బడ్జెట్ బురిడీ!
ABN, First Publish Date - 2023-06-26T02:52:42+05:30
రాష్ట్రానికి సంపద సృష్టించడంలో, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో మూలధన వ్యయం అత్యంత కీలకం.
మూలధన వ్యయంలో అట్టడుగున రాష్ట్రం
ఈశాన్య రాష్ట్రాల కన్నా దారుణం
ప్రకటన బారెడు.. చేత మూరెడు
2022-23 బడ్జెట్‌లో 29,917 కోట్లు
ప్రకటించి.. రూ.6,917 కోట్లే ఖర్చు
23ు వ్యయంతో దేశంలో చివరన
ఉపాధి, పెట్టుబడులపై ప్రభావం
ప్రకటించిన దానిలో 60 శాతం
ఖర్చు చేసిన తెలంగాణ సర్కారు
100ు ఖర్చు చేసిన కర్ణాటక, బిహార్
బరోడా బ్యాంకు విశ్లేషణలో వెల్లడి
రాష్ట్ర బడ్జెట్ విషయంలో వైసీపీ ప్రభుత్వం ప్రజలను బురిడీ కొట్టిస్తోంది. కీలకమైన మూలధన వ్యయంపై భారీ ప్రకటనలు చేస్తూ ఖర్చు విషయానికి వచ్చే సరికి చేతులెత్తేసింది. 2022-23 బడ్జెట్‌లో రూ.29,917 కోట్లను మూలధన వ్యయం కింద ఖర్చు చేస్తామని గంభీరంగా చెప్పిన వైసీపీ ప్రభుత్వం చేతల్లోకి వచ్చే సరికి రూ.6,917 కోట్లు(23ు) విదిలించి దేశంలోని అన్ని రాష్టాలకన్నా వెనుకబడింది. పొరుగున ఉన్న తెలంగాణ ప్రతిపాదిత రూ.29,064 కోట్లలో 60ు నిధులు ఖర్చు చేసింది.
అమరావతి, జూన్ 25(ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి సంపద సృష్టించడంలో, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో మూలధన వ్యయం అత్యంత కీలకం. అయితే.. ఈ విషయంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా వెనుకబడిపోయింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ప్రకటించిన మూలధన వ్యయంలో రాష్ట్రం అట్టడుగు స్థానానికి దిగజారింది. జగన్ ప్రభుత్వానికి అప్పులిచ్చిన బ్యాంక్ ఆఫ్ బరోడా రాష్ట్రాల మూలధన వ్యయాలపై తాజాగా ఓ విశ్లేషణను విడుదల చేసింది. దీని ప్రకారం 2022-23లో రూ.29,917 కోట్లను మూలధన వ్యయంగా ఖర్చుపెడతామని వైసీపీ ప్రభుత్వం బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించింది. అయితే.. దీనిలో కేవలం రూ.6917 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. ఇది ప్రకటిత మొత్తంలో కేవలం 23 శాతం మాత్రమే కావడం గమనార్హం. అయితే, పొరుగున ఉన్న తెలంగాణ రూ.29,064 కోట్లు ప్రకటించి దీనిలో 59.6శాతం ఖర్చు చేసింది. ఇక, ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, నాగాలాండ్, సిక్కిం, అసోంలు.. మూల ధన వ్యయంలో ఏపీ కంటే మెరుగ్గా ఉన్నాయని బ్యాంక్ ఆఫ్ బరోడా స్పష్టం చేసింది. ఇక, కర్ణాటక, బిహార్‌లు అయితే.. 100శాతం మూలధన వ్యయం చేసినట్టు పేర్కొంది. అయితే.. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలనూ కలిపితే మొత్తంగా మూల ధన వ్యయం రూ.7.4 లక్షల కోట్లకు గాను రూ.5.71 లక్షల కోట్లు ఖర్చు పెట్టాయి. ఇది ప్రకటిత మొత్తంలో 76.2శాతమేనని విశ్లేషణ పేర్కొంది.
ఏం జరుగుతుంది?
మూల ధన వ్యయం అనేది ఏ రాష్ట్రానికైనా అత్యంత కీలకమని ఆర్థిక నిపుణులు చెబుతారు. నిర్దేశిత రంగాలపై మూల ధన వ్యయం పెరిగితే ఉపాధి, ఉద్యోగాలు, రాష్ట్ర సంపద కూడా పెరుగాయి. అదేసమయంలో ఈ వ్యయం తగ్గిపోతే రాష్ట్రానికి సంపద సృష్టి గగనం అవుతుంది. అదేవిధంగా ఉద్యోగ, ఉపాధి కల్పనలు సాధ్యంకావని, తద్వారా రాష్ట్రం ఆర్థికంగా దిగజారిపోతుందని నిపుణులు చెబుతున్నారు.
అప్పులు తెచ్చి కూడా..
వాస్తవానికి 2022-23లో ఏపీ ప్రభుత్వం కేంద్రం అనుమతితో రూ.57,500 కోట్ల అప్పులు తెచ్చింది. ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం ప్రకారం రెవెన్యూ లోటు జీరో ఉండాలి. తెచ్చిన అప్పులన్నీ మూలధన వ్యయంగా ఖర్చు చేయాలి. కానీ, రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్‌ఆర్‌బీఎం చట్టాన్ని ఉల్లంఘించి.. రూ.57,500 కోట్ల అప్పులు తెచ్చి కేవలం రూ.6,917 కోట్లు మాత్రమే మూలధన వ్యయంగా ఖర్చు చేసింది. అయితే, ఈ వ్యయంపై కూడా పలు అనుమానాలు ఉన్నాయి. మూలధన వ్యయం పేరుతో జగన్ ప్రభుత్వం రెవెన్యూ ఖర్చును చూపిస్తోందనే విమర్శలు వస్తున్నాయి. ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం ప్రకారం జీరోగా ఉండాల్సిన రెవెన్యూ లోటు గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.42,130 కోట్లకు చేరింది. ఇది కేవలం ప్రభుత్వానికి సంబంధించిన లోటు మాత్రమే. ప్రభుత్వం గ్యారంటీలిచ్చి కార్పొరేషన్లతో అప్పు తెప్పించి వాటిని ప్రభుత్వ పథకాలు, ఇతర పనుల కోసం వాడి ఆ ఖర్చును మళ్లీ కార్పొరేషన్లలో చూపిస్తోంది. ఈ ఖర్చును ప్రభుత్వం రెవెన్యూ లోటు లెక్కలో చూపడం లేదు. దీనిపై కాగ్ నాలుగేళ్లుగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూనే ఉంది. కార్పొరేషన్లలో దాచిన అప్పులు, ఖర్చులు కూడా చూపాలని, అవి కూడా ప్రభుత్వ అప్పులు, ఖర్చుల కిందకే వస్తాయని కాగ్ స్పష్టం చేసింది.
Updated Date - 2023-06-26T02:52:42+05:30 IST