సొంతూరికి గుంతల దారి!
ABN, First Publish Date - 2023-08-02T00:30:14+05:30
రాప్తాడు ఎమ్మెల్యే ప్రకా్‌షరెడ్డి స్వగ్రామం తోపుదుర్తికి వెళ్లే రహదారి అధ్వానంగా ఉంది. అనంతపురం నుంచి యాలేరు, సనప మీదుగా తోపుదుర్తి వరకు, అక్కడి నుంచి రాప్తాడు మండలంలోని పాలచెర్ల, బోగినేపల్లి, కనగానపల్లి మండలంలోని తరగకుంట వరకూ రోడ్డు కంకర తేలి.. గుంతలు పడింది.
నత్త నడకన తారు రోడ్డు పనులు
రెండేళ్లుగా కల్వర్టులనూ పూర్తి చేయలేదు
పట్టించుకోని రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి
రాప్తాడు,ఆగస్టు1: రాప్తాడు ఎమ్మెల్యే ప్రకా్‌షరెడ్డి స్వగ్రామం తోపుదుర్తికి వెళ్లే రహదారి అధ్వానంగా ఉంది. అనంతపురం నుంచి యాలేరు, సనప మీదుగా తోపుదుర్తి వరకు, అక్కడి నుంచి రాప్తాడు మండలంలోని పాలచెర్ల, బోగినేపల్లి, కనగానపల్లి మండలంలోని తరగకుంట వరకూ రోడ్డు కంకర తేలి.. గుంతలు పడింది. అనంతపురం నుంచి తరగకుంట వరకూ డబుల్‌లైన తారురోడ్డు పనులకు ఆర్‌అండ్‌బీ శాఖకు నిధులు మంజూరయ్యాయి. ఈ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఏళ్లు గడుస్తున్నా పూర్తి కావడంలేదు. కొన్నిచోట్ల పనులను నిలిపివేశారు. ఎమ్మెల్యే సొంతూరుకు వెళ్లే దారి పనులను పూర్తి చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది.
పొంచి ఉన్న ప్రమాదం
రాప్తాడు మండలంలోని బోగినేపల్లి సమీపంలో రోడ్డు పరిస్థితి ఇది. తారురోడ్డు నిర్మాణం కోసం బోగినేపల్లి సమీపంలో వంక వద్ద కల్వర్టు నిర్మించేందుకు దారి మళ్లించారు. కల్వర్టు కడ్డీలు దారికి ఆనుకుని ఉన్నాయి. కాంట్రాక్టర్లు ఇక్కడ ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయలేదు. వాహనదారులకు రాత్రిళ్లు ఇది ప్రమాదకరంగా మారుతోంది. ఇకనైనా కాంట్రాక్టర్లు ఇక్కడ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయల్సిన అవసరం ఉంది.
వాహనదారులకు ఇబ్బందులు
యాలేరు నుంచి తగరకుంట వరకూ తారు రోడ్డు నిర్మాణ పనులు నత్తనడకన సాగుతుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనంతపురం నుంచి తగరకుంట వరకూ బస్సులు, ఆటోలు, జీపులు, ద్విచక్రవాహనాలు అధికంగా వెళుతుంటాయి. గుంతలు, కంకర తేలిన దారిలో వెళ్లడం ప్రమా దకరంగా ఉందని వాహనదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు నిర్మాణ పనులను ఎప్పుడు పూర్తి చేస్తారో అని ఎదురు చూస్తున్నారు.
గడువు తీరినా..
అనంతపురం నుంచి ఆలమూరు, యాలేరు వరకూ డబుల్‌లైన తారురోడ్డు, యాలేరు నుంచి సనప, రంగంగపేట, తోపుదుర్తి, పాలచెర్ల, బోగినేపల్లి, తరగకుంట వరకూ సింగల్ లైన తారురోడ్డు ఉండేది. యాలేరు నుంచి తోపుదుర్తి మీదుగా తగరకుంట వరకూ దాదాపు 25 కి.మీ. తారురోడ్డు వెడల్పు, అభివృద్ధి పనులకు ప్రభుత్వం ఆర్‌అండ్‌బీకి దాదాపు రూ.52 కోట్లు మంజూరు చేసింది. తారు రోడ్డు వెడల్పు పనులను 2021 ఏప్రిల్‌లో ప్రారంభించి, 2023 ఏప్రిల్‌లో పూర్తి చేయాల్సి ఉంది. ఈ మేరకు ఆర్‌అండ్‌బీ అధికారులు యాలేరు చెరువు కట్ట వద్ద రోడ్డు పక్కన బోర్డు ఏర్పాటు చేశారు. కానీ తారురోడ్డు నిర్మాణ పనులు పూర్తి కాలేదు. పనులు చాలా నెమ్మదిగా జరుగుతున్నాయి. యాలేరు నుంచి తరగకుంట వరకూ 15కు పైగా కల్వర్టులు నిర్మించాల్సి ఉంది. కొన్నిచోట్ల కల్వర్టులు సగం నిర్మించి వదిలేశారు. మరికొన్ని చోట్ల పనులు నత్తనడకన సాగుతున్నాయి.
త్వరలో పూర్తి చేస్తాం..
బిల్లులు ఆలస్యం కావడంతో పనులు సకాలంలో పూర్తి కాలేదు. ప్రస్తుతం రోడ్డు పనులు జరుగుతున్నాయి. రోడ్డు పూర్తి చేసేందుకు గడువును పొడిగించాం. త్వరలోనే పనులు పూర్తి చేయిస్తాం.
- బాల కాటమయ్య, ఆర్‌అండ్‌బీ డీఈఈ
Updated Date - 2023-08-02T00:30:14+05:30 IST