ఏసీబీ వలలో వీఆర్వో
ABN, First Publish Date - 2023-02-21T23:14:15+05:30
పట్టాదారు పాసు పుస్తకం ఇచ్చేందుకు రైతు నుంచి లంచం తీసుకుంటున్న వీఆర్వోను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
పట్టాదారు పాసుపుస్తకం కోసం రైతు నుంచి లంచం
రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ అధికారులు
రాప్తాడు, ఫిబ్రవరి 21: పట్టాదారు పాసు పుస్తకం ఇచ్చేందుకు రైతు నుంచి లంచం తీసుకుంటున్న వీఆర్వోను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రాప్తాడు మండలం కొత్తపల్లి గ్రామంలో మంగళవారం ఈ ఘటన జరిగింది. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల మేరకు, రాప్తాడు మండలం కొత్తపల్లికి చెందిన యాలేటి లక్ష్మిరెడ్డి కుటుంబ సభ్యులు 20 ఏళ్ల నుంచి అనంతపురంలో నివాసం ఉంటున్నారు. కొత్తపల్లిలో (గాండ్లపర్తి రెవెన్యూ పొలం) లక్ష్మిరెడ్డి పేరిట సర్వే నంబర్ 14-7లో 5.50 ఎకరాల డి-పట్టా భూమి ఉంది. లక్ష్మిరెడ్డి 2021 జనవరిలో మృతిచెందాడు. ఆ తరువాత కొన్ని నెలలకు భూమిని తన పేరిట ఆనలైన చేయాలని లక్ష్మిరెడ్డి భార్య లక్ష్మిదేవి రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకుంది. లక్ష్మిదేవి పేరిట భూమి ఆనలైనలో ఎక్కినా.. పట్టాదారు పాసుపుస్తకం అందలేదు. దీంతో ఈ ఏడాది జనవరిలో గాండ్లపర్తి గ్రామ సచివాలయంలో పట్టాదారు పాసుపుస్తకం కోసం లక్ష్మిదేవి దరఖాస్తు చేసుకుంది. ఆ భూమికి సంబందించిన 1బీ, ఇతర ఆధారాలను రెవెన్యూ అధికారులకు అందజేసింది. ఈ దరఖాస్తును రెవెన్యూ అధికారులు తిరస్కరించారు. ఈ విషయమై లక్ష్మిదేవి కుమారుడు యాలేటి ప్రదీప్ కుమార్ రెడ్డి.. వీఆర్వో నరసింహులును ఇటీవల కలిశాడు. రూ.4 వేలు లంచం ఇస్తే కొత్త పాసు పుస్తకం మంజూరు చేస్తానని వీఆర్వో బేరం పెట్టాడు. దీంతో ప్రదీప్ కుమార్ రెడ్డి మంగళవారం రాప్తాడుకు వచ్చి వీఆర్వో నరసింహులుకు ఫోన చేశాడు. తాను కొత్తపల్లిలో ఉన్నానని, సాయంత్రం వరకూ అక్కడే ఉంటానని వీఆర్వో తెలిపాడు. ప్రదీప్ కుమార్ రెడ్డి వెంటనే ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 14400కి ఫిర్యాదు చేశాడు. ఏసీబీ డీఎస్పీ కంజాక్షన, అనంతపురం ఏసీబీ ఇన్సపెక్టర్‌లు మోహన ప్రసాద్, శంకర్‌రెడ్డి, శాంతిలాల్, శివగంగాధర్‌రెడ్డి, ఎస్‌ఐలు హరినాథ్‌రెడ్డి, నరేంద్రభూపతి కొత్తపల్లికి చేరుకున్నారు. వీఆర్వో నరసింహులు కొత్తపల్లి వైసీపీ సర్పంచ చంద్రకళ ఇంట్లో ఉండగా.. ఏసీబీ అధికారుల సూచన మేరకు ప్రదీప్ కుమార్ రెడ్డి వెళ్లి రూ.4 వేలు ఇచ్చాడు. వెంటనే ఏసీబీ అధికారులు సర్పంచ ఇంట్లోకి వెళ్లి వీఆర్వోను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం వీఆర్వోను రాప్తాడు తహసీల్దార్ కార్యాలయానికి తీసుకువెళ్లి విచారించారు. అధికార పార్టీ సర్పంచ ఇంట్లో వీఆర్వో లంచం తీసుకోవడం విమర్శలకు తావిస్తోంది.
Updated Date - 2023-02-21T23:14:17+05:30 IST