ఎందుకో ఈ అన్యాయం !
ABN, First Publish Date - 2023-06-11T00:37:21+05:30
అధికారుల నిర్లక్ష్యం సచివాలయ డిజిటల్ అసిస్టెంట్లకు శాపంగా మారింది. పోలీస్ ఎంక్వైరీ పూర్తి కాకపోవడంతో వారికి ప్రొబేషన డిక్లేర్ చేయలేదు. దీంతో వారు ఉద్యోగంలో చేరి రెండేళ్లు పూర్తయినా బదిలీకి అనర్హులుగా మిగిలిపోయారు. ప్రధానంగా రెండో నోటిఫికేషన ద్వారా భర్తీ చేసిన డిజిటల్ అసిస్టెంట్ అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అధికారుల నిర్లక్ష్యంతో డిక్లేర్ కాని ప్రొబేషన
రెండేళ్ల సర్వీసు పూర్తయిన బదిలీకి దూరం
దూర ప్రాంతాల్లో లబోదిబోమంటున్న డిజిటల్ అసిస్టెంట్లు
అనంతపురం న్యూటౌన, జూన 10: అధికారుల నిర్లక్ష్యం సచివాలయ డిజిటల్ అసిస్టెంట్లకు శాపంగా మారింది. పోలీస్ ఎంక్వైరీ పూర్తి కాకపోవడంతో వారికి ప్రొబేషన డిక్లేర్ చేయలేదు. దీంతో వారు ఉద్యోగంలో చేరి రెండేళ్లు పూర్తయినా బదిలీకి అనర్హులుగా మిగిలిపోయారు. ప్రధానంగా రెండో నోటిఫికేషన ద్వారా భర్తీ చేసిన డిజిటల్ అసిస్టెంట్ అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాధారణంగా పోలీస్ ఎంక్వైరీ పూర్తి అయిన వెంటనే సంబంధిత అధికారులు వివరాలను ఎంపీడీఓ కార్యాలయానికి పంపుతారు. ఎంపీడీఓ సం బంధిత ఉద్యోగిని పిలిపించి ఎస్‌ఆర్, ఇతర వివరాలు సరిచూసుకోవాల్సి ఉంటుంది. అనంతరం పూర్తి వివరాలతో తయారు చేసిన ఎస్‌ఆర్, సంబంధిత ఫైళ్లను ఆ ఉద్యోగి డీపీఓ కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది. వాటిని కలెక్టర్ ఆమోదంతో ప్రొబేషన కోసం డీపీఓ కార్యాలయం వారు ప్రభుత్వానికి పంపాల్సి ఉంటుంది. అయితే మండలాధికారులు ఇవన్నీ తమకు ఏమి పట్టనట్లు వ్యవహరిస్తుండటంతో చిరుద్యోగులకు తిప్పలు తప్పడం లేదు.
రెండో విడతలో 131 మంది ఎంపిక
రెండో విడత నియామకాల్లో భాగంగా ఉమ్మడి జిల్లాలో 2021 జనవరిలో 131 మందికి డిజిటల్ అసిస్టెంట్లుగా పోస్టింగ్ ఇచ్చారు. వీరందరికి అవకాశం ఉన్న చోట పోస్టింగ్ ఇచ్చారు. ఇందులో చాలా మంది తమ ప్రాంతానికి సుదూరంగా కేటాయించబడ్డారు. తాజాగా వీరికి రెండేళ్ల సర్వీసు పూర్తి కావడంతో ప్రొబేషన ఖరారు చేస్తే అందుకు అనుగుణంగా బదిలీలకు ఆనలైన ద్వారా దరఖాస్తు చేసుకుంటే అవకాశం ఉంటుంది. తద్వారా దగ్గర ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉంది. అయితే వీరిలో కొందరికి అన్ని అర్హతలు ఉన్నా మండలాధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రొబేషన ఖరారు కాక మరో ఏడాది పాటు బదిలీకోసం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ముడుపులు ఇస్తేనే ఫైల్ ముందుకు
ప్రొబేషన డిక్లరేషనకు సంబంధించి సిబ్బంది సంబంధిత ధ్రువీకరణ పత్రాలు అందించినప్పటికీ జిల్లా పంచాయతీ కార్యాలయంలోని గుమస్తా ముడుపులు ముట్టచెప్పనిదే ఫైల్ ముందుకు పంపడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. డిజిటల్ అసిస్టెంట్లు పలు మార్లు కార్యాలయం చుట్టూ తిరిగిన ప్రయోజనం లేదన్న ప్రచారం జరుగుతోంది. మాది మాకిస్తేనే మీ పని జరుగుతుందని బహిరంగంగా చెపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
కార్యాలయానికి వచ్చిన వెంటనే పంపుతున్నాం
ప్రొబేషన డిక్లరేషన గురించి ఫైల్ కార్యాలయానికి రాగానే ఆలస్యం లేకుండా పంపుతున్నాం. బదిలీల ప్రక్రియ జరుగుతున్న కారణంగా దీనిపై ఎవరికి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. కార్యాలయానికి వచ్చిన వాటిలో ఇప్పటి వరకు ఏ ఒక్కటి పెండింగ్‌లో లేవు. పలు కారణాల వల్ల కార్యాలయానికి రికార్డులు అందించని వారే ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఇంకా ఎవరైనా ప్రొబేషన డిక్లేర్ కాని వారు ఉన్నట్లు అయితే వెంటనే మండలాధికారిని సంప్రదించి పోలీస్ ఎంక్వైరీ రిపోర్ట్‌తో పాటు ఇతర ధ్రువీకరణ పత్రాలు కార్యాలయంలో అందిస్తే వెంటనే పూర్తి చేయిస్తాం.
- ప్రభాకర్‌రావు, డీపీఓ
Updated Date - 2023-06-11T00:37:21+05:30 IST