ఉద్యమం ఆగదు
ABN, First Publish Date - 2023-05-22T03:46:47+05:30
ఉద్యోగుల పీఆర్సీ ఎరియర్స్, డీఏలకు సంబంధించి ఎప్పుడెంత ఇస్తారో స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఉద్యమాన్ని విరమించేది లేదని ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు.
పీఆర్సీ, డీఏ ఎరియర్స్‌పై వెనక్కి తగ్గం.. సంఘాలు రాకపోవటం ఆశ్చర్యం: బొప్పరాజు
విజయవాడ, మే 21 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగుల పీఆర్సీ ఎరియర్స్, డీఏలకు సంబంధించి ఎప్పుడెంత ఇస్తారో స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఉద్యమాన్ని విరమించేది లేదని ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. ఉద్యమంలో కలిసి వస్తామని చెప్పిన ఉద్యోగ సంఘాలు ఇప్పటి వరకు ముందుకు రాకపోవటం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఉద్యమం ద్వారానే హక్కులు సాధించుకోగలమని, అందరూ భాగస్వామ్యమైతే తప్ప సమస్యలు పరిష్కారం కావని పరోక్షంగా బండి శ్రీనివాసరావునుద్దేశించి వ్యాఖ్యానించారు. ఆదివారం ఏపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ 27వ రాష్ట్ర మహాసభల పోస్టర్ ఆవిష్కరణ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏపీజేఏసీ అమరావతి తలపెట్టిన ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా 73 రోజులుగా నిరవధికంగా కొనసాగుతోందన్నారు. తాము ఉద్యమం ప్రారంభించిన తర్వాతే ప్రభుత్వం మెల్లమెల్లగా స్పందిస్తోందని, రూ. 3500 కోట్ల బకాయిలు విడుదల చేసిందని చెప్పారు. తమ ఉద్యమం వల్ల పోలీసులు, ఆర్టీసీ ఉద్యోగులకు కొంత మేర మేలు జరిగిందని, పెన్షనర్లకు సంక్షేమ పథకాలు వచ్చాయని, 1158 మందికి కారుణ్య నియామకాలు వచ్చాయని, కొత్త జిల్లాలకు హెచ్‌ఆర్‌ఏ 16 శాతం ఇచ్చారని, మెడికల్ రీయింబర్స్‌మెంట్‌ను కూడా సాధించుకున్నామని, పోలీసులకు కూడా సరెండర్ లీవులు ఇవ్వాలని ఆదేశించారని తెలిపారు. ఉద్యమం మూడో దశలో భాగంగా ఇప్పటికే శ్రీకాకుళం, అనంతపురంలలో ప్రాంతీయ సదస్సులు నిర్వహించామన్నారు. ఏలూరు, గుంటూరులలో మరో రెండు సదస్సులు జరుగుతున్నాయన్నారు. ఈ నెల 27న ఏలూరులో నిర్వహించే ప్రాంతీయ సదస్సులో కృష్ణా, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల ఉద్యోగులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ నెల 24 వ తేదీన విజయవాడలో జరిగే ఏపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర మహాసభలను అందరూ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏపీపీటీడీ ఈయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీ దామోదరరావు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-05-22T03:46:47+05:30 IST