ఈసారైనా పాసౌతారా?
ABN, First Publish Date - 2023-03-02T00:50:36+05:30
‘పదో తరగతి హాస్టల్ విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించాలి. సంక్షేమశాఖల అధికారులు నిత్యం పర్యవేక్షించాలి. వార్డెన్లు స్థానికంగా అందుబాటులో ఉండాలి’ అని కలెక్టర్ పదే పదే ఆదేశిస్తుంటారు. దీన్ని ఎవరు పాటిస్తున్నారో.. ఎవరు పాటించడం లేదో తెలియదు. కానీ ఏటా ఉత్తీర్ణత శాతం పడిపోతూనే ఉంది.
హాస్టళ్లలో చదువుల పట్ల అశ్రద్ధ
గత ఏడాది 35 శాతమే ఉత్తీర్ణత
చాలా హాస్టళ్లలో వందశాతం ఫెయిల్
పది పరీక్షలకు సిద్ధం చేయని అధికారులు
విద్యార్థులకు స్టడీ అవర్స్ ఎప్పుడు..?
అనంతపురం ప్రెస్‌క్లబ్, మార్చి 1: ‘పదో తరగతి హాస్టల్ విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించాలి. సంక్షేమశాఖల అధికారులు నిత్యం పర్యవేక్షించాలి. వార్డెన్లు స్థానికంగా అందుబాటులో ఉండాలి’ అని కలెక్టర్ పదే పదే ఆదేశిస్తుంటారు. దీన్ని ఎవరు పాటిస్తున్నారో.. ఎవరు పాటించడం లేదో తెలియదు. కానీ ఏటా ఉత్తీర్ణత శాతం పడిపోతూనే ఉంది. గత ఏడాది మరీ దారుణంగా రాష్ట్రంలో చిట్టచివరన నిలిచారు. కొన్ని వసతిగృహాల్లో జీరో పర్సంటేజీ వచ్చింది. సంక్షేమశాఖల ఉన్నతాధికారుల నుంచి వార్డెన్ల వరకూ పదో తరగతి హాస్టల్ విద్యార్థుల పట్ల శ్రద్ధ పెట్టడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఏటా 30 నుంచి 34 శాతంలోపు ఉత్తీర్ణత సాధించడం పట్ల తీవ్ర విమర్శలు వస్తున్నాయి. గత వైఫల్యాలను అధిగమించి, ఈసారైన మెరుగైన ఫలితాలు సాధిస్తారా..? ఎప్పటిలాగే గాలికి వదిలేస్తారా అన్న చర్చ జరుగుతోంది. పదో తరగతి పరీక్షలకు నెల రోజులే సమయం ఉంది. ఇప్పటికీ వసతిగృహాల్లో ఆ భయం కనిపించడం లేదు. స్టడీ అవర్స్‌ను తూతూ మంత్రంగానే నిర్వహిస్తున్నారు. వార్డెన్లు, స్టడీ అవర్స్ టీచర్లకు సంక్షేమశాఖల ఉన్నతాధికారులు అవగాహన కూడా కల్పించలేదు.
గతం దారుణం
గత ఏడాది జిల్లాలో బీసీ సంక్షేమశాఖ పరిధిలోని 36 వసతి గృహాల్లోని 589 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాశారు. వీరిలో 240 మంది ఉత్తీర్ణత సాధించారు. 349 మంది ఫెయిల్ అయ్యారు. ఎస్సీ సంక్షేమశాఖ పరిధిలోని 35 వసతి గృహాల్లో 436 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. వీరిలో 106 మంది ఉత్తీర్ణత సాధించగా... 330 మంది ఫెయిల్ అయ్యారు. ఎస్టీ సంక్షేమశాఖ పరిధిలో ఉమ్మడి జిల్లాలోని వసతిగృహాల్లో 86 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. కేవలం 11 మంది ఉత్తీర్ణత సాధించారు. 75 మంది ఫెయిల్ అయ్యారు. 11 ఎస్టీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 441 మంద విద్యార్థులు పరీక్షలు రాయగా, 174 మంది ఉత్తీర్ణత సాధించారు. 267 మంది ఫెయిల్ అయ్యారు.
ఎస్సీ వసతిగృహాల్లో సున్నా
జిల్లాలోని చాలా ఎస్సీ హాస్టళ్లలో గత ఏడాది సున్నాశాతం ఉత్తీర్ణత నమోదైంది. బుక్కరాయసముద్రం ఎస్సీ బాలుర వసతి గృహంలో 12 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా... అందరూ ఫెయిల్ అయ్యారు. వజ్రకరూరు ఎస్సీ బాలికల వసతిగృహంలో 8 మంది విద్యార్థినుల పరీక్ష రాయగా.. ఒక్కరూ పాస్ కాలేదు. చాబాల బాలుర వసతిగృహం నుంచి 13 మంది, గుత్తిలో బాలుర నంబర్ వన వసతిగృహంలో ఇద్దరు, సోమలాపురం ఎస్సీ బాలుర వసతిగృహంలో 8 మంది ఫెయిలై.. జీరో పర్సెంటేజీతో అప్రతిష్ట మూటగట్టుకున్నారు.
ఒకే ఒక్కరు..
శింగనమల ఎస్సీ బాలుర వసతిగృహంలో 13 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తే.. కేవలం ఒక్కరు పాసయ్యారు. నార్పల ఎస్సీ బాలికల వసతిగృహంలో 11 మందికి ఒకరు, గడేకల్లులోని బాలుర వసతి గృహంలో 20 మందికి ఒకరు తాడిపత్రి బాలికల వసతిగృహంలో ఏడుగురికి ఒకరు, కళ్యాణదుర్గంలోని ఎస్సీ బాలుర నంబర్ వన వసతిగృహంలో ఏడుగురికి ఒకరు, బెళుగుప్ప బీసీ బాలుర వసతిగృహంలో ఆరుగురికి ఒకరు, రాగులపాడు ఎస్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో 31 మందికి ఒకరు పాసయ్యారు. ఎస్సీ వసతిగృహాల్లో పదో తరగతి పాస్ పర్సెంటేజీ పెంచేందుకు సంక్షేమ శాఖ అధికారులు, వార్డెన్లు ఎంత కష్టపడ్డారో ఈ ఫలితాలను చూస్తే అర్థమవుతుంది.
పర్యవేక్షణ ఏదీ..?
పదో తరగతి పరీక్షలు సమీపించినప్పుడు విద్యాశాఖ, సంక్షేమ శాఖ అధికారులు వసతి గృహాలను పర్యవేక్షించాలి. రోజూ ఏదో ఒక హాస్టల్‌ను విజిట్ చేయాలి. విద్యార్థులు ఏ మేరకు చదువుతున్నారో పరిశీలించాలి. వార్డెన్లు అందుబాటులో ఉంటున్నారా...? స్టడీ అవర్స్‌కు టీచర్స్ వస్తున్నారా...? నిఘా పెట్టాలి. పది విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెంచేందుకు వార్డెన్లకు సూచనలు, సలహాలు ఇవ్వాలి. పరీక్షలు పూర్తయ్యేవరకు వార్డెన్లు విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలి. కానీ ఏ సంక్షేమశాఖ వసతి గృహంలోనూ ఇలాంటి చర్య లు కనిపించడం లేదు.
ప్రత్యేక దృష్టి పెడుతున్నాం..
గత ఏడాది పది ఫలితాలు తగ్గిన విషయం వాస్తవమే. ఈ ఏడాది ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. రెసిడెన్షియల్ పాఠశాలల ప్రిన్సిపాల్స్‌కు అన్ని రకాల సూచనలు ఇచ్చాం. ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, మెరుగైన ఫలితాల కోసం శ్రద్ధ పెట్టాలని ఆదేశించాం.
- అన్నాదొర, గిరిజన సంక్షేమశాఖ జిల్లా అధికారి
ఎక్స్‌పర్ట్ టీచర్లతో అవగాహన..
పదిలో ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలోని 5 ఏఎ్‌సడబ్ల్యూఓ పాయింట్ల వారీగా ఆదివారం మోటివేషన క్లాసుల ఏర్పాటు చేయాలని ఆదేశించాం. ఎక్స్‌పర్ట్ టీచర్లను పిలిపించి మోడల్ ప్రశ్నాపత్రం చూపించి.. విద్యార్థుల్లో భయాన్ని పోగొట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి హాస్టల్‌లో రాత్రి 7.30 నుంచి 9 గంటల వరకూ స్టడీ అవర్స్‌ను నిర్వహిస్తున్నాం. వార్డెన్లు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రత్యేక దృష్టిసారించాలని ఆదేశించాం.
- వై విశ్వమోహనరెడ్డి, డీడీ, ఎస్సీ సంక్షేమశాఖ
Updated Date - 2023-03-02T00:50:36+05:30 IST