అంగళ్లు కేసులో ముందస్తు బెయిల్
ABN, First Publish Date - 2023-10-14T04:04:35+05:30
టీడీపీ అధినేత చంద్రబాబుకు ఊరట లభించింది. అంగళ్లు ఘటనకు సంబంధించి అన్నమయ్య జిల్లా ముదివేడు పోలీసులు దాఖలు చేసిన కేసులో ఆయనకు హైకోర్టులో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
దాడిలో చంద్రబాబు నేరుగా పాల్గొనలేదు
జోక్యానికి సుప్రీంకోర్టు కూడా నిరాకరించింది: హైకోర్టు
అమరావతి, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): టీడీపీ అధినేత చంద్రబాబుకు ఊరట లభించింది. అంగళ్లు ఘటనకు సంబంధించి అన్నమయ్య జిల్లా ముదివేడు పోలీసులు దాఖలు చేసిన కేసులో ఆయనకు హైకోర్టులో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ముదివేడు పోలీసు స్టేషన్ అధికారి(ఎస్‌హెచ్ వో) సంతృప్తి మేరకు రూ.లక్ష విలువ చేసే బాండ్‌తో రెండు పూచీకత్తులు సమర్పించాలని చంద్రబాబును ఆదేశించింది. దర్యాప్తునకు సహరించాలని, సాక్షులను ప్రభావితం చేయరాదని స్పష్టం చేసింది. ఆయన్ను అరెస్టు చేసిన వెంటనే బెయిల్‌పై విడుదల చేయాలని ఎస్‌హెచ్‌వోకు స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కె. సురేశ్‌రెడ్డి శుక్రవారం తీర్పు వెలువరించారు. చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు, పోలీసుల తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. తీర్పులో ఏముందంటే.. ‘ఈ కేసులో ఐపీసీ సెక్షన్ 307 మినహా ఇతర సెక్షన్లు తీవ్రమైనవి కావు. ఫిర్యాదును పరిశీలిస్తే దాడి ఘటనలో చంద్రబాబు నేరుగా పాల్గొన్నట్లు ఆరోపణ లేదు. ఆయన పలుకుబడి ఉన్న వ్యక్తి అనే కారణంతో సాక్షులను ప్రభావితం చేస్తారని, దర్యాప్తునకు ఆటంకం కలిగిస్తారని భావించలేం. ఇదే కేసులో ఇతర నిందితులకు ముందస్తు బెయిల్ మంజూరు చేశాం. సుప్రీంకోర్టు సైతం ఈ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది’ అని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు.
Updated Date - 2023-10-14T04:04:35+05:30 IST