అంగన్వాడీ పిల్లలకు పాలేవీ?
ABN, First Publish Date - 2023-04-03T01:39:36+05:30
అంగన్వాడీ కేంద్రాల్లో పోషకాహారం ఇస్తున్నామని గొప్పగా చెప్పుకొంటున్న ప్రభుత్వం.. పిల్లలకు మాత్రం పాలు సక్రమంగా సరఫరా చేయలేకపోతోంది. రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలకు పూర్తిస్థాయిలో పాలు సరఫరా కావడం లేదు.
2-3 నెలలుగా పడిపోయిన పాల సరఫరా
మార్చిలో 36 వేల కేంద్రాలకే పాలు
కడప జిల్లాలో 40 శాతం కేంద్రాలకే!
మూడు నాలుగు జిల్లాలకే 70-80ు
మిగిలిన జిల్లాలకు 50ు లోపే సరఫరా
ప్రతి వేసవిలోనూ ఇదే సమస్య
అయినా పట్టించుకోని ప్రభుత్వం
అంగన్వాడీ కేంద్రాలకు కర్ణాటక పాలు
అమూల్ సేకరించే పాలు
ఇతర రాష్ట్రాల్లో అమ్మకం?
(అమరావతి-ఆంధ్రజ్యోతి): అంగన్వాడీ కేంద్రాల్లో పోషకాహారం ఇస్తున్నామని గొప్పగా చెప్పుకొంటున్న ప్రభుత్వం.. పిల్లలకు మాత్రం పాలు సక్రమంగా సరఫరా చేయలేకపోతోంది. రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలకు పూర్తిస్థాయిలో పాలు సరఫరా కావడం లేదు. రెండు మూడు నెలలుగా ఇదే పరిస్థితి ఉండగా.. మార్చి నెలలో అయితే పాల సరఫరా పూర్తిగా పడిపోయింది. ముఖ్యమంత్రి సొంత జిల్లా కడపలోనే 40 శాతం కేంద్రాలకే పాల సరఫరా జరిగిందంటే రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లోని పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ప్రతి నెలా మొదటి వారమే కేంద్రాలకు పాలు అందాల్సి ఉండగా... మార్చి నెల ముగిసినా అంగన్వాడీల్లోని గర్భిణిలు, బాలింతలు, పిల్లలకు పూర్తిస్థాయిలో పాలు అందలేదు.
ప్రతి ఏటా ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలల్లో అంగన్వాడీలకు పాల సరఫరాలో కొరత ఏర్పడుతుందని చెబుతున్నారు. రాష్ట్రంలో 55,607 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాల్లో మూడేళ్లలోపు చిన్నారులు 15 లక్షల మంది, 3-6 ఏళ్ల లోపు చిన్నారులు 11 లక్షల మంది ఉన్నారు. వీరికి వైఎస్సార్ సంపూర్ణ పోషణ, సంపూర్ణ పోషణ ప్లస్ కింద నెలకు 90 లక్షల లీటర్ల పాలను కర్ణాటక మిల్క్ సొసైటీ సరఫరా చేయాలి. ఏపీ డైరీ కర్ణాటక సహకార పాల ఉత్పత్తిదారుల సమాఖ్యతో ఒప్పందం చేసుకోవడంతో ఆ సొసైటీనే అంగన్వాడీలకు పాలు సరఫరా చేస్తోంది. అంగన్వాడీ కేంద్రాలకు ప్రతి నెలా 90 లక్షల లీటర్ల పాలు సరఫరా కావాల్సి ఉండగా.. 60-65 శాతం మాత్రమే సరఫరా అవుతున్నాయి. మార్చి నెలలో 55 లక్షల లీటర్లే సరఫరా జరిగింది. 35 వేల అంగన్వాడీ కేంద్రాలకు మాత్రమే పాల సరఫరా జరిగినట్లు సమాచారం. కడప జిల్లాలో మార్చి నెలలో 3,88,179 లీటర్ల పాల సరఫరా జరగాల్సి ఉండగా... 1.60 లక్షల లీటర్లే సరఫరా అయ్యాయి. అంటే 40 శాతమే పాలసరఫరా జరిగింది. అన్నమయ్య జిల్లాలో 3,18,482 లీటర్లు సరఫరా జరగాల్సి ఉండగా 1,37,920 లీటర్లే సరఫరా జరిగింది. కర్నూలు, న ంద్యాల జిల్లాల్లో కూడా సరఫరా 50 శాతం దాటలేదు. రాష్ట్రంలోని 26 జిల్లాలకుగాను మూడు నాలుగు జిల్లాల్లో 70 నుంచి 80 శాతం సరఫరా జరిగినా, మిగిలిన జిల్లాల్లో 50 నుంచి 65 శాతం మధ్యే పాల సరఫరా జరిగినట్లు తెలుస్తోంది. ప్రతి ఏటా వేసవిలో అంగన్వాడీలకు పాల సరఫరా కొరత వేధిస్తోంది. ఈ సమస్యను అధికమించడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
అమూల్‌తో పాలు సరఫరా చేయించలేరా?
జగన్ సర్కార్ ప్రభుత్వ డైరీలను అమూల్ సంస్థకు ఉదారంగా కట్టబెట్టింది. అయితే అమూల్ రాష్ట్రంలో సేకరించిన ప్రతి లీటరును రాష్ట్రంలో ప్రజల అవసరాలకు కాకుండా ఇతర రాష్ట్రాల్లో అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నదనే విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అమూల్ రోజుకు 1.50 లక్షల లీటర్ల పాలను సేకరిస్తోందనేది ఒక అంచనా. అంగన్వాడీలకు ఇతర రాష్ట్రాల నుంచి పాలుకొంటున్నామని చెబుతున్న ప్రభుత్వం.. పాల సరఫరాలో కొరత ఏర్పడినప్పుడు అమూల్ నుంచి తీసుకుని అంగన్వాడీలకు ఎందుకు సరఫరా చేయడంలేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. అంగన్వాడీల కోసం ప్రభుత్వం కర్ణాటక నుంచి పాలు సేకరిస్తుండగా.. రాష్ట్రంలో పాలు సేకరిస్తున్న అమూల్ మాత్రం ఇతర రాష్ట్రాల్లో అమ్ముకుంటోందని, అమూల్ పాలను అంగన్వాడీలకు సరఫరా చేస్తే పాల కొతర తీరుతుందని అంటున్నారు. అమూల్ సంస్థకు పాల క్యాన్లతోసహా అన్నీ ప్రభుత్వమే ఇస్తోందని, ఇన్ని సౌకర్యాలు ఇస్తున్నా.. రాష్ట్రంలోని అంగన్వాడీలకు పాల సరఫరాలో ఇబ్బందులు తలెత్తినప్పుడు అమూల్‌తో పాలు ఎందుకు సరఫరా చేయించలేకపోతున్నదనే విమర్శలు వస్తున్నాయి.
Updated Date - 2023-04-03T01:39:36+05:30 IST