ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

దేవతా పుష్పం

ABN, First Publish Date - 2023-08-27T00:26:04+05:30

ఎక్కడి నుంచైనా వచ్చిందో.. ఎవరైనా తెచ్చారో తెలీదు..! అనంత సరోవరంలో అల్లుకుపోయింది. నగర ప్రజల అవసరాల కోసం నిల్వచేసిన తాగునీటిపై ఆకులన్నీ తేలియాడుతుంటాయి. పచ్చగా పరుచుకున్న ఆకులు.. వాటిపై రాలిన ముత్యాలను పోలిన నీటి బిందువులు..!

తేలియాడే ఆకులు.. అందమైన మొగ్గలు

ఆకట్టుకుంటున్న తామర పూలు

తాగునీటి తటాకంలో నెలవు

ఎక్కడి నుంచైనా వచ్చిందో.. ఎవరైనా తెచ్చారో తెలీదు..! అనంత సరోవరంలో అల్లుకుపోయింది. నగర ప్రజల అవసరాల కోసం నిల్వచేసిన తాగునీటిపై ఆకులన్నీ తేలియాడుతుంటాయి. పచ్చగా పరుచుకున్న ఆకులు.. వాటిపై రాలిన ముత్యాలను పోలిన నీటి బిందువులు..! నీటి నుంచి నిటారుగా పొడుచుకువచ్చిన కాడపై.. సిగ్గులొలికే మొగ్గలు..! విప్పారిన పూలు..! పూలంటే.. అలాంటిలాంటి పూలు కాదు..! సాక్షాత్తూ లక్ష్మీదేవి అమ్మవారు ఆశీనులైనట్లు పటంలో చూస్తుంటాం కదా..! ఆ పూలు..! తామరలు..! కాసేపు ఆగి చూడాలనిపించే అందం వాటి సొంతం..! లోతైన నీటిలో ఉన్నాయిగానీ, అందుబాటులో ఉంటే చటుక్కున తెంచేద్దామనే నిర్దాక్షిణ్య ఆలోచన కూడా వస్తుంది..! పూలు అంటేనే సున్నితం. తామర పూలు మరీ సున్నితం..! ఇది మన జాతీయ పుష్పం కూడా..! ఈ దేవతా పుష్పంపై ఈ ఆదివారం ప్రత్యేక కథనం

- అనంతపురం కల్చరల్‌

ఉపాధినిచ్చే పూలు

బుక్కరాయసముద్రం చెరువులో భాగమైన సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకులో పెరుగుతున్న తామరలు పలువురికి ఉపాధి చూపుతున్నాయి. చెరువు కట్టపై ముళ్ల పొదలు పెరిగినా.. లోపల నీటిలో మాత్రం తామర తీగలు అల్లుకున్నాయి. నగరానికి చెందిన కొందరు ఈ నీటిలో దిగి.. తామర మొగ్గలను కోసి.. పూల వ్యాపారులకు అమ్ముతుంటారు. కోసుకొచ్చినవారి నుంచి కొన్నవారు.. ఆలయాల సమీపంలో భక్తులకు అమ్ముతుంటారు. చెరువు నీటిలో తామర మొగ్గలు, పువ్వులను కోయడం సాహసోపేతమైన వ్యవహారం. ఈత వస్తే సరిపోతుంది కదా అనుకుంటే పొరపాటే.

రా.. రమ్మంటాయి..

నీటిపై తేలియాడే తామర ఆకులు, పువ్వులు.. చూసేందుకు అందంగా కనిపిస్తాయి. ‘రా.. రమ్మని’ ఆకర్షిస్తాయి. కానీ దగ్గరకు వెళితే ప్రాణాపాయం పొంచి ఉంటుంది. నీటి లోపల తామర తీగలు ఉచ్చులా అల్లుకుపోయి ఉంటాయి. ఈదుతూ వెళ్లినా.. మనిషిని చుట్ట చుట్టి ముంచేస్తాయి. అడుగులో అడుగేస్తూ వెళ్లినా.. బురదలో కూరుకుపోతే బయటకు రావడం అంత తేలిక కాదు. అయినా సరే, నగరానికి చెందిన కొందరు యువకకులు ఈ సాహసానికి పూనుకుంటున్నారు. ఉపాధి కోసం లోతైన నీటిలోకి వెళ్లి మొగ్గలను కోసుకొస్తున్నారు. రక్షణ కోసం కొందరు నడుముకు తాడు కట్టుకుని నీటిలోకి దిగుతున్నారు. అడుగులో అడుగు వేస్తూ.. లోతు ఎక్కువగా ఉన్నచోట నెమ్మదిగా ఈదుతూ.. పువ్వులు, మొగ్గలను తెంచుకుని గట్టుకు చేరుతున్నారు.

ఆధ్యాత్మిక ప్రాధాన్యం

తామర పూలకు ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. శ్రీమహాలక్ష్మికి ఈ పువ్వులంటే చాలా ఇష్టమని భక్తులు అంటారు. అమ్మవారిని తామర పువ్వులతో పూజిస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయని విశ్వసిస్తారు. మరీ ముఖ్యంగా.. శుక్రవారాల్లో లక్ష్మీదేవికి తామర పువ్లును సమర్పిస్తారు. అనంతపురంలోని అమ్మవారిశాల, ఆర్‌ఎఫ్‌ రోడ్డులోని వేంకటేశ్వర స్వామి ఆలయాల ఎదుట ఈ పువ్వులను విక్రయిస్తుంటారు. భక్తులు వీటిని కొనుగోలు చేసి, స్వామి, అమ్మవారికి సమర్పిస్తుంటారు. శ్రీ మహావిష్ణువు నాభిలో నుంచి తామర పువ్వు ఉద్భవించినట్లు, ఆ కమలం నుంచి బ్రహ్మ పుట్టినట్లు పురాణాలు చెబుతున్నాయి. తెల్ల తామరలో సరస్వతీ అమ్మవారు, ఎర్ర తామరలో లక్ష్మీదేవి కొలువైనట్లు ఉన్న చిత్ర పటాలు హిందువుల పూజా గదుల్లో కనిపిస్తాయి.

ఇప్పుడు చాలా ఖరీదు

శ్రావణ మాసంలో సహజంగానే పూల ధరను పెంచుతుంటారు. అరుదుగా లభించే తామర పూల ధర మిగిలిన పూలతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంటోంది. శ్రావణ శుక్రవారం.. వరలక్ష్మి వ్రతం రోజున ఒక్కో పువ్వును రూ.50 నుంచి రూ.100 వరకూ విక్రయించారు. మిగిలిన రోజుల్లో డిమాండ్‌ను బట్టి రూ.10 నుంచి రూ.20 వరకూ విక్రయిస్తుం టారు. ఆలయాలకు వెళ్లే భక్తులు అక్కడే వీటిని కొనుగోలు చేసి పూజకు తీసుకువెళుతుంటారు. ఎస్‌ఎస్‌ ట్యాంకు నుంచి ముఖ్యమైన రోజుల్లో ఉదయం, సాయంత్రం వీటిని కొందరు కోసుకువస్తుంటారు.

పవిత్ర పుష్పం...

హిందూ ధర్మంలో తామర పూలకు ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యం ఉంది. దేవతలతో సంబంధం కలిగిన పుష్పం ఇది. మతపరమైన వేడుకలు, ప్రార్థనల సమయంలో భగవంతునికి ఈ పుష్పాన్ని సమర్పించడం వల్ల విశేషమైన పుణ్యఫలాలు లభిస్తాయి.

- బాలాజీ శర్మ, పూజారి

స్వచ్ఛత, పవిత్రతకు చిహ్నం...

అనేక ఆధ్యాత్మిక సంప్రదాయాలలో తామర పువ్వుకు ప్రత్యేక స్థానం ఉంది. మానవ మనసు, శరీరం, ఆత్మల స్వచ్ఛతను ఈ పుష్పం సూచిస్తుంది. బురద నీటి నుంచి ఉద్భవించే ఈ పవిత్రమైన పుష్పం.. మనలో ఆధ్యాత్మికత, అంతఃసౌందర్యం అభివృద్ధి చెందడానికి సాయపడుతుంది. నీటిపై అందంగా వికసించే ఈ నిర్మలమైన పుష్పం సహజ శోభ కలిగి ఉంటుంది. అందుకే ఈ పుష్పాన్ని స్వచ్ఛమైన మనసుతో దేవునికి సమర్పిస్తుంటాం.

- గీతాకుమారి, భక్తురాలు

25 సంవత్సరాలుగా విక్రయిస్తున్నా...

అనంతపురం నగరంలో 25 సంవత్సరాల నుంచి పూలవ్యాపారం చేస్తున్నాం. మొదటి నుంచి కమలం పువ్వులను విక్రయిస్తున్నాం. శ్రావణ మాసంలో వీటిని ఎక్కువగా కొనుగోలు చేస్తారు. పూజలు జరిగే మాసం కాబట్టి డిమాండ్‌ ఎక్కువగా ఉంటుంది. ఒక్కో పువ్వును రూ.5 నుంచి రూ.10 వరకు విక్రయిస్తుంటాం.

- లక్ష్మిదేవి, పూల వ్యాపారి

Updated Date - 2023-08-27T00:26:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising