పీఆర్‌లో ఇద్దరు మోనార్క్‌లు...!
ABN, First Publish Date - 2023-06-07T00:27:37+05:30
ఉమ్మడి జిల్లా పంచాయతీరాజ్ శాఖలో ఇద్దరు ఈఈలు మోనార్క్‌ల అవతారమెత్తారు. అధికార పార్టీ అండతో డిప్యూటేషన్లపై తిష్టవేశారు. ఒకరిది పెత్తనమైతే... మరొక అధికారిది పైశాచిక ఆనందం.
- డిప్యూటేషనపై ఈఈలుగా తిష్ట
- ప్రజాప్రతినిధుల పేరుతో ఒకరిది పెత్తనం
- మరొకరిది ఉద్యోగులతో పైశాచిక ఆనందం
- ప్రతి పనికీ చేయి తడపాల్సిందే...
- కాంట్రాక్టర్లు, సిబ్బందికి తప్పని వేధింపులు
అనంతపురం, సీటీ, జూన 6 : ఉమ్మడి జిల్లా పంచాయతీరాజ్ శాఖలో ఇద్దరు ఈఈలు మోనార్క్‌ల అవతారమెత్తారు. అధికార పార్టీ అండతో డిప్యూటేషన్లపై తిష్టవేశారు. ఒకరిది పెత్తనమైతే... మరొక అధికారిది పైశాచిక ఆనందం. కాంట్రాక్టర్లతో కమీషన్లు... మాట వినని సిబ్బందికి వేధింపులు వడ్డిస్తూ ఆశాఖ పరువును రోడ్డున పడేస్తున్నారు. కడుపుమండి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా, మడతపేచీయే..! ఆ ఇద్దరి అధికారులకూ ప్రజాప్రతినిధుల అండ ఉండడంతో మీసమెత్తు కదిలించలేకపోతున్నారు. ఇంకేముంది.. అక్రమ వసూళ్లకు తెరలేపారు. అయినకాడికి దోచుకుంటున్నారు.
వసూళ్ల రాజా?
శ్రీసత్యసాయి జిల్లాలో పంచాయతీరాజ్ శాఖ ఈఈగా పనిచేస్తున్న అధికారి... మొదటి నుంచి ఉమ్మడి అనంతపురం జిల్లాలో వివిధ హోదాల్లో పనిచేశారు. ఈయన ఏపార్టీ అధికారంలో ఉంటే, ఆ పార్టీలోని తన సామాజిక వర్గ ప్రజాప్రతినిధుల పక్కన వాలిపోతారు. అదే ముసుగులో వసూళ్లకు పాల్పడేవారని సమాచారం. ఈక్రమంలో వైసీపీ అధికారంలోకి రాగానే.. పెనుకొండ డీఈఈగా పనిచేస్తున్న ఆయన్ను చిత్తూరు జిల్లాకు ఉద్యోగోన్నతిపై ఈఈగా బదిలీ చేసింది. అయితే ఆ అధికారి తన మార్కు ప్రదర్శించారు. ఆగమేఘాలపై తిరిగి యథావిధిగా శ్రీసత్యసాయి జిల్లాలోకి డిప్యూటేషన తెచ్చుకున్నారు. ప్రభుత్వం డిప్యూటేషన విధానాన్ని రద్దు చేసినా, ఆ నిబంధనలేవీ ఇతనికి అడ్డురావు. డిప్యూటేషనపై సదురు అధికారి ఇక్కడికి వచ్చాక, తన సామాజికవర్గ ప్రజాప్రతినిధుల పేర్లను వాడుతూ వసూళ్లకు తెరలేపాడని సమాచారం. ఈక్రమంలో కాంట్రాక్టర్లకు వల వేశాడు. బిల్లుకు, సంతకానికి, చేసిన పనుల బిల్లుల అప్‌లోడ్ చేయాలన్నా.. ఇలా ప్రతి దానికీ కమీషన్లకు చేయి చాపుతున్నట్లు ఆవర్గాల్లో చర్చసాగుతోంది. లక్షల రూపాయలు అక్రమంగా వసూళ్లు చేస్తున్నారనే విమర్శలూ లేకపోలేదు. తనవద్ద పనిచేస్తున్న ఉద్యోగులనూ వదలలేదు. ప్రతి సంతకానికీ లెక్కగట్టి మరీ వసూళ్లు చేస్తున్నాడన్న ఆరోపణలున్నాయి. పలు సందర్భాల్లో మహిళా ఉద్యోగుల పట్ల కూడా దురుసుగా ప్రవర్తించారని సమాచారం. కొందరు ఉద్యోగులు, కాంట్రాక్టర్లు సదురు అధికారి తీరుపై ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధిత వర్గాలు వాపోతుండటం గమనార్హం.
ఉద్యోగులకు వేధింపులు..
గత ఏడాది సీనియారిటీ ప్రాతిపదికన డీఈఈ నుంచి ఉద్యోగోన్నతి పొందాడు. ఈఈగా అనంతపురం జిల్లాలో విధులు నిర్వహిస్తున్నారు. ఈ అధికారి కాంట్రాక్టర్ల నుంచి కమీషన్ల రూపంలో అందినకాడికి దోచుకుంటున్నారనే విమర్శలూ లేకపోలేదు. అక్కడితో ఆగకుండా, కిందిస్థాయి ఉద్యోగులను పదేపదే కార్యాలయాకి పిలుపించుకుంటారు. వారితో కాలయాపన చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నాడని బాధిత వర్గాలు వాపోతున్నాయి. ఏదో సాకుతో నిత్యం పలు రకాలుగా వేధింపులకు గురిచేస్తున్నాడని ఉద్యోగులు ఆసంతృప్తి చెందుతుండటం గమనార్హం. ఉద్యోగోన్నతితో మరింత బాధ్యతగా పనిచేసి గుర్తింపు కోసం ఆరాటపడాల్సిన ఆ అధికారి... రెక్కలు వచ్చినట్లు కిందస్థాయి సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించడం పలు విమర్శలకు తావిస్తోంది.
ప్రశ్నించే వారు లేకనే..
పంచాయతీరాజ్ శాఖ ఉమ్మడి జిల్లాలో క్షేత్రస్థాయిలో ఏ కాంట్రాక్టర్‌ను కదలించినా ఈ ఇద్దరి అధికారుల తీరు విస్మయానికి గురిచేస్తోంది. పైసలిస్తేనే బిల్లు అన్న నానుడికి తెరదించారు. ఉద్యోగోన్నతితో ఈఈలుగా రాగానే... ఎవరికి వారు తమదైన శైలిలో వసూళ్లకు పూనుకున్నట్లు తెలిసింది. సంతకం కావాలంటే చేయి తడపాల్సిందేనని ఆశాఖ వర్గాల్లో చర్చసాగుతోంది. శ్రీసత్యసాయి జిల్లాకు చిత్తూరు జిల్లాలో పనిచేస్తున్న (ఈఈ) చంద్రశేఖర్‌ను, ఇక్కడ పనిచేస్తున్న సదురు మోనార్క్ అధికారి (ఈఈ)ని చిత్తూరు జిల్లాకు ప్రభుత్వం రెండున్నరేళ్ల క్రితం బదిలీ చేసింది. పైరవీలు చేసి ఆగమేఘాలపై పాత స్థానం శ్రీసత్యసాయి జిల్లాకు డిప్యూటేషన తెచ్చుకున్నారు. అధికార పార్టీకి చెందిన తమ సామాజిక వర్గ ప్రజాప్రతినిధుల అండదండలతోనే డిప్యూటేషన సాధ్యమైందని జోరుగా ప్రచారం జరుగుతోంది. సదురు అధికారి మోనార్క్‌లా ప్రవర్తించినా, కిందిస్థాయి ఉద్యోగులు, కాంట్రాక్టర్లు ధైర్యంగా ప్రశ్నించలేక మిన్నుకుండిపోతున్నారు.. ఇతర శాఖల్లో ఎక్కడికక్కడ డిప్యూటేషన్లను ప్రభుత్వం రద్దు చేసి, రెగ్యూలర్ స్థానాలకు పంపుతోంది. అయితే ఉమ్మడి పంచాయతీరాజ్ శాఖలోని సదురు ఈఈ మాత్రం రెండేళ్లు దాటినా కూడా ఇక్కడే పనిచేస్తుండటం విమర్శలపాలైంది. రెగ్యులర్ ఈఈ కాక పోయినా.. మోనార్క్‌లా ప్రవర్తిస్తుండటం బాధిత వర్గాలను కలవరపెడుతోంది. అంతా తెలిసినా కూడా ఆశాఖ ఉన్నతాధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికైనా ఉమ్మడి జిల్లా కలెక్టర్లు సదురు మోనార్క్‌ల వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టి, చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Updated Date - 2023-06-07T00:27:37+05:30 IST