెంట్లు సక్రమంగా ఉన్నాయో లేవో పోలింగ్ స్టేషన్ల వారీగా పరిశీలించాలన్నారు. ఎంఈవోలు, సర్వేయర్, డిజిటల్ అసిస్టెంట్లతో మండలస్థాయి బృందాలు, అదేవిధంగా నియోజకవర్గస్థాయిలోనూ బృందాలు ఏర్పాటు కావాలన్నారు. జేసీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. 18 సంవత్సరాలు నిండిన యువత తమ ఓటుహక్కును వినియోగించుకునేందుకు స్వీప్ యాక్టివిటీని ఇంజినీరింగ్, డిగ్రీ కళాశాలల్లో ఏర్పాటు చేయాలన్నారు. పోలింగ్ స్టేషన్ల రేషనలైజేషన్ తదితర అంశాలపైనా సమీక్షించారు. ఈ సమావేశంలో డీఆర్వో రాజశేఖర్, పలమనేరు, చిత్తూరు ఆర్డీవోలు శివయ్య, రేణుక, అధికారులు పాల్గొన్నారు.
Updated Date - 2023-09-22T00:52:21+05:30 IST