మా డబ్బులు ఏమైపోతున్నాయి?
ABN, First Publish Date - 2023-01-29T03:06:37+05:30
‘ఉద్యోగులు వైద్యం కోసం చెల్లిస్తున్న డబ్బులేమైపోతున్నాయి? నెట్‌వర్క్ ఆసుపత్రులకు వెళ్తుంటే ప్రభుత్వమే బకాయి ఉందని వైద్యం చేయడం లేదు’ అని ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆందోళన వ్యక్తం
వైద్యసేవలు కూడా సక్రమంగా అందడం లేదు
2014లో ప్రతి ఉద్యోగి రూ.95 చెల్లించేవారు
ఇప్పుడు దానికి మూడు రెట్లు చెల్లిస్తున్నాం
5న పోరుకు సిద్ధం: బొప్పరాజు
మా సమస్యలు ఎవరికి చెప్పుకోవాలి?
వచ్చే నెల 5న ఉద్యమానికి సిద్ధం: బొప్పరాజు
శ్రీకాకుళం, జనవరి 28(ఆంధ్రజ్యోతి): ‘ఉద్యోగులు వైద్యం కోసం చెల్లిస్తున్న డబ్బులేమైపోతున్నాయి? నెట్‌వర్క్ ఆసుపత్రులకు వెళ్తుంటే ప్రభుత్వమే బకాయి ఉందని వైద్యం చేయడం లేదు’ అని ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం శ్రీకాకుళంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఆసుపత్రులకు ప్రభుత్వమే రూ.వందల కోట్ల బకాయిలు ఉంటే మాకెందుకు వైద్యం అందుతుంది? 2014లో వైద్యం కోసం ప్రతి ఉద్యోగి రూ.95 చెల్లించేవారు. ఇప్పుడు దానికి మూడు రెట్లు ఎక్కువ చెల్లిస్తున్నా వైద్యం అందడంలేదు. కరోనా కాలంలో ప్రభుత్వ ఉద్యోగులు ప్రాణాలకు తెగించి పనిచేశారు. చాలామంది ప్రాణాలు కోల్పోయారు. వారి కుటుంబాలకు రూపాయి కూడా పరిహారం అందలేదు. వారి కుటుంబ సభ్యులకు ఇప్పటికీ ఉద్యోగాలు ఇవ్వలేదు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అమలుచేసేది ఉద్యోగులే. వారే సంతోషంగా లేకుంటే ఎలా? ఉద్యోగ సంఘాల నాయకులుగా మాపై ఒత్తిడి ఉంది. ఏం సాధించారని ఉద్యోగులు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు.
పెన్షనర్లు కూడా ఆవేదనతో ఉన్నారు. ఇంతవరకూ సీఎం ఎందుకు ఉద్యోగులతో సమావేశం నిర్వహించడంలేదు. మా సమస్యలు ఎవరికి చెప్పుకోవాలి. ఫిబ్రవరి 5న ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో ఉద్యమానికి సిద్ధమవుతున్నాం. 12వ పీఆర్సీ అమలు చేయాల్సిన సమయం జూలైలో వస్తోంది. పాత సమస్యలు ఎక్కడికక్కడే ఉన్నాయి. ఇప్పటికే చాలా సమయం ఇచ్చాం. ఉద్యోగులకు ఇచ్చిన హెల్త్‌కార్డులు ఎందుకూ పనికిరావడం లేదు. స్మార్ట్‌కార్డులే అందలేదు. రెండువైపులా ప్రభుత్వ ఉద్యోగే సర్వనాశనం అవుతున్నారు. ఇప్పటికైనా ఉద్యోగ సంఘాలతో సీఎం మాట్లాడాలి. లేకుంటే ఉద్యోగ సంఘాల నాయకులనే తప్పించేసి ఉద్యోగులే ఉద్యమం చేసే పరిస్థితి తలెత్తవచ్చు. ఈ విషయంలో ఉద్యోగ సంఘాల్లో భేదాభిప్రాయాలున్నా.. ఎప్పటికైనా కలసికట్టుగానే పోరాడుతాం.’’ అంటూ బొప్పరాజు స్పష్టం చేశారు.
Updated Date - 2023-01-29T03:06:38+05:30 IST