Avinash, Bhaskar Reddy CBI Question: తండ్రీ కొడుకులపై ప్రశ్నల వర్షం!
ABN, First Publish Date - 2023-04-20T02:02:17+05:30
హైదరాబాద్ కోఠిలోని సీబీఐ కార్యాలయం! ఒకే సమయంలో అక్కడ... ఎంపీ అవినాశ్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి, వారి అనుచరుడు ఉదయ్ కుమార్ రెడ్డి! వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ముగ్గురిపై సీబీఐ వేర్వేరుగా ప్రశ్నల వర్షం కురిపించింది.
సీబీఐ ముందు అవినాశ్, భాస్కర్ రెడ్డి, ఉదయ్
ముగ్గురినీ వేర్వేరుగా ప్రశ్నించిన అధికారులు
హత్య తర్వాత వాళ్లు మీ ఇంటికెందుకొచ్చారు?
అంతకు ముందు అసలేం జరిగింది?
ఆ 40 కోట్లను ఎక్కడి నుంచి తెస్తారు?
వివేకా హత్యకు అసలు కారణమేమిటి?
తండ్రీ కుమారులను ప్రశ్నించిన సీబీఐ
కట్లు, సాక్ష్యాల చెరిపివేతపై ఉదయ్‌కి ప్రశ్నలు
జగన్, అవినాశ్ నుంచి ప్రాణహాని
వైసీపీ నేతలు కక్షగట్టారు: దస్తగిరి
మొన్నటిదాకా వివేకా హత్య కేసులో ‘సాక్షి’.. ఇప్పుడు నిందితుడు.. ఎంపీ అవినాశ్ రెడ్డిని బుధవారం సీబీఐ సుదీర్ఘంగా విచారించింది. ఆయన విచారణ 9 గంటల పాటు కొనసాగింది.
హైదరాబాద్, ఏప్రిల్ 19 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ కోఠిలోని సీబీఐ కార్యాలయం! ఒకే సమయంలో అక్కడ... ఎంపీ అవినాశ్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి, వారి అనుచరుడు ఉదయ్ కుమార్ రెడ్డి! వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ముగ్గురిపై సీబీఐ వేర్వేరుగా ప్రశ్నల వర్షం కురిపించింది. గతంలో ఈ కేసులో అవినాశ్ రెడ్డిని ‘సాక్షి’గా మాత్రమే ప్రశ్నించగా... ఇప్పుడు ఆయనతోపాటు ఆయన తండ్రి భాస్కర్ రెడ్డినీ, ఉదయ్‌కుమార్ రెడ్డినీ నిందితులుగా ప్రశ్నించింది. ఈనెల 25వ తేదీ వరకు అవినాశ్‌ను అరెస్టు చేయవద్దని, అప్పటిదాకా ప్రతిరోజూ సీబీఐ కార్యాలయానికి వెళ్లి విచారణకు సహకరించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం 10.15 గంటలకు అవినాశ్ రెడ్డి కోఠిలోని సీబీఐ కార్యాలయానికి వచ్చారు. చంచల్‌గూడ జైలులో ఉన్న భాస్కర్ రెడ్డి, మరో నిందితుడు ఉదయ్ కుమార్ రెడ్డిని సీబీఐ తన కార్యాలయానికి తీసుకువచ్చింది. ఈ ముగ్గురినీ వేర్వేరుగా విచారించింది. అవినాశ్‌రెడ్డిని తొమ్మిది గంటలపాటు ప్రశ్నించగా... మిగిలిన ఇద్దరి విచారణ ఐదేసి గంటలు సాగింది.
ఆరోజు మీ ఇంటికెందుకొచ్చారు?
వైఎస్ వివేకా హత్యకేసులో ఇప్పటిదాకా సమాధానాలు తెలియని అంశాలపై అవినాశ్‌ను ప్రశ్నించినట్లు తెలిసింది. ముఖ్యంగా.. ఈ కేసులో నిందితులుగా ఉన్నవారు వివేకా హత్య జరిగిన రోజు అవినాశ్‌రెడ్డి ఇంటికి వెళ్లడంపై గొలుసుకట్టు ప్రశ్నలు వేసినట్లు సమాచారం. అసలు హత్య జరగడానికి కొన్ని గంటల ముందు ఏం జరిగింది? అనే విషయంపై దృష్టి సారించారు. తొమ్మిది గంటల పాటు న్యాయవాదుల సమక్షంలో సాగిన విచారణ మొత్తాన్ని ఆడియో, వీడియో రికార్డ్ చేశారు. అవినాశ్ నుంచి లిఖిత పూర్వక సమాధానాలు తీసుకున్నారు. ఇంతకుముందు విచారణలో అవినాశ్‌కు సంధించిన ప్రశ్నలను తిరిగి అడిగినట్లు తెలిసింది. అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని సీబీఐ పదుల సంఖ్యలో ప్రశ్నలు అడిగినట్లు తెలిసింది. హత్యకు కుట్ర, ఆర్థికపరమైన అంశాలపై సీబీఐ ప్రధానంగా దృష్టి సారించింది. హంతకులకు ఇస్తానని హామీ ఇచ్చిన రూ.40 కోట్లు ఎలా సర్దుబాటు చేద్దామనుకున్నారు? వివేకా హత్యకు అ సలు కారణమేంటి? మీ (భాస్కర్‌రెడ్డి) ఆదేశాలతోనే హత్య చేసినట్లు నిందితు లు వాంగ్మూలమిచ్చారు కదా? అందుకు తగ్గ ఆధారాలు కూడా ఉన్నాయి.. మీరేమంటారు? ఆయుధాల కొనుగోలు, హత్యకు ముందు నిందితులతో ఏం మాట్లాడారు? హత్య జరిగిన తర్వాత నిందితులు మీ ఇంటికెందుకు వచ్చారు?.. ఇలా అనేక అంశాలపై సీబీఐ భాస్కర్ రెడ్డిని ప్రశ్నించినట్లు తెలిసింది. ఆరోజు భాస్కర్‌రెడ్డి ఇంట్లోనే ఉన్నట్లు సాంకేతిక ఆధారాలను సేకరించిన సీబీఐ.. బయట ఉన్నట్లు ఎందుకు చెబుతున్నారని నిలదీసినట్లు సమాచారం. అయితే.. చాలా ప్రశ్నలకు భాస్కర్‌రెడ్డి ‘తెలియదు’ అనే సమాధానం చెప్పారని, మరికొన్నిటికి స మాధానం ఇవ్వగా, ఇంకొన్ని ప్రశ్నలకు మౌనంగా ఉండిపోయారని సమాచారం. అవినాశ్ రెడ్డిని గురువారం ఉదయం విచారణకు హాజరుకావాలంటూ సూచించారు.
కుట్లు వేసి, బ్యాండేజ్ ఎందుకు కట్టారు?
వివేకా హత్య, ఆ తర్వాతి పరిణామాలపై ఉదయ్‌కుమార్‌రెడ్డిని సీబీఐ ప్రశ్నించింది. హత్య జరిగిన సమయంలో భాస్కర్ రెడ్డి ఇంట్లో ఎందుకు ఉన్నారు? ఆరోజు ఏం జరిగింది? ఎవరి ఆదేశాలతో వివేకా మృతదేహానికి కుట్లు వేసి, బ్యాండెడ్ కట్లు కట్టారు? ఎవరు చెబితే సాక్ష్యాధారాలను తారుమారు చేశారు? ఇలా అనేక అంశాలపై ఉదయ్‌ని సీబీఐ ప్రశ్నించింది.
అంతా పకడ్బందీగా!
అత్యంత కీలకమైన కేసు కావడం, ఇప్పటివరకు జరిగిన దర్యాప్తు ఒక ఎత్తు, ఈ పది రోజులు జరగనున్న దర్యాప్తు మరో ఎత్తు కావడంతో సీబీఐ అధికారులు అత్యంత గోప్యత పాటిస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం ఇప్పటికే సిద్ధం చేసిన ప్రశ్నావళి మేరకు నిందితులను ప్రశ్నిస్తోంది. ఎస్పీ వికా్‌ససింగ్ నేతృత్వంలో అధికారుల బృందం విచారణను కొనసాగిస్తోంది. హైదరాబాద్ సీబీఐ విభాగం నుంచి అవసరమైన లాజిస్టిక్ సపోర్టు మాత్రమే తీసుకుంటోంది. విచారణలో ఇక్కడివారెవ్వరినీ భాగస్వామ్యం చేయడం లేదు. అవసరమైన, అనుమతి ఉన్నవారిని మినహా విచారణ గదుల్లోకి ఇతరులెవ్వరినీ అనుమతించడం లేదు. కేసు దర్యాప్తు ముగింపు దశకు చేరుకోవడంతో.. సీబీఐ గత విచారణల లింకుల(‘డాట్స్’ కనెక్షన్)పై దృష్టిసారించింది. కాగా.. ఇంతకు ముందు అవినాశ్‌రెడ్డి సాక్షిగా సీబీఐ విచారణకు వచ్చినప్పుడు కోఠిలోని సీబీఐ కార్యాలయం వద్ద అతని అనుచరులు, కార్యకర్తల హడావుడి కనిపించింది. బుధవారం మాత్రం అలాంటి హంగామా ఏమీ కనిపించలేదు.
జైలు వద్ద హైడ్రామా
భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డిని ఈనెల 24 వరకు సీబీఐ కస్టడీకి కోర్టు అనుమతించిన సంగతి తెలిసిందే. అయితే.. వారిని కస్టడీకి తీసుకునే క్రమంలో జైలు వద్ద హైడ్రామా జరిగింది. ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి లేఖ, ఆదేశా ల పత్రం లేకుండానే సీబీఐ బృందం జైలుకు చేరుకుంది. దాంతో నిందితులను కస్టడీకి ఇచ్చేందుకు జైళ్ల శాఖ అధికారులు అంగీకరించలేదు. ఆతర్వాత సీబీఐ డీఎస్పీ స్థాయి అధికారి అప్పటికప్పుడు ఓ లేఖ రాసి ఇచ్చారు. అందులోనూ స్పష్టత లేకపోవడంతో కొంత సేపు ప్రతిష్ఠంభన నెలకొంది. చివరకు సీబీఐ ఎస్పీ ఈ-మెయిల్ పంపడంతో.. జైలు అధికారులు నిందితులను సీబీఐ కస్టడీకి అప్పగించారు.
భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డిని ఈనెల 24 వరకు సీబీఐ కస్టడీకి కోర్టు అనుమతించిన సంగతి తెలిసిందే. అయితే.. వారిని కస్టడీకి తీసుకునే క్రమంలో జైలు వద్ద హైడ్రామా జరిగింది. ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి లేఖ, ఆదేశా ల పత్రం లేకుండానే సీబీఐ బృందం జైలుకు చేరుకుంది. దాంతో నిందితులను కస్టడీకి ఇచ్చేందుకు జైళ్ల శాఖ అధికారులు అంగీకరించలేదు. ఆతర్వాత సీబీఐ డీఎస్పీ స్థాయి అధికారి అప్పటికప్పుడు ఓ లేఖ రాసి ఇచ్చారు. అందులోనూ స్పష్టత లేకపోవడంతో కొంత సేపు ప్రతిష్ఠంభన నెలకొంది. చివరకు సీబీఐ ఎస్పీ ఈ-మెయిల్ పంపడంతో.. జైలు అధికారులు నిందితులను సీబీఐ కస్టడీకి అప్పగించారు.
Updated Date - 2023-04-20T02:02:17+05:30 IST