ఇటు సర్కారీ కొలువు.. అటు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం..!
ABN, First Publish Date - 2023-06-26T03:33:46+05:30
మూన్‌లైటింగ్.. సాఫ్ట్‌వేర్ రంగంలో ఈ పదం బాగా ప్రాచుర్యం పొందింది.
ప్రభుత్వ ఉద్యోగి మూన్‌లైటింగ్
ఇరిగేషన్ శాఖలో డిప్యూటీ ఇంజనీర్ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌గా ఉద్యోగం
ఫీల్డ్‌వర్క్‌ను బాగా ఉపయోగించుకుంటున్న టెకీ
ఫేక్ లొకేషన్ చూపిస్తూ హాజరు నమోదు
ఎప్పుడూ సాఫ్ట్‌వేర్ కంపెనీలోనే విధులు..
అవసరం ఉన్నప్పుడు ప్రభుత్వ విధులకు
అధికారులను మభ్యపెడుతూ రెండు చోట్లా లక్షల్లో జీతం
నంద్యాల, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): మూన్‌లైటింగ్.. సాఫ్ట్‌వేర్ రంగంలో ఈ పదం బాగా ప్రాచుర్యం పొందింది. ఒక కంపెనీలో పనిచేస్తూనే.. మరో కంపెనీలో ఉద్యోగం చేయడాన్ని.. ‘మూన్‌లైటింగ్’ అంటారు. కరోనా కాలంలో చాలా ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్‌కు అవకాశమిచ్చాయి. ఇదే అదనుగా చాలామంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు రెండు కంపెనీల్లో విధులు నిర్వహిస్తూ రెండు జీతాలు తీసుకున్నారు. అయితే ఇదంతా ప్రైవేట్ సెక్టార్. కానీ... ప్రభుత్వ శాఖలో పనిచేసే ఓ ఉద్యోగి ఇలా మూన్‌లైటింగ్ చేస్తున్నాడంటే నమ్మగలమా..? నమ్మితీరాల్సిందే..! నంద్యాల జిల్లాలోని ఇరిగేషన్ శాఖకు చెందిన కేశవరెడ్డి.. ఇటు ప్రభుత్వ శాఖలో, అటు సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తూ రెండు చోట్లా ప్రతి నెలా రూ.3లక్షలకు పైగానే వేతనాలు పొందుతున్నారు. ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారు. ఆ నిజాన్ని వెలుగులోకి తీసుకొచ్చేందుకు ‘ఆంధ్రజ్యోతి’ అతనిపై నిఘా పెట్టింది.
ఫేక్ లొకేషన్‌తో ఫేస్ హాజరు..
ఇరిగేషన్ శాఖలో ఎస్సార్బీసీ విభాగానికి సంబంధించి పాణ్యం సబ్ డివిజన్ ఇరిగేషన్ క్లీన్ ఏరియా డెవల్‌పమెంట్ అథారిటీ (ఐ-కాడా)లో డిప్యూటీ ఎగ్జిక్యుటివ్ ఇంజనీర్‌గా కేశవరెడ్డి విధులు నిర్వహిస్తున్నారు. ఎస్సార్బీసీకి సంబంధించి కాలువల నిర్వహణ, తలెత్తే ఇబ్బందులు, ఆయకట్టు రైతుల సమస్యలను పరిష్కరించడం ఆయన విధులు. ఇందులో ఎక్కువ శాతం ఫీల్డ్ వర్క్ ఉంటుంది. ప్రతిరోజూ ఆయన కార్యాలయానికి రావాల్సిన అవసరం ఉండదు. రోజూ విధులకు హాజరవుతున్నట్లు మొబైల్‌లోని ఫేస్ రికగ్నేషన్ యాప్‌లో నమోదుచేస్తే సరిపోతుంది. దీన్ని అవకాశంగా తీసుకున్న కేశవరెడ్డి తాను ఎక్కడున్నా.. ఫేక్ లొకేషన్ చూపిస్తూ ఇరిగేషన్‌కి సంబంధించిన విధులు నిర్వహిస్తున్నట్టు హాజరు నమోదు చేస్తున్నారు. ఇక తన గురించి ఎవరైనా వచ్చి అడిగితే ఫీల్డ్ వర్క్‌లో ఉన్నాడని చెప్పాలంటూ తన కింది స్థాయి ఉద్యోగులకు చెబుతున్నారు. దీంతో పనుల కోసం వచ్చిన వారు అసహనానికి గురువుతున్నారు. ఈ మధ్య ఆయన ఎక్కువగా కార్యాలయానికి రావడం లేదని ఫిర్యాదులు కూడా అధికమయ్యాయి.
అంత జీతం వదులుకోలేక..
కేశవరెడ్డి 2019లో ఎస్సార్బీసీ విభాగంలో విధుల్లో చేరారు. ప్రభుత్వ ఉద్యోగం, పైగా తీరిక ఎక్కువ ఉన్న శాఖలో విధులు. దీంతో.. ఎలాగూ ఇంజనీరింగ్ పట్టా ఉంది కాబట్టి, ఖాళీ సమయాన్ని ఏదైనా ఐటీ కంపెనీకి కేటాయిస్తే మరిన్ని డబ్బులు సంపాదించవచ్చని ఆయన భావించారు. ఇదే సమయంలో కరోనా విజృంభించడంతో చాలా ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం వెసులుబాటు కల్పించాయి. ఈ అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్న కేశవరెడ్డి ఓ ఐటీ కంపెనీలో కొలువు సంపాదించారు. ఇటు ప్రభుత్వ ఉద్యోగిగా రూ.1.5లక్షలకు పైగా జీతం తీసుకుంటూ, అటు సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా దాదాపు మరో లక్షన్నర వరకు సంపాదిస్తున్నారు. కరోనా పరిస్థితులు చక్కబడ్డాక ఐటీ కంపెనీలు కార్యాలయాలకు వచ్చి పనులు చేసుకోవాలని చెప్పాయి. ఈ క్రమంలో కేశవరెడ్డిని కూడా తాను పనిచేసే కంపెనీ హైదరాబాద్‌లోని కార్యాలయానికి రావాలని సూచించింది. హైదరాబాద్ వెళితే ప్రభుత్వ ఉద్యోగం ఇరకాటంలో పడుతుంది. అలాగని దాదాపు లక్షన్నర జీతం వచ్చే సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదులుకోవడానికి కేశవరెడ్డి మనసు అంగీకరించలేదు. దీంతో ఇటు ప్రభుత్వ కొలువుకీ, అటు సాఫ్ట్‌వేర్ ఉద్యోగానికీ ఇబ్బంది రాకుండా మేనేజ్ చేయడం మొదలుపెట్టారు. ఫేక్ హాజరుతో తాను హైదరాబాద్‌లో ఉన్నా పాణ్యంలో విధి నిర్వహణ పరిధిలో ఉన్నట్లు చూపిస్తున్నారు. ఇలా దాదాపు ఆరు నెలల నుంచి హైదరాబాద్‌లోని మెహదీపట్నం ఎల్‌ఐసీ కాలనీలోని తన ఐటీ కంపెనీకి వెళ్తూ అక్కడే విధులు నిర్వహిస్తున్నారు. ఈ నెల 22న కూడా ఆయన మెహదీపట్నంలో ఉండి కూడా గొరుకల్లు రిజర్వాయర్ వద్ద ఉన్నట్లు చూపించడం గమనార్హం.
నా భార్యకు హైదరాబాద్‌లో ఉద్యోగం: కేశవరెడ్డి
రెండు ఉద్యోగాల విషయంపై కేశవరెడ్డిని వివరణ కోరగా.. తన భార్య హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తోందని చెప్పారు. తానేమీ ప్రైవేట్ ఉద్యోగం చేయలేదని.. శాలరీ కూడా తన భార్య ఖాతాలోనే పడుతుందని వెల్లడించారు.
విషయం తెలుసుకుంటాం: కబీర్ బాషా
ఓ ప్రభుత్వ శాఖలో ఉద్యోగం చేస్తున్న వ్యక్తి ప్రైవేటు కంపెనీలో చేయకూడదని, డీఈఈ కేశవరెడ్డి ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడన్న విషయం తన దృష్టికి రాలేదని కర్నూలుకు చెందిన జలవనరుల శాఖ సీఈ కబీర్ బాషా చెప్పారు. సంబంధిత అధికారిని అడిగి విషయం తెలుసుకుంటానని, ఒకవేళ అలాంటిది ఏమైనా ఉంటే తగు చర్యలు తీసుకుంటామని అన్నారు.
అర్జెంట్ అయితే ఆగమేఘాలపై..
ఇరిగేషన్ శాఖలో ఆయకట్టు రైతుల నుంచి ఫిర్యాదులు ఎక్కువగా ఉంటాయి. అయితే కేశవరెడ్డి తన వరకు వచ్చే ఫిర్యాదులను ఎలాగోలా మేనేజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కొన్ని ఫిర్యాదులు మాత్రం స్పందన వరకు వెళ్తుంటాయి. అలాంటప్పుడు సంబంధిత ఫిర్యాదుదారు వద్దకు వెళ్లి సమస్యకు పరిష్కారం చూపించాలి. దీన్ని కూడా కేశవరెడ్డి బాగానే మేనేజ్ చేస్తున్నారు. తప్పనిసరి పని ఉన్న రోజున, కేశవరెడ్డి సాఫ్ట్‌వేర్ ఉద్యోగానికి సెలవు పెట్టడం, లేదంటే వర్క్‌ఫ్రం హోం అని చెప్పి ఇక్కడికొచ్చి పనులు చక్కదిద్దుతున్నారు. మరీ అర్జెంట్ అయితే.. అరగంట లేదా గంటలో వచ్చేస్తానని చెప్పి.. అప్పటికపుడు హైదరాబాద్ నుంచి ఆగమేఘాలపై నంద్యాల లేదా పాణ్యానికి బయల్దేరుతుంటారు.
Updated Date - 2023-06-26T03:33:46+05:30 IST