ఏపీ రాజధాని ఏంటో చెప్పగలరా?
ABN, First Publish Date - 2023-07-14T01:07:49+05:30
: తెలంగాణలో విద్యావ్యవస్థ అధ్వానంగా ఉందంటూ ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర మంత్రులు మండిపడ్డారు.
అనవసరంగా నోరు పారేసుకోవద్దు
బొత్స వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రుల ధ్వజం
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్): తెలంగాణలో విద్యావ్యవస్థ అధ్వానంగా ఉందంటూ ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర మంత్రులు మండిపడ్డారు. తెలంగాణ అభివృద్ధిని చూసి ఏపీ మంత్రులు ఓర్వలేకపోతున్నారని, అక్కసుతోనే ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంటో చెప్పలేని వారు.. తమపై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి, ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బొత్స తన మాటలను బేషరతుగా వెనక్కి తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. విద్యారంగ అభివృద్ధికి బీఆర్‌ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. టీఎ్‌సపీఎస్సీ పేపర్ లీకేజీపై విచారణకు సిట్‌ను ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్.. దోషులను కఠినంగా శిక్షించడానికి చర్యలు తీసుకున్నారన్నారు. ఏపీలో నాడు-నేడు కార్యాక్రమం ద్వారా విద్యార్థులకు ఏం చేశారో మంత్రి బొత్స చెప్పగలరా? అని ప్రశ్నించారు. కాగా, తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేకే ఆంధ్రా మంత్రులు ఆరోపణలు చేస్తున్నారని మంత్రి శ్రీనివా్‌సగౌడ్ విమర్శించారు. పోటీ పరీక్షల్లో ఏపీ రాజధాని ఏంటని అడిగితే సమాధానం రాయలేని పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోవడానికి బొత్స వంటి వ్యక్తులే కారణమని విమర్శించారు. ఏపీలో కులాల పిచ్చి, ప్రజలను రెచ్చగొట్టే రాజకీయాలు నడుస్తున్నాయని తాము ఎప్పుడైనా అన్నామా? అని ప్రశ్నించారు. వోక్స్ వాగన్ లాంటి స్కామ్‌లు ఇప్పటికీ జరుగుతున్నాయని బొత్స అనుకుంటున్నారేమో? అని వ్యగ్యంగా విమర్శించారు. మంత్రి బొత్స అనవసరంగా నోరు పారేసుకోవడం మంచిది కాదని, ఏదిపడితే అది మాట్లాడి అభాసుపాలు కావొద్దనిమంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ హితవు పలికారు. ‘‘వాళ్లది వాళ్లు చూసుకోకుండా.. మనం సరిగ్గా ఉన్నామా? లేదా? అని చూసుకోకుండా తెలంగాణ ప్రభుత్వంపై బొత్స మాట్లాడటం సిగ్గుచేటు’’ అని అన్నారు. తెలంగాణపై విషం చిమ్ముతున్న బొత్స సత్యనారాయణను వెంటనే మంత్రి పదవి నుంచి తొలగించాలని, లేకుంటే తెలంగాణపై విషం చిమ్మే కుట్రలో జగన్ ప్రమేయం ఉన్నట్లేనని తాము భావిస్తామని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. ఉద్యోగ నియామకాల్లో అక్రమాలకు పాల్పడిన వారిని తాము జైలుకు పంపించామని, ఏపీలో ఏకంగా మంత్రులు, ఎమ్మెల్యేలే ఉద్యోగాలను అమ్ముకుంటున్నారని, రూ.5లక్షలు ఇస్తేనే బదిలీలు చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ, ఆంధ్ర పాలకుల మధ్య ఉన్న వ్యత్యాసం ఇదేనని చెప్పారు. మరో సారి తెలంగాణ జోలికి వస్తే సహించేది లేదని, బొత్స క్షమాపణ చెప్పిన తర్వాతే హైదరాబాద్‌లో అడుగుపెట్టాలన్నారు.
Updated Date - 2023-07-14T01:07:49+05:30 IST