విద్యుత్ సరఫరా సంస్థలకు చెల్లింపుల్లో డిస్కమ్‌ల సాచివేత ధోరణి
ABN, First Publish Date - 2023-06-26T03:42:47+05:30
విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు సకాలంలో బిల్లులు చెల్లించడంలో రాష్ట్ర డిస్కమ్‌లు విఫలమవుతున్నాయి.
మొత్తం బకాయి 3,524 కోట్లకు చేరిక
ఏపీ ఎల్లో జోన్‌లో ఉందంటూ కేంద్రం వెల్లడి
అమరావతి, జూన్ 25(ఆంధ్రజ్యోతి ): విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు సకాలంలో బిల్లులు చెల్లించడంలో రాష్ట్ర డిస్కమ్‌లు విఫలమవుతున్నాయి. ఏ నెలకు ఆ నెల విద్యుత్తు సరఫరా సంస్థలకు బిల్లులు చెల్లించాల్సిందేనంటూ డిస్కమ్‌లకు కేంద్ర ఇంఽధన మంత్రిత్వ శాఖ హుకుం జారీ చేసింది. నిర్ణీత సమయంలో బకాయిలు చెల్లించకపోతే విద్యుదుత్పత్తి సంస్థలు సరఫరాను నిలిపివేస్తాయంటూ డిస్కమ్‌లకు కేంద్రం స్పష్టమైన హెచ్చరికలు చేసింది. వినియోగదారులు నెలవారీ బిల్లులను సకాలంలో చెల్లించకుంటే కరెంటు సరఫరాను నిలిపివేసే డిస్కమ్‌లు... తాను చెల్లించాల్సిన బిల్లులు విషయంలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. రాష్ట్ర విద్యుత్తు పంపిణీ సంస్థలు రూ.3,523.72 కోట్ల బకాయి పడ్డాయి. ఇందులో ఈ నెల వాయిదా రూ.1,515.31 కోట్లు కాగా... నెల రోజులుదాటి రెండో నెలలోనికి అడుగు పెట్టిన బకాయి రూ.2,008.42 కోట్లుగా కేంద్ర ప్రభుత్వ ప్రాప్తి పోర్టల్ అధికారికంగా వెల్లడించింది. వాస్తవానికి ఏ నెలకానెల బిల్లులను సరఫరాదారులకు చెల్లించే డిస్కమ్‌లను కేంద్ర ప్రభుత్వం గ్రీన్ జోన్‌లో ఉంచుతుంది. నెల దాటి రెండో నెలలోనికి అడుగుపెట్టిన డిస్కమ్‌లను ఎల్లో జోన్‌లోనికి చేర్చుతుంది. ప్రస్తుతం ఆంద్రప్రదేశ్ డిస్కమ్‌లు ఏల్లో జోన్‌లో ఉన్నాయి. రెండో నెలదాటి మూడో నెలలోనికి అడుగు పెడితే బూడిద రంగులో ఉంచుతుంది. మూడో నెలలోనూ బకాయిలు చెల్లించకపోతే ఆరెంజ్‌లోనికి, ఆ తర్వాత రెడ్ జోన్‌లోనికి పంపుతుంది. ఆదివారం రాత్రి ఏపీ ఎల్లో జోన్‌లో ఉన్నట్లు కేంద్రం అధికారికంగా వెల్లడించింది.
Updated Date - 2023-06-26T03:42:47+05:30 IST