కృష్ణా, గోదారి గట్టున అవినీతి గబ్బు
ABN, First Publish Date - 2023-06-26T02:34:21+05:30
మర్యాదల్లో ఎక్కడా తగ్గేదే లేదండి’.. అని ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు అంటుంటారు. ఆ ప్రాంత ఎమ్మెల్యేల తీరు మాత్రం..
ఉమ్మడి జిల్లాలను ఊడ్చేస్తున్న వైనం
ఇసుక, గ్రావెల్ తవ్వకాల్లో కోట్లు స్వాహా.. తూర్పులో చెలరేగుతున్న ఓ బడా నేత
మొత్తం జిల్లాకు విస్తరించిన ఆయన లీలలు.. పశ్చిమలో వేలూ వందలూ వదలని నేతలు
పోస్టింగులు, బదిలీలు, రియల్ ఎస్టేట్, పేకాట, కోడి పందేల సరదాలోనూ దందా
కృష్ణా జిల్లాలో శ్రుతిమించిన అరాచకాలు.. ఓ నేత ఇలాకాలో గడ్డం గ్యాంగ్ సెటిల్‌మెంట్లు
బాగా వెనకేసుకున్న మాజీ మంత్రులు.. ఇళ్ల స్థలాల సేకరణలో కాసుల పండుగ
గోదావరి, కృష్ణా నదులు రాష్ట్రానికి అన్నపూర్ణ లాంటివి. ఆ జిల్లాల నేతలకు మాత్రం కాసులు కురిపించే కామధేనువులు. చాలామంది ఎమ్మెల్యేలు నదులతో పాటు వాగుల నుంచి ఎక్కడికక్కడ ఇసుకను బొక్కేశారు. విచ్చలవిడిగా అమ్ముకుని కోట్లు కొల్లగొట్టేశారు. గ్రావెల్ అక్రమ తవ్వకాల్లోనూ భారీగా దండుకున్నారు. ఇక్కడ పేకాట, కోడి పందేల ద్వారా మామూళ్లు స్పెషల్. మిగతా అవినీతి వ్యవహారాలు కామన్.
దందాలు చేయడంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో స్టైల్. ఇక్కడ కూడా అంతే. కొందరు ఎమ్మెల్యేలు తమ అనుచరులను ముందు పెట్టి నేరుగా దోపిడీ చేస్తున్నారు. మరికొందరు వెనకుండి అనుచరులను జనం మీదికి వదిలేస్తున్నారు. ఇంకొన్ని చోట్ల ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులు, బంధువులతో పాటు భార్యలు సైతం కమీషన్లు కుమ్మేస్తున్నారు. సొంత పార్టీ కార్యకర్తల నుంచి కూడా దండుకుంటున్నారు.
‘మేం గోదారోళ్లమండీ! మర్యాదల్లో ఎక్కడా తగ్గేదే లేదండి’.. అని ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు అంటుంటారు. ఆ ప్రాంత ఎమ్మెల్యేల తీరు మాత్రం.. ‘మేం అక్రమాల్లోనూ ఎక్కడా తగ్గేదే లేదండి’ అన్నట్టుంది. అక్రమార్జనలో ఎమ్మెల్యేలు చెలరేగిపోతున్నారు. భూకబ్జాలు, సెటిల్‌మెంట్లు, జగనన్న ఇళ్ల స్థలాల్లో స్కాములు, చదును పేరిట కుమ్ముడు.. వీటికి అదనంగా గోదావరి జిల్లాల ఎమ్మెల్యేలకు రెండు అదనపు అవకాశాలు దక్కాయి. అవే.. తవ్వుకున్నోళ్లకు తవ్వుకున్నంత అన్నట్టుగా ఇసుక! ‘కాయ్ రాజా కాయ్’ అంటూ పేకాట, కోడిపందేలు! రాష్ట్రంలో ఇసుక వ్యాపారం కేంద్రీకృతమైనప్పటికీ.. తూర్పుగోదావరి జిల్లాల్లో మాత్రం తల్లి గోదారి పుణ్యమా అని ఇసుక ఆదాయం వికేంద్రీకృతమైంది. అవకాశమున్న ఎమ్మెల్యేలందరూ ఇసుకను తోడేస్తున్నారు. జిల్లాలో ఇసుక నుంచి గనుల వరకు, ఉద్యోగుల బదిలీల నుంచి పోస్టింగ్‌ల వరకు ప్రతిదాంట్లోను అందిన కాడికి దండేస్తున్నారు. ‘తూర్పు’తో పోలిస్తే పశ్చిమలో కాస్త భిన్నమైన దందా నడుస్తోంది. ఇక్కడ పలువురు ఎమ్మెల్యేలు బాగా తెరవెనుక ఉండి, అనుచర గణాన్ని జనం మీదికి పంపుతున్నారు. బదిలీలు, పోస్టింగులు, కాంట్రాక్టు కొలువులు.. ఇలా అన్నింట్లోనూ సొమ్ములు కుమ్ముడే. ఇక కృష్ణా జిల్లాలో అవినీతి మరింత జోరుగా ఉంది. ఇసుక, గ్రావెల్ అక్రమ తవ్వకాల్లో కొందరు నేతలు కోట్లు సంపాదించారు. జగనన్న ఇళ్ల స్థలాల సేకరణ కాసుల వర్షం కురిపించింది. ఓ కీలక నేత, మాజీ మంత్రుల అవినీతి వ్యవహారం అంతా ఇంతా కాదు. ఓ మాజీ మంత్రి ఇలాకాలో గడ్డం గ్యాంగ్ చేస్తున్న అరాచకాలకు జనం బెంబేలెత్తిపోతున్నారు.
కృష్ణా జిల్లా గడ్డం గ్యాంగ్ అరాచకాలు
గతంలో బూతుల మంత్రిగా పేరొందిన ఎమ్మెల్యే నియోజకవర్గంలో పెద్ద ఎత్తున పేకాట క్లబ్బులు నడిపిస్తారు. నియోజకవర్గ పరిధిలో విలువైన స్థలాలు ఎక్కడున్నా వాటిని కబ్జా చేసేయడం ఆయన అనుచరుల పని. ఈ గ్యాంగ్‌కు ఎమ్టీ గ్యాంగ్ అని పేరు. ఆస్తి తగాదా ఉందంటే చాలు అక్కడ ఈ గ్యాంగ్ వాలిపోతుంది. పోలీసు ఉన్నతాధికారులు సైతం ల్యాండ్ సెటిల్‌మెంట్లకు ఎమ్టీ గ్యాంగ్ వద్దకు వెళ్లాలని సూచిస్తుండటం విస్తుగొలిపే అంశం. ఓ పాఠశాల నిర్వాహకుడు అప్పుల్లో కూరుకుపోతే సెటిల్‌మెంట్ చేస్తామని ఎమ్టీ గ్యాంగ్ రంగంలోకి దిగింది. పాఠశాల నిర్వాహకుడికి, అప్పు ఇచ్చిన వారికి కొంత మొత్తం ఇచ్చి ఈ గ్యాంగ్ రూ.కోట్లు కొల్లగొట్టినట్లు సమాచారం. ఇలా చెబుతూపోతే గ్యాంగ్ అరాచకాలు పెద్ద జాబితా అవుతుంది. భూములు, ఆస్తుల వివాదాల్లో తలదూర్చడం, సెటిల్‌మెంట్ పేరుతో బెదిరించడం, కోట్లు దండుకోవడం, కబ్జాలు చేయడం ఈ గ్యాంగ్‌కు నిత్యకృత్యంలా మారింది. జిల్లావ్యాప్తంగా జగనన్న ఇళ్ల కాలనీల మెరక కాంట్రాక్టుల్లో అత్యధిక శాతం అప్పట్లో మంత్రిగా ఉన్న ఎమ్మెల్యే అనుచరులే దక్కించుకున్నారు. ఇందులో బాగా డబ్బులు వెనుకేసుకున్నారు. ఇంతకుముందు ఇసుక తవ్వకాల్లోనూ ఉమ్మడి జిల్లాలో అధికశాతం ఆయన అనుచరుల ఆధిపత్యమే నడిచింది. నియోజకవర్గం కేంద్రంలో కీలక ప్రాంతాల్లో భూములను 22-ఏ జాబితా నుంచి తొలగించడానికి ముడుపులు ఇవ్వాలని కొంత మంది దళారులు గత రెండేళ్లుగా హల్‌చల్ చేస్తున్నారు. అదేమంటే ఎమ్మెల్యే అనుచరులమని బెదిరింపులకు పాల్పడుతున్నారు.
ఆయనంత మంచోడు లేడు మరి!
ఓ మాజీ మంత్రి అవినీతి స్టైలే వేరు. తెరపైకి తనంత మంచోడు లేడన్నట్టు ఈయన బిల్డప్ ఉంటుంది. జరగాల్సిన పనంతా అనుచరులతో కానిచ్చేస్తారు. చేతికి మట్టి అంటకుండా తనకు రావాల్సినవి రాబట్టుకుంటారు. ఆయన కనుసన్నల్లో అనుచరులు చేసే దందాలు అన్నీ ఇన్నీకావు. నియోజకవర్గంలోని ఓ గ్రామంలో 100 ఎకరాలకు పైగా మడ అడవిని తవ్వి చెరువులుగా చేసేశారు. జగనన్న ఇళ్ల స్థలాల వ్యవహారంలోనూ కమీషన్లు దండుకున్నారు. నియోజకవర్గ కేంద్రం మండల పరిధిలో వేలాది ఎకరాల అసైన్డ్ భూములున్నాయి. వీటిని చేపల చెరువులుగా భీమవరానికి చెందిన బడాబాబులు సాగు చేస్తుంటారు. వందలాది ఎకరాల తవ్వకాలు, రికార్డుల తారుమారు చేయడం వెనుక బిగ్‌డీల్స్ జరుగుతున్నాయి. మాజీ మంత్రి అనుచరుడు, ఓ మండల పార్టీ అధ్యక్షుడు ఇటీవల మడఅడవులు 20ఎకరాలు ఆక్రమించి రొయ్యల చెరువులు తవ్వించారు. ఏడాదికి ఎకరానికి రూ.50 వేల చొప్పున లీజుకు ఇచ్చారు. ఇటీవల మరో 100 ఎకరాలకు పైగా అసైన్డ్‌భూములను ఆక్రమించేశారు. ఇక మున్సిపల్ కార్పొరేషన్‌లో రూ.15 కోట్ల సిమెంటు రోడ్డు నిర్మాణ కాంట్రాక్టు పనులను మాజీ మంత్రి సూచించిన వారికే ఇచ్చారు. కొన్ని ప్రాంతాల్లో గతంలో వేసిన సిమెంటు రోడ్లపైనే మళ్లీ సిమెంటు రోడ్లు వేశారు. జాతీయ రహదారి 216-ఎ అభివృద్ధిలో భాగంగా రోడ్డు పనులకు బుసకను ఆయన అనుచరులు టిప్పర్ల ద్వారా తరలిస్తున్నారు. దాదాపు రెండువందల ఎకరాల్లోని బుసకను తరలించారు. ఎమ్మెల్యే రైస్‌మిల్లు నిర్మాణం కోసం రెండు ఎకరాలను కొనుగోలు చేశారు. ఈ భూమిలోకి బుసకను తరలించేస్తున్నారు. పోర్టుకు దగ్గరగా ఉన్న ఓ గ్రామంలో ఆయనకు చెందిన భూముల్లో భవిష్యత్తులో నిర్మించే గిడ్డంగుల కోసం బుసకను తరలిస్తున్నారు. ఆ నేత అనుచరుల దందాలతో వ్యాపారవేత్తలు బెంబేలెత్తుతున్నారు. తనకు వాటా ఇవ్వలేదని దాదాపుగా నిర్మాణం పూర్తికావచ్చిన భారీ మాల్‌కు సవాలక్ష అడ్డంకులు పెట్టి ఆపించేశారు.
దేవుడి సేవలో కొల్లగొట్టారు
కృష్ణా జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే గతంలో దేవుడి సేవలో తరించిపోయారు. కీలక పదవిలో ఉన్నప్పుడు ఆయన, ఆయన బినామీలు చేయని అక్రమాలు లేవు. పీఏలు సైతం ఆయన్ను ఆదర్శంగా తీసుకుని అడ్డదారులు తొక్కారు. ఓ పీఏ అధికార పార్టీ కార్పొరేటర్లకు ఫోన్లు చేసి ఒక్కొక్కరి నుంచి లక్ష రూపాయలు డిమాండ్ చేశారు. మరో పీఏ దేవుడి మాన్యాలకు అడ్డగోలుగా ఎన్‌వోసీలు జారీ చేసేందుకు ప్రయత్నించారు. ఎన్‌వోసీలు జారీ చేయకుండానే రూ.50 లక్షలకుపైగా ఖర్చు పెట్టానంటూ విజయవాడకు చెందిన ఒకరి నుంచి సుమారు రూ.15 కోట్ల విలువైన స్థలాన్ని కారుచౌకగా తన మామ పేరుపై రాయించేసుకున్నారు. నాలుగు సంస్థలకు చెందిన సుమారు రూ.100 కోట్లు విలువైన ఆస్తులపై సదరు ప్రజాప్రతినిధి అనుచరులు కన్నేశారు. శ్రీకన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానం మేనేజింగ్ కమిటీ పేరుతో ఓ లేఖ సిద్ధమైంది. దేవాదాయ శాఖ ఆధీనంలో ఉన్న పైనాలుగు సంస్థలను తమకు అప్పగించాలన్నది ఆ లేఖ సారాంశం. ఈ లేఖను అప్పట్లో మంత్రిగా పనిచేసిన ఎమ్మెల్యేకు ఇవ్వగా.. అదే రోజు ఆ లేఖపై ఫైలును సర్క్యులేట్ చేయాల్సిందిగా రాసేశారు. ఇక అనధికార కట్టడాల నుంచి వసూళ్లలోనూ ఆయన అనుచరులదే హవా. కరోనా కాలంలోనూ ఆయన అనుచరులు దోపిడీ ఆపలేదు.
ఉమ్మడి కృష్ణా జిల్లాలో 16 మంది ఎమ్మెల్యేలు ఉన్నా రు. టీడీపీ తరఫున గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలలో వల్లభనేని వంశీ వైసీపీ పంచన చేరారు. దీంతో అధికార పార్టీ బలం 15కు పెరిగింది. వీరిలో ఇద్దరు ఎమ్మెల్యేలపై పెద్దగా ఆరోపణలు లేవు. మిగిలినవారందరిపైనా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఓ కీలక నేతకు కమీషన్ల ఎమ్మెల్యే అన్న పేరు ఉంది.
విజయవాడకు పశ్చిమవైపు ఉన్న ఓ నియోజకవర్గం ఎమ్మెల్యే కనుసన్నల్లో ఆయన అనుచరులు కొండపల్లి రక్షిత అటవీప్రాంతంలో సుమారు రూ.100 కోట్ల విలువైన గ్రావెల్‌ను అక్రమంగా తవ్వేశారు. వీటీపీఎస్ నుంచి ఉచితంగా బూడిదను తరలించుకునేందుకు ఎమ్మెల్యే బామ్మర్ది రంగంలోకి దిగారు. విజయవాడ బైపాస్ రోడ్డు నిర్మాణం చేస్తున్న కాంట్రాక్టు సంస్థకు బూడిదను ఆయన లారీలే తరలిస్తుంటాయి. ఇతర లారీలు వచ్చినా బూడిద దక్కకుండా చేస్తారు. ఇక ఎమ్మెల్యే అండ చూసుకుని వైసీపీ నేతలు బరితెగిస్తున్నారు. ఓ వైసీపీ నేత ఎమ్మెల్యే పీఏ సాక్షిగా అటవీశాఖ ఉద్యోగులపై దాడి చేశారు.
విజయవాడకు ఆనుకుని ఉండే ఓ నియోజకవర్గం ఎమ్మెల్యే పేదల ఇళ్ల స్థలాల సేకరణలో పండుగ చేసుకున్నారు. భూముల ధరలు భారీగా ఉండటాన్ని ఆసరాగా చేసుకుని ఎమ్మెల్యే అనుచరులు ఎకరానికి రూ.10-15 లక్షలు కమీషన్‌గా తీసుకున్నారు. సుమారు రూ.100 కోట్లకు పైగా స్వాహా చేశారు.
కృష్ణా నది ఒడ్డున ఉన్న నియోజకవర్గమది. అక్కడ ఎమ్మెల్యే కన్నా ఆయన సతీమణి పవర్‌ఫుల్. మొత్తం పనులు చక్కబెడతారన్న పేరుంది. రేషన్ బియ్యాన్ని సేకరించి రీసైక్లింగ్ చేయించి విదేశాలకు ఎగుమతి చేయడంలో ఓ మంత్రి అనుచరులు ఆమె కనుసన్నల్లో పనిచేస్తుంటారు. నిత్యం నాలుగైదు బియ్యం లారీలు కాకినాడ పోర్టుకు తరలిపోతుంటాయి. ఎమ్మెల్యే కుమారుడిపైనా గంజాయి తరలింపు ఆరోపణలు ఉన్నాయి.
విజయవాడ-హైదరాబాద్ హైవేపై ఉన్న నియోజకవర్గమది. స్థానిక ఎమ్మెల్యేపై ఆరోపణలు లేవు కానీ ఆయన తమ్ముడు పెత్తనం చెలాయిస్తున్నారు. తమ్ముడి చాటు అన్నగా ఎమ్మెల్యే అపఖ్యాతి పొందారు. తమ్ముడు రాష్ట్ర స్థాయి పదవిలో ఉన్నారు. గ్రావెల్ గుట్టలను తవ్వేసి జాతీయరహదారి నిర్మాణం చేస్తున్న కాంట్రాక్టు సంస్థకు అమ్ముకోవడంలో ఆయన పాత్ర కీలకం. గ్రావెల్ తవ్వకాల ద్వారా రూ.50 కోట్లకు పైనే ఆర్జించారని సమాచారం.
సొంత పార్టీ వాళ్ల నుంచీ వసూళ్లు
కృష్ణా జిల్లాకు చెందిన రాష్ట్ర స్థాయి పదవిలో ఉన్న ఓ నేత వసూళ్లను చూస్తే సొంత పార్టీ కార్యకర్తలే బెంబేలెత్తిపోతారు. ప్రతి కాంట్రాక్టుకు 5 శాతం పర్సంటేజీ సమర్పించుకున్న తర్వాతే పని మొదలు పెట్టాలి. ఒక క్లాస్-1 కాంట్రాక్టరుకు రూ.10 కోట్లు విలువైన పనులు అప్పగించి రూ.45 లక్షలు పర్సంటేజీగా తీసుకున్నారు. అంగన్వాడీ ఆయా పోస్టులకూ డబ్బులు వసూలు చేసిన ఘనుడిగా ఈయన గురించి చెబుతారు. సుమారు 70 ఎకరాల్లో చేపల చెరువులను తన బినామీ పేరుతో తవ్వారు. మార్కెట్‌యార్డు, దేవాలయాల పాలకవర్గాల నియామకంలోనూ సొంత పార్టీ వారి నుంచే రూ.లక్షల్లో వసూలు చేశారనే విమర్శలు ఉన్నాయి. చేపలు, రొయ్యల చెరువులు తవ్వాలంటే ఆయన అనుచరులను ప్రసన్నం చేసుకుని అనుమతి తీసుకోవాలి. ఎకరానికి రూ.10వేలు చొప్పున సమర్పించుకోవాలి.
పశ్చిమ గోదావరి మట్టి మేశారు.. కమీషన్లు తిన్నారు
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఒకరిద్దరు తప్ప చాలామంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఈ నాలుగేళ్లలో మట్టి మేశారు. కమీషన్లు నొక్కారు. పోస్టింగ్‌ల పేరిట పైసల్లాగారు. గోదావరి దగ్గర నుంచి తమ్మిలేరు వరకు ఎక్కడ ఇసుక దొరికితే అక్కడ బొక్కేశారు. ఇక జగనన్న ఇళ్ల స్థలాల కొనుగోళ్ల వ్యవహారం జేబులు నింపింది.
గోదావరి తీరాన ఉన్న ఒక నియోజకవర్గమది. స్థానిక ఎమ్మెల్యే పొరుగున ఉన్న ఒక ఎంపీ సహకారంతో ఎక్కడిక్కడ ఇసుక దోపిడీకి పాల్పడ్డారు. ఎక్కడా అడ్డంకులు రాకుండా ఎక్కడికక్కడ మేనేజ్ చేశారు.కోట్ల రూపాయల గోదావరి ఇసుక అమ్మేశారు. జగనన్న ఇళ్ల స్థలాల్లోనూ సొమ్ము చేసుకున్నారు.
మెట్ట ప్రాంతంలోని ఓ నియోజకవర్గంలో జోరుగా మట్టి తవ్వకాలు జరుపుతున్నారు. కింది స్థాయి నేతలకు స్థానిక ఎమ్మెల్యే ఆశీస్సులు ఉన్నాయి. వచ్చిన దాంట్లో వాటాలు వేసుకుంటున్నారు. ఎమ్మెల్యే బంధువులు, మరికొందరి డైరెక్షన్‌లో ఈ వ్యవహారం సాగుతోంది. జగనన్న కాలనీల మెరక పనులు వీరే దక్కించుకున్నారు. అడ్డదిడ్డంగా ఎక్కడికక్కడ లక్షల రూపాయల్లో బిల్లులు పెట్టారు.
పోలవరం కుడి కాలువ సాగే ఒడ్డున ఉన్న నియోజకవర్గాల్లో అదొకటి. ఈ నియోజకవర్గంలో పోలవరం కాలువ గట్టు మట్టే ఎమ్మెల్యే బంధువులకు బంగారు గనిలా మారింది. రాత్రి, పగలు తేడా లేకుండా ఎడాపెడా తవ్వుకుంటూ వచ్చేశారు. అడ్డు తగిలితే అంతే సంగతులు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన మాజీ ఎమ్మెల్యే పీఏపై హత్యాయత్నం చేశారు. ఇక ఏ వాగులో దొరికినా సరే ఇసుకంతా స్వాహా చేసేస్తారు. నాలుగేళ్లలో లెక్కలేనంతగా పిండేశారు.
తీరంలో ఉన్న ఓ నియోజకవర్గంలో మెడికల్ కాలేజీ నిర్మాణమంటూ ముందస్తుగా తెగ ఊదరగొట్టేశారు. ఇక్కడ వస్తుంది.. అక్కడ వస్తుందని చెప్పి పుకార్లు పుట్టించారు. ఎక్కడికక్కడ రియల్ ఎస్టేట్‌ను ప్రోత్సహించి అందినకాడికి దండుకున్నారు. పైకి మాత్రం ఎమ్మెల్యే హస్తం లేదన్నట్టుగా సీన్ క్రియేట్ చేశారు. మెడికల్ కళాశాల కాస్తా ఇంకో నియోజకవర్గానికి తరలిపోయింది.
తూర్పుగోదావరి
అరాచకాలకు ద్వారం
రాష్ట్రంలోనే పెద్ద జిల్లా అయిన ఉమ్మడి తూర్పుగోదావరిలో ఆయన ఇంకా పెద్ద ఎమ్మెల్యే. ఆ నియోజకవర్గంలో కాకి కదలాలన్నా ఆయన ఆదేశం కావాల్సిందే అని చెబుతారు. పేరుకే ఆయన ఒక నియోజక ఎమ్మెల్యే కానీ.. మొత్తం జిల్లా ఆయన గ్రిప్‌లోనే ఉంటుంది. అనేక కొత్త కొత్త రకాల అక్రమాలకు ఆయనే ద్వారం తెరిచారనే ఆరోపణలున్నాయి. ఇలా కూడా సంపాదించవచ్చా... అని సహచర ఎమ్మెల్యేలు, పెద్ద మంత్రులే విస్మయపోతుంటారు. అదీ ఆ ఎమ్మెల్యే రేంజ్. జగనన్న కాలనీల ఇళ్ల స్థలాల చదును కాంట్రాక్టుల్లోనే రూ.200 కోట్ల వరకు సంపాదించినట్టు అంచనా. పోలవరం కాలువ మట్టి, కొండలు, గుట్టలు తవ్వి ఆ గ్రావెల్‌తో లేఅవుట్‌ను చదును చేసి రెండుచేతులా సంపాదించారు. ఇదే ‘చదును’ ముసుగులో.. వందల ఎకరాల్లో గ్రావల్ తవ్వేసి.. రోజూ వందల లారీల్లో తరలిస్తూ యథేచ్ఛగా మట్టిని అమ్ముకుంటున్నారు. రామేశం మెట్టలో వంద కోట్లు సంపాదించినట్టు సమాచారం. ప్రభుత్వ భూములను కబ్జా చేసినట్టు ఆరోపణలున్నాయి ఇక తన రొయ్యల ఫ్యాక్టరీ కోసం రూ.8 కోట్ల ప్రభుత్వ నిధులతో వంతెన వేయించుకున్నారు. సింహాచలం పాదయాత్ర పేరుతో కొవిడ్ రోగుల దుప్పట్లు, మంచాలు ఎత్తుకుపోయినట్టు విమర్శలు వచ్చాయి. ఎలాగూ ఆయనను ఎదిరించలేమనే నిర్ణయానికి వచ్చిన గనులు, రెవెన్యూ అధికారులు... ఆయన ఇచ్చిన కమీషన్ పుచ్చుకుని గమ్మున కూర్చుంటున్నారు. రేషన్ బియ్యం రీసైక్లింగ్, సముద్రంలో నౌకల నుంచి డీజిల్ దొంగ రవాణా.. వంటి అక్రమాలూ ఈ ఎమ్మెల్యే ఖాతాలో ఉన్నట్టు చెబుతారు.
మంత్రా మజాకా?
రాజా లాంటి ఒక మంత్రి.. ఇసుక నుంచి తైలం పిండేస్తున్నారు. అంతేకాదు, ఇక్కడ పరిశ్రమ పెట్టాలన్న సారుకు సొమ్ములు సమరించుకోవాల్సిందే. గత ఏడాది ఒక పారిశ్రామిక వేత్తను ఇలాగే అడ్డుకుని రూ.25 లక్షలు వసూలు చేశారు. పేదల ఇళ్లకు ఆవ భూములను అంటగట్టి కోట్లు దిగమింగారు. పోలవరం మట్టి, రియల్ ఎస్టేట్ ద్వారా బాగా సంపాదించారు. కాకినాడలో ఉన్న రెండు పోర్టుల అధికారులను పిలిపించుకుని నెలవారీ మామూళ్లు ఇవ్వాలని ఒత్తిడి చేశారు. తెలంగాణ మ ద్యం, ఇసుక తవ్వకం, గుట్కా వ్యాపారుల నుంచి మామూళ్లు దండుకుంటున్నారు.
డాక్టర్ సార్‌కు కానుకగా ఆస్పత్రి
జిల్లాలో ఓ నియోజకవర్గం ఎమ్మెల్యే వృత్తి రీత్యా డాక్టర్. ఆయన కుమారుడు కూడా డాక్టరే. అత్యంత కాలుష్యం వెదజెల్లే ఓ కంపెనీ విస్తరణకు స్థానికంగా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అయితే కంపెనీ విస్తరణ ఏర్పాటుకు ఎమ్మెల్యే సహకరిస్తున్నారు. ఇందుకు ప్రతిఫలంగా ఎమ్మెల్యే సార్ కుమారుడికి రాజమహేంద్రవరంలో రూ.6 కోట్లతో ఆస్పత్రి కట్టిస్తున్నారు. ఇక ఐదు జిల్లాల నుంచి వచ్చీపోయే పేకాటరాయుళ్లతో ఈ నియోజకవర్గం కళకళలాడుతుంటుంది. ఎమ్మెల్యే భార్య పేకాట క్లబ్‌లు నిర్వహిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ కోట్లలో జూదం జరుగుతుంటుంది. ఆమెకు పెద్ద మొత్తంలోనే కమీషన్ వస్తున్నట్టు తెలుస్తోంది.
పేకాట నుంచి కోడిపందేల వరకు అనుమతులన్నీ ఆసార్లే..
పురమంతా ఠారెత్తించే ఒక ఎమ్మెల్యే.. ఎస్‌ఐ పోస్టింగ్‌కు రూ.10 లక్షలు వసూలు చేస్తారు. ఇక.. ఇక్కడ కోడిపందేలు నిత్యకల్యాణంలా జరగుతుంటాయి. రూ.15 లక్షలు ఎమ్మెల్యేకు సమర్పించుకుంటే.. కోలాహలంగా, ప్లడ్‌లైట్ల వెలుగులో కోడి పందేలు నిర్వహించుకోవచ్చు.
మరో ఎమ్మెల్యే చేసే పాడు పనులకు అంతమే లేదు. రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలు ముట్టచెబితే.. పేకాట స్థావరాలను తానే చూపిస్తారు. జాతీయ రహదారి వెంట.. డీజిల్, తారు ముఠాల నుంచి నెలనెలా మామూళ్లు పుచ్చుకుంటారు. సీఐ పోస్టింగ్‌కు రూ.20 లక్షలు.. ఎస్‌ఐకి రూ.10 లక్షలు తీసుకుంటారు. జగనన్న ఇళ్ల కాలనీల కోసం ఒకచోట ఎకరా రూ.10 లక్షలు కూడా చేయని భూమిని ఏకంగా రూ.43 లక్షలకు ప్రభుత్వానికి అంటగట్టారు. ఈ డీల్‌లోనే రూ.5 కోట్లు సంపాదించారు. మరో మూడు చోట్ల ఇదే రకంగా రూ.24 కోట్లు పోగేసుకున్నారు.
ఒక ఎమ్మెల్యేకు తెలంగాణ మద్యమే తరగని గనిలా ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది. ఆయన పొరుగు రాష్ట్రం నుంచి మద్యం తెప్పించి డోర్ డెలివరీ చేస్తున్నట్టు ఆరోపణలున్నాయి.
ఎమ్మెల్యే కంటే ఎక్కువ స్థాయిలో ఉన్పప్పటికీ.. రాష్ట్రంలో ఇతర ప్రాంతాల వారికి పెద్దగా తెలియని ఒక నేత కోనసీమలో ఇసుక ర్యాంపు నుంచి ప్రతినెలా రూ.25 లక్షల కుమ్మేస్తున్నారు. బదిలీలు, పోస్టింగ్‌లు స్థాయిని బట్టి రూ.10 లక్షల నుంచి 25 లక్షల వరకూ వసూలు చేస్తున్నారు.
తూర్పుగోదావరి జిల్లాలోనే మంత్రిగా పనిచేసిన ఓ నేత.. సోదరుడు, తండ్రి తెగ సెటిల్‌మెంట్లు చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ వెంచర్ పడితే.. మాజీ మంత్రికి రూ.50 లక్షల నుంచి కోటి వరకు సమర్పించుకోవాల్సిందే. ప్రైవేటు సంస్థలు, కర్మాగారాల్లో ఉద్యోగాలు ఇప్పించి డబ్బులు తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
Updated Date - 2023-06-26T02:34:21+05:30 IST