ఉద్యానం..అధ్వానం
ABN, First Publish Date - 2023-03-05T01:01:11+05:30
ఉద్యాన రైతుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో అమలయ్యే పథకాలను కూడా సక్రమంగా రైతులకు చేర్చడం లేదు. కేంద్రం వాటా నిధులను ఇతర పథకాలకు మళ్లించి.. రైతులకు అన్యాయం చేస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. టీడీపీ హయాంలో ఏటా రాయితీలతో పథకాలను రైతులకు అందిస్తూ ఆదుకునేవారు
లక్ష్యం ఇచ్చారు.. నిధులు మరిచారు
సబ్సిడీ సొమ్ము మంజూరు చేయని వైనం
17 కలెక్షన సెంటర్లకు ఏర్పాటైంది రెండే..
ఒక్క సోలార్ కోల్డ్ స్టోరేజీ ఏర్పాటు కాలేదు
ప్రభుత్వ తీరుపై ఉద్యాన రైతుల ఆగ్రహం
ఉద్యాన రైతుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో అమలయ్యే పథకాలను కూడా సక్రమంగా రైతులకు చేర్చడం లేదు. కేంద్రం వాటా నిధులను ఇతర పథకాలకు మళ్లించి.. రైతులకు అన్యాయం చేస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. టీడీపీ హయాంలో ఏటా రాయితీలతో పథకాలను రైతులకు అందిస్తూ ఆదుకునేవారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక రాయితీలను తగ్గించారు. ఈ ఏడాది పలు ఉద్యాన పథకాలకు సబ్సిడీ సొమ్మును విడుదల చేయలేదు. దీంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. పథకాల అమలు కూడా లక్ష్యానికి తగ్గట్టుగా ముందుకు సాగడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. చాలా పథకాలకు రైతులను ఎంపిక చేశారేగాని, పథకం అమలు చేయలేదు.
అనంతపురం అర్బన
లక్ష్యానికి దూరంగా..
2022-23 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం విధించిన లక్ష్యం మేరకు ఉద్యాన పథకాలు ముందుకు సాగడం లేదు. మిషన ఫర్ ఇంటెగ్రేటెడ్ డెవల్‌పమెంట్ ఆఫ్ హార్టికల్చర్ (ఎంఐడీహెచ) పథకం ద్వారా మామిడి, జామ, చీనీ, దానిమ్మ, అరటి, బొప్పాయి తదితర పంటల సాగు, ప్లాస్టిక్ మల్చింగ్ షీట్లు తదితర వాటికి జిల్లాకు రూ.7.48 కోట్లు కేటాయించారు. కానీ ఇప్పటి వరకూ రూ.6.16 కోట్లు మంజూరు చేశారు. ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో మిగిలిన సొమ్ము మంజూరుపై సందిగ్ధత నెలకొంది. ఆర్‌కేవీవై కింద అమలు చేసే పథకాలకు కేంద్ర ప్రభుత్వం 60 శాతం నిధులను సమకూరుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం భరించాల్సి ఉంటుంది. కేంద్రం వాటా నిధులు వస్తున్నా.. రాష్ట్రం తన వాటా ఇవ్వకపోగా.. కేంద్రం నిధులను పక్కదారి పట్టిస్తోందన్న విమర్శలు వస్తున్నాయి.
కలెక్షన సెంటర్లు ఏవీ..?
రాషీ్ట్రయ కిసాన వికాస్ యోజన (ఆర్‌కేవీవై) పథకం కింద ఈ ఏడాది జిల్లాలో 17 కలెక్షన సెంటర్లు (పంట దిగుబడుల సేకరణ కేంద్రాలు) ఏర్పాటు చేయాలని లక్ష్యాన్ని విధించారు. అంతకు మించి కూడా ఏర్పాటు చేసుకునే వెసులుబాటు కల్పించారు. దీంతో జిల్లాలో ఏకంగా 70 కలెక్షన సెంటర్స్ ఏర్పాటుకు రైతులను ఎంపిక చేశారు. కలెక్షన సెంటర్ పూర్తి ధర రూ.15 లక్షలుగా నిర్ణయించారు. ఇందులో 25 శాతం డబ్బులు రైతు చెల్లించాలి. మిగతా 75 శాతం సబ్సిడీ ఇస్తారు. ఇప్పటి వరకూ తాడిపత్రి, శింగనమల ప్రాంతాల్లో రెండు కలెక్షన సెంటర్లను ఏర్పాటు చేశారు. మరో నాలుగు యూనిట్లు వివిధ దశల్లో ఉన్నాయి. వీటన్నింటికీ ఇప్పటి దాకా రూ.10 లక్షలు మంజూరు చేసి సరిపెట్టారు. మిగతా యూనిట్ల ఏర్పాటుపై అయోమయం నెలకొంది. లక్ష్యం మేరకు 17 యూనిట్లనైనా పూర్తి చేస్తారో లేదోనన్న సందిగ్ధం నెలకొంది. ఎంపిక చేసిన రైతులు తమ వాటా డబ్బులు కట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ ప్రభుత్వ నుంచి సబ్సిడీ సొమ్ము విడుదల కావడం లేదు.
కోల్డ్ స్టోరేజీలు ఏవీ..?
జిల్లాలో మూడు సోలార్ కోల్డ్ స్టోరేజీ రూమ్స్ ఏర్పాటుకు రైతులను ఎంపిక చేశారు. కానీ ఇప్పటి దాకా నిధులు విడుదల చేయలేదు. మరోవైపు ఆర్‌కేవీవై పథకం కింద కొత్త పంటల విస్తీర్ణం పెంపు, ఆ పంటల రెండో సంవత్సరం నిర్వహణకు లక్ష్యం విధించారు. కానీ వాటికి కూడా నిధులు విడుదల చేయలేదు. దీంతో కొత్త పంటలు సాగుచేసిన రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మార్చితో ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. అప్పటిలోగా లక్ష్యాన్ని పూర్తి చేయాలి. సమయం తక్కువగా ఉండటంతో లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు ఉద్యాన శాఖ అధికారులు కుస్తీ పడుతున్నారు.
సబ్సిడీ పెంచాలి..
ఉద్యాన రైతులకు సబ్సిడీలు పెంచి ఆదుకోవాలి. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటినుంచి ఉద్యాన రైతులకు ఆశించిన స్థాయిలో పథకాలు వర్తింపజేయడం లేదు. అరకొరగా అందించే సబ్సిడీలు కూడా ఆలస్యం చేయడం సరికాదు. ఏటా ఉద్యాన శాఖకు బడ్జెట్‌ను పెంచి కరువు జిల్లా ఉద్యాన రైతులకు చేయూతనివ్వాలి.
- మల్లికార్జున, రైతు సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్
భారీగా తగ్గించారు
గత ప్రభుత్వంతో పోలిస్తే వైసీపీ పాలనలో ఉద్యాన రైతులకు భారీగా సబ్సిడీలు తగ్గించారు. గత ప్రభుత్వంలో చిన్న, సన్నకారు ఉద్యాన రైతులకు ఆశించిన స్థాయిలో సబ్సిడీలు వర్తింపజేసి చేయూతనిచ్చారు. ఈ ప్రభుత్వంలో పలు రకాల ఉద్యాన సబ్సిడీలు రద్దు చేశారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
- శివారెడ్డి, పండ్ల తోటల రైతు సంఘం జిల్లా కార్యదర్శి
లక్ష్యం పూర్తికి ప్రత్యేక చర్యలు
ఉద్యాన శాఖకు ఈ ఏడాది ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం పూర్తి చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే ఆశించిన మేరకు చేశాం. మిగతా పనులను గడువులోగా పూర్తి చేస్తాం. ఈ మేరకు ఉద్యాన శాఖ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాం.
- రఘునాథ్‌రెడ్డి, జిల్లా ఉద్యాన అధికారి
Updated Date - 2023-03-05T01:01:11+05:30 IST