దిగి వచ్చి అగ్రిమెంట్ చేయండి
ABN, First Publish Date - 2023-05-01T03:25:49+05:30
: ‘‘కడుపు మండి ఉద్యోగులంతా రోడ్డు మీదకు వస్తే ఏం జరుగుతుందో ఒకసారి చరిత్ర చూడండి. 53 రోజులుగా ఉద్యమం చేస్తుంటే ప్రభుత్వం కనీసం స్పందించడం లేదు
లేదంటే.. ప్రభుత్వ వ్యవస్థను స్తంభింపజేస్తాం
3వ దశ ఉద్యమ కార్యాచరణ విడుదల చేసిన బొప్పరాజు
నవంబరు నుంచి నిరవధిక సమ్మె
మే 5న ప్రభుత్వానికి నోటీసులు: సూర్యనారాయణ
51 రోజులుగా రోడ్డున పడి పోరాటం చేస్తున్నా చర్చలకు పిలవరా
చులకనగా చూస్తారా?
మొక్కుబడి సమావేశాలు కట్టిపెట్టండి
మా న్యాయమైన డిమాండ్లను పరిష్కరించండి
ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు ఫైర్
మూడవ దశ ఉద్యమ కార్యాచరణ విడుదల
విజయవాడ, ఏప్రిల్ 30(ఆంధ్రజ్యోతి): ‘‘కడుపు మండి ఉద్యోగులంతా రోడ్డు మీదకు వస్తే ఏం జరుగుతుందో ఒకసారి చరిత్ర చూడండి. 53 రోజులుగా ఉద్యమం చేస్తుంటే ప్రభుత్వం కనీసం స్పందించడం లేదు. ఉద్యోగుల మీద ఎంత చులకన భావం ఉందో అర్ధమౌతోంది’’ అని ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు సర్కారుపై నిప్పులు చెరిగారు. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టకూడదన్న ఉద్దేశంతో ఇప్పటి వరకు శాంతియుతంగా ఆందోళనలు చేపడుతున్నామన్నారు. మూడో విడత ఉద్యమ కార్యాచరణ ముగిసేలోపు ప్రభుత్వం దిగివచ్చి సమస్యల పరిష్కారంపై లిఖిత పూర్వక హామీ(అగ్రిమెంట్) ఇవ్వాలని, లేదంటే.. ప్రభుత్వ వ్యవస్థనే స్తంభింపచేసేలా తదుపరి కార్యాచరణ ఉంటుందని హెచ్చరించారు. ఇంకా ఉద్యమంలోకి రాని ఉద్యోగ సంఘాలు, ఉద్యోగులు మనసాక్షిని ప్రశ్నించుకుని తమతో కలిసి రావాలని పిలుపునిచ్చారు. వైసీపీ ప్రభుత్వంతో తలపడకపోతే ఎప్పటికీ ఉద్యోగ సమస్యలు పరిష్కారం కావని తెలిపారు. ఆదివారం విజయవాడలోని ఏపీ రెవెన్యూ భవన్‌లో మీడియాతో బొప్పరాజు మాట్లాడారు. ఈ సందర్భంగా మూడో దశ ఉద్యమ కార్యాచరణను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ఏపీజేఏసీ అమరావతి నేతృత్వంలో ప్రభుత్వ తీరుకు నిరసనగా రెండు నెలలుగా ఉద్యమాన్ని చేపడుతున్నామన్నారు. ఏప్రిల్ 29తో గ్రామ, వార్డు, సచివాలయ ఉద్యోగుల సమస్యలకు సంబంధించి ధర్నాతో రెండు దశల ఉద్యమం పూర్తి అయిందన్నారు.
ఇప్పటి వరకు ఏపీజేఏసీ అమరావతి సభ్యసంఘాలే ఉద్యమ కార్యాచరణలో పాలు పంచుకున్నాయని తెలిపారు. ప్రభుత్వంపై పోరాడాలంటే.. ఐక్య ఉద్యమాల అవసరాన్ని గుర్తించి అన్ని సంఘాలను ఒక వేదిక మీదకు తీసుకు వచ్చేందుకు రౌండ్‌టేబుల్‌ను నిర్వహించామన్నారు. ఈ రౌండ్ టేబుల్ సమాచారం తెలుసుకుని ఒక రోజు ముందు మంత్రివర్గ ఉపసంఘం అనధికారికంగా సమావేశం నిర్వహించిందని చెప్పారు. ఉద్యోగులు దాచుకున్న సొమ్మును చెల్లించి ఏదో మేలు చేశామని చెబుతున్నారని, ఉద్యోగులకు రావాల్సిన డీఏల సంగతి ఏమిటని ప్రశ్నించారు. 2018 ఆగస్టు 1 నుంచి 4 డీఏలు పెండింగులో ఉన్నాయన్నారు. 4 లక్షల మంది ఉద్యోగులకు జీపీఎఫ్ డబ్బులు వేల కోట్ల రూపాయాలు చెల్లించాల్సి ఉందన్నారు. సీపీఎస్, పదవీ విరమణ చెందిన ఉద్యోగులకు నగదు రూపంలో చెల్లించాల్సి ఉందన్నారు. సీపీఎస్ ఉద్యోగులకు రూ.1000 కోట్లు, పదవీ విరమణ చేసిన వారికి రూ.800 కోట్ల చొప్పున జీపీఎఫ్ చెల్లించాల్సి ఉందన్నారు. జూలై 1, 2021, జూలై 1, 2019ల 2 డీఏలను ఇప్పటి వరకు ఎంత ఇవ్వాలన్నది లెక్కకట్టలేదని తెలిపారు. ఈ రెండింటినీ పీఆర్‌సీ బకాయిలో కలిపారని, దీనిని బట్టి చూస్తే ప్రభుత్వ నిర్లక్ష్యం ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చని చెప్పారు. ఈ నేపథ్యంలో మూడో దశ ఉద్యమానికి సిద్ధమవుతున్నామని బొప్పరాజు చెప్పారు. బంద్‌లు, హర్తాళ్లు చేస్తేనే చ ర్చలు జరిపి సమస్య పరిష్కరిస్తారా అని ప్రశ్నించారు. మూడో దశ పోరాటంలో కార్మిక సంఘాలు, ఏపీఎన్‌జీవో, ఏపీజేఏసీ సభ్య సంఘాలన్నీ కలిసి వస్తాయని భావిస్తున్నామన్నారు. ఏపీజేఏసీ అమరావతి కోశాధికారి వీవీ మురళీకృష్ణంనాయుడు మాట్లాడుతూ, ఇప్పటి వరకు తాము అహింసామార్గంలో ఉద్యమం చేస్తుంటే ప్రభుత్వానికి చులకనగా చూసిందన్నారు. ఉద్యోగులు కడుపుమండి రోడ్డు మీదకు వస్తే ఏమౌతుందో ఆలోచన చేయాలన్నారు.
మూడో దశ ఉద్యమ కార్యాచరణ ఇదీ..
మే 8: ఉపాధ్యాయులపై కేసులు, సస్పెన్షన్లను ఉపసంహరించుకోవాలని, వేధింపులు ఆపాలని జిల్లా కలెక్టర్లకు స్పందనలో వినతిపత్రాల సమర్పణ.
మే 9: శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలకు కలిపి శ్రీకాకుళం జిల్లాలో మొదటి ప్రాంతీయ సదస్సు.
మే 12-19: 175 మంది ఎమ్మెల్యేలు, 25 మంది ఎంపీల దగ్గరకు వెళ్లి ఉద్యోగుల ఆవేదన తెలిపే కార్యక్రమం.
మే 17: అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల పరిధిలో రెండో ప్రాంతీయ సదస్సు నిర్వహణ.
మే 27: కృష్ణా, ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల పరిధిలో ఏలూరు జిల్లాలో మూడో సదస్సు.
మే 30: రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఒకరోజు సామూహిక నిరాహారదీక్ష
జూన్ 8: గుంటూరు, బాపట్ల, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాల పరిధిలో గుంటూరు జిల్లాలో 4వ సదస్సు.
Updated Date - 2023-05-01T03:25:49+05:30 IST