హెచ్చెల్సీ శిథిలం
ABN, First Publish Date - 2023-06-26T00:21:43+05:30
హెచ్చెల్సీ ఆధునికీకరణను మరిచిపోయారు. ఈ ఏడాది నీరు వదిలే సమయానికి మరమ్మతులు పూర్తి చేస్తారని ఆశించిన రైతులకు నిరాశ మిగులుతోంది. గత ఏడాది మే 20న నిర్వహించిన సాగునీటి సలహా మండలి (ఐఏబీ) సమావేశంలో ప్రజాప్రతినిధులు, అధికారులు హెచ్చెల్సీ మరమ్మతుల గురించి ప్రస్తావించారు.
కాలువలో ముళ్ల పొదలు
శిథిలావస్థలో వంతెనలు
ఆగిన ఆధునికీకరణ పనులు
ఏడాదిలో పూర్తి చేయాలని ఐఏబీలో నిర్ణయం
ఏడాది గడిచినా.. ప్రతిపాదనలపై కదలిక లేదు
తుంగభద్ర నీటి పారుదలకు నిత్యం ఆటంకాలు
హెచ్చెల్సీ ఆధునికీకరణను మరిచిపోయారు. ఈ ఏడాది నీరు వదిలే సమయానికి మరమ్మతులు పూర్తి చేస్తారని ఆశించిన రైతులకు నిరాశ మిగులుతోంది. గత ఏడాది మే 20న నిర్వహించిన సాగునీటి సలహా మండలి (ఐఏబీ) సమావేశంలో ప్రజాప్రతినిధులు, అధికారులు హెచ్చెల్సీ మరమ్మతుల గురించి ప్రస్తావించారు. వచ్చే ఐఏబీ సమావేశం నాటికి పనులు పూర్తి చేయాలని, అందుకు అవసరమైన నిఽధులు ప్రభుత్వం మంజూరు చేస్తుందని అన్నారు. ఏడాది గడిచినా హెచ్చెల్సీ నిర్వహణ, మరమ్మతులకు ఒక్క పైసా ఇవ్వలేదు. నీటి కోసం మాత్రం అధికారపార్టీ ప్రజాప్రతి నిధులు పోటీపడతారు. నిధులు రాబట్టే విషయంలో మరొకరిపై నెట్టేసి చేతులు దులుపుకుంటున్నారు.
- అనంతపురం క్లాక్‌టవర్
గాలికి వదిలేశారు
జిల్లాకు సాగు, తాగునీరు అందించే తుంగభద్ర ఎగువ కాలవ (హెచ్చెల్సీ) నిర్వహణను ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోంది. ఏకంగా 15 ఏళ్ల నుంచి ఆధునికీకరణ పనులు జరుగుతున్నా.. నీటికీ పూర్తి కాలేదు. హెచ్చెల్సీ ఆధునికీకరణ పనులను 2007లో రూ.450 కోట్లతో ప్రారంభించారు. ఏళ్లు గడుస్తున్నా ఇవి పూర్తి కాలేదు. దీంతో ప్రస్తుత ధరలకు అనుగుణంగా ప్రతిపాదనలు రెట్టింపు ధరలతో సిద్ధం చేశారు. పెంచిన రేట్ల ప్రకారం హెచ్చెల్సీ అధికారులు, ఇంజనీర్లు ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపారు. ఆంధ్రా సరిహద్దులోని బొమ్మనహాళ్ వద్ద ఉన్న 105 కి.మీ. నుంచి.. 189వ కి.మీ. వరకు.. అంటే 84 కి.మీ. మేర ప్రధాన కాలువ వెడల్పు, గట్టు పటిష్టత, యూటీలు, అక్విడక్ట్‌లు, లైనింగ్, బ్రాంచి కాలవల ఆధునికీకరణకు అప్పట్లో నిధులు కేటాయించారు. ఆరు ప్యాకేజీలుగా విభజించి పనులు ప్రారంభించారు. ఇది ఆరంభ శూరత్వమే. మొదట్లో పనులు బాగానే చేశారు. తరువాత మందగించాయి. గడిచిన మూడేళ్లలో ఒక్క ఇంచూ కదల్లేదు. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ, 2020లో హెచ్చెల్సీ ఆధునికీకరణ పనులను రద్దు చేసింది. రివర్స్ టెండర్లకు ప్రతిపాదించింది.
ఆగిన పనులు
హెచ్చెల్సీ ఆధునికీకరణ పనుల్లో నిధుల దుర్వినియోగం భారీగా జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. 15 ఏళ్లలో సగం పనులను మాత్రమే చేశారు. 2007లో కేటాయించిన రూ.450 కోట్లలో రూ.300 కోట్ల వరకు ఖర్చు చేశారు. మిగిలిన రూ.150 కోట్ల పనులు చేయాల్సి ఉంది. కానీ గత మూడేళ్లుగా స్తంభించాయి. పైసా కూడా ఖర్చు చేయలేదు. దీంతో కాలువకు ఇరువైపులా, మధ్యలో ముళ్ల పొదలు పెరిగాయి. మట్టి పేరుకుపోయింది. వైసీపీ అధికారం చేపట్టాలక హెచ్చెల్సీ పరిధిలో పనులన్నింటినీ రద్దు చేశారు. ఇందులో హెచ్చెల్సీ ఆధునికీకరణ పనులూ ఉన్నాయి.
బ్రిడ్జిల మరమ్మతు ఏదీ..?
హెచ్చెల్సీపై వంతెనలు ప్రమాదపుటంచున ఉన్నాయి. మరమ్మతు పనులు చేయాలని ఇంజనీర్లు నాలుగేళ్లుగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా నిఽధులు మంజూరు కాలేదు. ప్రధాన కాలువను దాటేందుకు ఏర్పాటు చేసిన వంతెనలు చాలా ప్రాంతాల్లో బాగా దెబ్బతిన్నాయి. బొమ్మనహాళ్ మండలంలోని ఉద్దేహాళ్, దర్గాహొన్నూరు, కణేకల్లు, కూడేరు మండలాల పరిధిలో సుమారు 50 బ్రిడ్జిలు బాగా దెబ్బతిన్నాయి. కొద్దిపాటి వర్షం వచ్చినా, కాలువలో ప్రవాహ స్థాయి పెరిగినా రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. కాలువ గట్లు తెగిపడుతున్నాయి. దెబ్బతిన్న కాలువ గట్లు, వంతెనలు, శిథిలావస్థకు చేరిన వంతెనల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపినా నిధులు మంజూరు కావడం లేదు. ఆధునికీకరణ పనులు పూర్తి చేస్తే హెచ్చెల్సీ సామర్థ్యం పెరగనుంది. కానీ ఈ ఏడాది ఆ దిశగా చర్యలు లేవు. వర్షాలు కురిస్తే జూలై, ఆగస్టులో నీటిని విడుదలకు అవకాశం ఉటుంది. ఆంధ్రా సరిహద్దు నుంచి ప్రస్తుతం 2500 క్యూసెక్కుల నీటి విడుదలకు చర్యలు అవకాశం కల్పిస్తున్నారు. దీన్ని 4500 క్యూసెక్కులకు పెంచాలన్నదే హెచ్చెల్సీ ఆధునికీకరణ ప్రధాన ఉద్దేశం. ఈ పనులు పర్తి అయితే రాయలసీమలో 2.90 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందుతుంది. ప్రధాన నగరాలు, పట్టణాల ప్రజలకు తాగునీటి సమస్య తప్పుతుంది.
ప్రతిపాదనలు పంపాం..
గత ఏడాది ఐఏబీలో చర్చించిన అంశాలను ప్రజాప్రతినిధులు సూచించిన మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. దీంతోపాటు హెచ్చెల్సీ ఆధునికీకరణ పనుల నిలుపుదల, తిరిగి కొనసాగింపుపై కూడా ప్రభుత్వానికి వివరాలు అందజేశాం. మరమ్మతులకు ఇప్పటికే పలుమార్లు ప్రతిపాదనలు పంపాం. టెండర్లు కూడా పిలిచాం. అయితే కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. ఆధునికీకరణ పనులు గత 15 ఏళ్ళుగా జరుగుతున్నమాట వాస్తవమే. పలు కారణాలతో పనులలో జాప్యం జరిగింది. ప్రతిపాదనలు పంపినవాటికి అనుమతులు రాగానే పనులు ప్రారంభిస్తాం.
- రాజశేఖర్, హెచ్చెల్సీ ఎస్‌ఈ
Updated Date - 2023-06-26T00:21:43+05:30 IST