విద్యుత్ భద్రతపై నేటి నుంచి వారోత్సవాలు
ABN, First Publish Date - 2023-06-26T02:58:17+05:30
విద్యుత్ భద్రత వారోత్సవాలు సోమవారం నుంచి నిర్వహించనున్నట్టు విద్యుత్ భద్రతా సంచాలకుడు, ..
ప్రజలకు అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు
విజయవాడ, జూన్ 25: విద్యుత్ భద్రత వారోత్సవాలు సోమవారం నుంచి నిర్వహించనున్నట్టు విద్యుత్ భద్రతా సంచాలకుడు, ప్రభుత్వ ప్రధాన విద్యుత్ తనిఖీ అధికారి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. సోమవారం నుంచి జూలై 2వ తేదీ వరకు విద్యుత్ వాడకంపై ప్రజలకు అవగాహన కల్పించనున్నట్టు పేర్కొన్నారు. 1956 నుంచి విద్యుత్ శాఖ ప్రతి ఏడాదీ వారోత్సవాలు నిర్వహిస్తుందని వివరించారు. విద్యుత్ వాడకంపై పలు సూచనలు చేశారు. విద్యుత్ గృహోపకరణాలైన ఏసీలు, ఫ్రిజ్‌లు ఇతరత్రా పరికరాల్లో నుండి అసాధారణమైన శబ్దాలు వచ్చినా నైపుణ్యం కలిగిన వారిచే మాత్రమే మరమ్మతులు చేయించుకోవాలన్నారు. ఇంటికి ఎర్తింగ్ ఇచ్చినప్పుడు కనీసం రెండు ఎర్త్ ఎలకో్ట్రడ్‌లను అమర్చాలన్నారు. విద్యుత్ మరమ్మతులు వచ్చినా, వైర్ల నుండి ఏమైనా మంటలు వ్యాపించినా వినియోగదారులు సొంతగా మరమ్మతులు చేసుకోవద్దని సూచించారు. ఎవరైనా విద్యుత్ ప్రమాదానికి గురైన పక్షంలో వారిని తాకకుండా ఎండుకర్రతో విద్యుత్ పరికరం నుండి ప్రమాదం బారిన పడిన వ్యక్తిని తప్పించి, సంబంధిత విద్యుత్ అధికారికి తెలియజేయాలని తెలిపారు. వ్యవసాయ బోర్లు, పంపుసెట్ల స్విచ్‌లు ఉన్న బోర్డులకు తప్పనిసరిగా ఎర్త్ వాడాలన్నారు. తడి చేతులతో, నీటిలో నిలబడి విద్యుత్ మోటార్లను, స్వీచ్‌లను తాకకూడదన్నారు. కరెంట్‌కు సంబంధించి ఏ పని చేసినా విధిగా చెప్పులు ధరించాలన్నారు. పిడుగులు పడిన సమయంలో 11కేవీ, 30కేవీ వైర్లకు దగ్గరగా ఉండకూడదన్నారు. నీటి పైపులు, విద్యుత్ వైర్లను ఒక దానికి మరొకటి సమీపంలోకి రాకుండా చూసుకోవాలన్నారు. తడి చేతితో విద్యుత్ పరికరాల స్విచ్‌లను ఆన్ చేయవద్దని, నీటిని వేడి చేయడానికి బేర్ హీటింగ్ కాయిల్‌ని ఉపయోగించవద్దని సూచించారు. ప్రజలు సొంతంగా విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌మిషన్ టవర్లను ఎక్కకూడదని పేర్కొన్నారు. బట్టలు ఆరబెట్టడానికి విద్యుత్ స్తంభాలకు వైర్లను కట్టవద్దని తెలిపారు.
Updated Date - 2023-06-26T02:58:17+05:30 IST