గవర్నమెంట్ పనా.. వద్దులేప్పా!
ABN, First Publish Date - 2023-05-02T00:18:40+05:30
కోట్లాది రూపాయల పనులు...కానీ ఒక్క రూపాయి కూడా బిల్లు కాలేదు. గడప గడపకు మన ప్రభుత్వం కింద ఒక్కో సచివాలయానికి రూ.20లక్షలు చొప్పున నిధులు కేటాయిస్తామ న్నారు. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి కోసం నిధులు కేటాయి స్తామని గొప్పలు చెప్పుకొచ్చింది.
ప్రభుత్వ పనులకు మంజూరు కాని బిల్లులు
రూ.3 కోట్ల పనులు చేస్తే రూపాయి రాని వైనం..
మీ పనులకో నమస్కారమంటున్న కాంట్రాక్టర్లు
పనులు చేయండి అని చెబుతారు. నిధులు కూడా కేటాయించామంటారు. కానీ చేసిన పనులకు బిల్లులు మాత్రం చెల్లించరు. దీంతో కాంట్రాక్టర్లు చేసిన పనులకు బిల్లులు రాక.. మిగిలిన పనులు చేయలేక బిక్కమొహం వేస్తున్నారు. కొందరైతే బిల్లులు చెల్లిస్తేనే మిగతా పనులు చేస్తామని మొండికేస్తున్నారు. ఇదీ ప్రస్తుతం నగరపాలికలో నెలకొన్న పరిస్థితి.
అనంతపురం క్రైం: కోట్లాది రూపాయల పనులు...కానీ ఒక్క రూపాయి కూడా బిల్లు కాలేదు. గడప గడపకు మన ప్రభుత్వం కింద ఒక్కో సచివాలయానికి రూ.20లక్షలు చొప్పున నిధులు కేటాయిస్తామ న్నారు. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి కోసం నిధులు కేటాయి స్తామని గొప్పలు చెప్పుకొచ్చింది. కానీ చేసిన పనులకు ఒక్క పైసా కూడా విదిల్చింది లేదు. దీంతో అనంతపురం నగరపాలికలో కాంట్రాక్టర్లు బిక్క మొహం చేశారు. పనులు చేయడానికి జంకుతున్నారు. ప్రతి సచివాలయ పరిధిలో ఉన్న సమస్యలు, అభివృద్ధి పనులకు సంబంధించి ఈ నిధులు ప్రత్యేకంగా ఖర్చు చేయాల్సి ఉంది. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యేలు ప్రతి సచివాలయ పరిధిలో ఇంటింటికి తిరిగారు. అందులో స్థానికులు చెప్పిన సమస్యలు, చేయాల్సిన పనులను నమోదు చేసుకొని సచివాలయం ద్వారా ప్రభుత్వానికి నివేదికలు పంపారు. సీసీ రోడ్లు, కాలువలు, కల్వర్టులు, ఇలా వివిధ అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉంది. కానీ బిల్లులు రాకపోవడంతో పనులెప్పుడు ముందుకు సాగుతాయో అర్థం కాని పరిస్థితి.
పనులకు కాంట్రాక్టర్లు నో...
నగరంలో మొత్తం రూ.13కోట్లకు పైగా పనులు జరగాల్సి ఉండగా ఇప్పటివరకు రూ.3కోట్ల వరకు పనులు పూర్తయిన పరిస్థితి. ఇందులో కేవలం రూ.1.70కోట్లకు మాత్రమే పే అండ్ అకౌంట్స్ ఆఫీసర్ (పీఏఓ)కు బిల్లులు పంపారట. ప్రస్తుతం వాటికి మాత్రమే నిధులు మంజూరైనట్లు స్పష్టం చేశారట. అయితే వాటికి కూడా ఇంకా బిల్లు(పేమెంట్) కావాల్సి ఉంది. ఇంకా సుమారు రూ.1.20కోట్లకు సంబంధించిన పనులకు బిల్లులు తీసుకోలేదని తెలిసింది. వాటికి ఇంకా ప్రభుత్వం నుంచి నిధులు మంజూ రు కాలేదని స్పష్టం చేశారట. ఈ క్రమంలో మరో రూ.1.5కోట్ల పనులు చేపట్టాల్సి ఉండగా వాటికి బ్రేక్ పడినట్లు సమాచారం. కాంట్రాక్టర్లు పనులు చేయడానికి వెనుకడుగు వేయడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఇప్పటివరకు కనీసం రూ.లక్ష కూడా బిల్లు కాకపోవడంతో కాంట్రాక్టర్లు ఆందోళన చెందుతున్నారు. మరో రూ.1.2కోట్లకు నిధులు మంజూరు కాకపోవడంతో కాంట్రాక్టర్లు ఆందోళన చెందుతున్నారు.
రూ.3 కోట్ల వరకు పనులు పూర్తి
నగరంలోని శారదానగర్‌కాలనీ సమీపంలోని విజయనగర్‌కాలనీలో రూ.18లక్షలతో ఓ కాంట్రాక్టర్ సీసీ డ్రెయిన పూర్తి చేశాడు. బిల్లు కోసం ఎదురు చూస్తున్నాడు. సచివాలయం పరిధిలో నీరుగంటి వీధిలో రూ.20 లక్షలతో సీసీ రోడ్డు పూర్తయింది. కానీ ఇంకా బిల్లు కాలేదు. తారకనాథ్‌కాలనీలో రూ.20లక్షలతో సీసీ డ్రెయిన నిర్మించారు. ఈ బిల్లు వస్తేనే ఇంకో పని మొదలుపెడతానని కాంట్రాక్టర్ మొండికేశాడు. అనంతపురం నగరంలో మొత్తం 74 సచివాలయాలున్నాయి. ఇందులో 68 సచివాలయాలకు ఒక్కోదానికి రూ.20లక్షల చొప్పున నిధులు వెచ్చించాల్సి ఉంది. ఆ మేరకు మొత్తం రూ.13.6కోట్ల నిధులు కేటాయించారు. అందులో భాగంగా మొత్తం రూ.2.84కోట్లతో 71 పనులు పూర్తయ్యాయి. అందులో రూ.1.70 కోట్లకు మాత్రమే బిల్లు కోసం అధికారులు పంపినట్లు తెలిసింది.
ఆ నిధుల విషయంలోనూ అదే పరిస్థితి...
కాగా నగరపాలికకు రూ.25 కోట్ల నిధులు కేటాయించారు. ఆ నిధులతో పనులు చేపట్టాలంటే కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాని పరిస్థితి. దీంతో కీలక ప్రజాప్రతినిధి పెద్ద కాంట్రాక్టర్లను రంగంలోకి దించినట్లు తెలిసింది. అందులో దాదాపు రూ.21కోట్ల పనులను ఎస్‌ఆర్ కనస్ట్రక్షన్స సంస్థ చేపట్టనున్నట్లు తెలిసింది.
ప్రతిపాదనలు పెట్టాం
గడప గడపకు మన ప్రభుత్వం కింద సచివా లయాల పరిధిలో నగర పాలికలకు రూ.13.06కోట్లు కేటాయించారు. ఇప్పటికి సుమారు రూ.3 కోట్లకు సంబంధించి 70 పనులు పూర్తయ్యాయి. బిల్లులు రావాల్సి ఉంది. ఇప్పటికే పూర్తయిన పనులకు ప్రతిపాదనలు పంపాం. త్వరలోనే వచ్చే అవకాశముంది.
- సతీష్‌చంద్ర, నగరపాలిక ఎస్‌ఈ
Updated Date - 2023-05-02T00:18:40+05:30 IST