బడి బిక్కు బిక్కు
ABN, First Publish Date - 2023-08-02T01:44:51+05:30
ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు సమూలంగా మార్చేస్తామని నాడు గొప్పలు చెప్పారు. నిధుల కొరతతో పనులు ముందుకు సాగక నేడు విద్యార్థులు తిప్పలు పడుతున్నారు. ఆయా పాఠశాలల్లో అసంపూర్తి నిర్మాణాలు విద్యార్థులకు ప్రాణగండంగా మారాయి.
ఆగిన నాడు నేడు పనులు
ఎక్కడికక్కడ గుంతలు.. నిర్మాణ సామగ్రి నిల్వలతో తంటాలు
తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల్లో ఆందోళన
రెండో విడతలో ఎంపికైన పాఠశాలలు: 1210
మంజూరైన పనులు: 2069
అంచనా వ్యయం: రూ.449.80 కోట్లు
విడుదలైన నిధులు: రూ.176.28 కోట్లు
ఖర్చు చేసింది: రూ.167.25 కోట్లు
ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు సమూలంగా మార్చేస్తామని నాడు గొప్పలు చెప్పారు. నిధుల కొరతతో పనులు ముందుకు సాగక నేడు విద్యార్థులు తిప్పలు పడుతున్నారు. ఆయా పాఠశాలల్లో అసంపూర్తి నిర్మాణాలు విద్యార్థులకు ప్రాణగండంగా మారాయి.
- చిత్తూరు, ఆంధ్రజ్యోతి
జిల్లాలో రెండో విడత నాడు నేడు కింద 1210 పాఠశాలల్ని ఎంపిక చేశారు. రూ.449.80 కోట్ల అంచనా వ్యయంతో అదనపు గదులు, ప్రహరీ, మరుగుదొడ్లు వంటి 2069 నిర్మాణాలు ఏడాది కిందట ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది వేసవి సెలవుల్లో పనులు వేగవంతం చేసి పూర్తి చేస్తామని చెప్పినా, పాఠశాలల పునఃప్రారంభ సమయానికి పనులు పూర్తి కాలేదు. నాడు నేడు పనులు జరిగే ఆయా పాఠశాలల ప్రాంగణాల్లో అదనపు గదులు, ప్రహరీల నిర్మాణాల కోసం తవ్విన గుంతలు దర్శనమిస్తున్నాయి. వాటితో పాటు మూతలు వేయని మరుగుదొడ్ల సెప్టిక్ ట్యాంకులు ప్రమాదకరంగా మారాయి. కంకర కుప్పలు, కమ్మీలు వంటివి వాటితో విద్యార్థులకు అపాయం పొంచి ఉంది. పాఠశాలలు పునఃప్రారంభమై రెండు నెలలు పూర్తి కావస్తున్నా, ఏడాది కిందట ప్రారంభమైన ఈ నాడు నేడు పనులు మాత్రం పూర్తి కావడం లేదు. అధికారులను ఎప్పుడు అడిగినా నెల రోజుల్లో పూర్తి చేస్తామని చెబుతున్నారే కానీ.. పనులు ముందుకు సాగడంలేదు. దీనికి కారణం నిధుల కొరత, సమయానికి సామగ్రి రాకపోవడమని సమాచారం. ఇలాంటప్పుడు విద్యార్థులకు ఏ సమయంలో ఏం జరుగుతుందోనని తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయుల్లోనూ ఆందోళన నెలకొంది.
గుర్తుందా తెల్లరాళ్లపల్లె విషాదం
నాడు నేడు పనులు జరుగుతున్న పాఠశాలల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు కనీస రక్షణ చర్యలు చేపట్టడం లేదనడానికి జూన్ 22న యాదమరి మండలంలో జరిగిన విషాద ఘటనే నిదర్శనం. తెల్లరాళ్లపల్లె ప్రాథమికోన్నత పాఠశాలలో నాడు నేడు పనుల్లో భాగంగా మరుగుదొడ్డి కోసం ఏడు అడుగుల గుంత తవ్వారు. అలాగే వదిలేశారు. పాఠశాల ఆవరణలోని ఈ గుంతపక్క నుంచే స్థానికులు అటువైపు వెళుతున్నారు. వర్షానికి ఆ గుంత నిండా నీళ్లు ఉన్నాయి. ఈ క్రమంలో అటుగా వెళుతున్న అక్కా తమ్ముడు పూర్ణశ్రీ (11), మదన్ (2) పొరపాటున ఆ గుంతలో పడిపోయారు. ఎవరూ చూసుకోకపోవడంతో అసువులు బాశారు.
సకాలంలో పూర్తి చేస్తాం
నాడు నేడు రెండో విడత కింద జిల్లాకు రూ.449.80 కోట్ల అంచనాతో 2069 పనులు చేపట్టాం. ఇప్పటివరకు 37శాతం నిధుల్ని ఖర్చు చేశాం. జిల్లాకు విడుదలై ఖర్చు చేయగా, మిగిలిన నిధులు రూ.9.40 కోట్లు పేరంట్స్ కమిటీ ఖాతాల్లో ఉన్నాయి. ఈ పనుల్ని సకాలంలో పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతున్నాం.
- వెంకటరమణారెడ్డి, ఏపీసీ, సమగ్రశిక్ష, చిత్తూరు
పాఠశాలల్లో ఇలా..
గొయ్యితో ప్రమాదం
రామకుప్పం మండలం కెంపసముద్రం ఉన్నత పాఠశాలలో అదనపు గదులు, మరుగుదొడ్లను నిర్మించేందుకు రెండో విడత నాడు నేడు కింద ఎంపిక చేశారు. మరుగుదొడ్ల నిర్మాణం తుది దశకు చేరుకోగా, ఇప్పటికే ఉన్న భవనాల మీద చేపట్టిన అదనపు గదుల నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. ప్రాంగణంలోనే అదనపు గదుల సముదాయం నిర్మాణం కోసం ఆరు నెలల కిందట తవ్విన గుంతల్ని అలాగే వదిలేశారు. సుమారు ఏడు అడుగుల లోతున్న ఈ గుంతలు పాఠశాల ప్రాంగణంలో ప్రమాదకరంగా ఉన్నాయి.
- రామకుప్పం
ఆరుబయట చదువు
పలమనేరు బాలికల ఉన్నత పాఠశాలలో 20 అదనపు తరగతి గదుల్ని నిర్మించేందుకు రూ.2.37 కోట్ల అంచనాతో వ్యయంతో నాడు నేడు కింద ఎంపిక చేశారు. ఏడాది కిందట ప్రారంభమైన పనులు ఇంకా పూర్తి కాలేదు. గదులు చాలకపోవడంతో విద్యార్థులు నిత్యం ప్రాంగణంలోని చెట్ల కింద చదువుకుంటున్నారు.
- పలమనేరు
నిధులు విడుదలకాక.. మొండిగోడలతో ఇలా
పుంగనూరు ప్రభుత్వ బసవరాజ ఉన్నత పాఠశాలలో 10 అదనపు తరగతి గదుల్ని నిర్మించేందుకు రూ.1.19 కోట్లతో నాడు నేడు రెండో విడతలో ఎంపిక చేశారు. ఇప్పటికి రూ.53 లక్షలతో గోడల నిర్మాణం పూర్తయింది. మిగిలిన నిధులు విడుదల కాకపోవడంతో సుమారు ఆరు నెలలుగా పనులు ఆగిపోయి ఉన్నాయి.
- పుంగనూరు
పునాదుల్లోనే వంట గది
నగరి మండలం కాకవేడు ప్రాథమికోన్నత పాఠశాలలో వంట గది, మరుగుదొడ్లు, నీళ్ల ట్యాంకు నిర్మించేందుకు రూ.6.22 లక్షలతో నాడు నేడు కింద ఎంపిక చేశారు. మరుగుదొడ్లు 60 శాతం పనులు జరిగాయి. వంట గది నిర్మాణం మాత్రం పునాదులకే పరిమితమై ఉంది. నీళ్ల ట్యాంకు నిర్మాణం అసలు ప్రారంభమే కాలేదు.
- నగరి
Updated Date - 2023-08-02T01:44:51+05:30 IST