కనుపాపలు కనుమరుగు..!
ABN, First Publish Date - 2023-09-23T00:19:48+05:30
పట్టణంలోని శ్రీవిద్య ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో నాప బండ మీదపడి యూకేజీ విద్యార్థిని కీర్తన(5) ప్రాణాలు కోల్పోయింది.
ఫ బడిలో విరిగి పడిన బండ
ఫ ప్రాణం కోల్పోయిన చిన్నారి కీర్తన
ఫ నీటి సంపులో పడి.. తిరిగిరాని లోకాలకు అశ్విని
ఫ గుంతకల్లులో ఒకే రోజు ఇద్దరు పసిపాపల మృతి
బంగారు తల్లి కీర్తన..! తనకు ఐదేళ్లు నిండాయి. పుట్టిన రోజు కావడంతో శుక్రవారం ఉదయాన్నే అమ్మ నిద్ర లేపింది. స్నానం చేయించి, అందంగా ముస్తాబు చేసింది. కొత్త బట్టలు వేసింది. చేతికి కొత్త గాజులు తొడిగింది. గారాలపట్టిని చూసి నాన్న ఎంతగానో మురిసిపోయాడు. టిఫిన తినిపించి.. బడి వద్ద వదిలిపెట్టారు. స్నేహితులకు, టీచర్లకు చాక్లెట్లు పంచింది కీర్తన. అందరూ హ్యాపీ బర్త్‌డే చెప్పారు. ఎంత సంబరమో..! మరో గంట గడిస్తే బడి ముగుస్తుంది. ఇంటికి వెళ్లి.. బడిలో సంగతులన్నీ చెప్పేందుకు కీర్తన సిద్ధమౌతోంది. అలసిపోయి.. బడి సంచిమీద తల పెట్టుకుని కళ్లు మూసుకుంది. అంతే..! ఓ నాపరాతి బండ పెళ్లున విరిగి తన తలపై పడింది..! ఐదేళ్ల కీర్తనకు నూరేళ్లు నిండాయి. ఇది ఘోర ప్రమాదం అనుకోవచ్చు. కానీ.. అంతకు మించిన నిర్లక్ష్యం..! భద్రత కరువైన బడి.. పసిపాపను బలితీసుకుంది.
గుంతకల్లు టౌన, సెప్టెంబరు 22: పట్టణంలోని శ్రీవిద్య ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో నాప బండ మీదపడి యూకేజీ విద్యార్థిని కీర్తన(5) ప్రాణాలు కోల్పోయింది. అంకాలమ్మ ఆలయం ఎదురుగా నివసిస్తున్న రంగయ్య, శిరీష దంపతుల కూతురు కీర్తన. పుట్టిన రోజు కావడంతో శుక్రవారం కొత్త బట్టలు వేసుకుని స్కూల్‌కి వెళ్లింది. స్నేహితులకు, టీచర్లకు చాక్లెట్లు పంచింది. మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో ఇంటర్‌వెల్ వదిలారు. ఆ సమయంలో తరగతి గదిలో కీర్తన తన బ్యాగ్ మీద తలపెట్టి పడుకుంది. క్లాస్ టీచర్‌తో పాటు పలువురు విద్యార్థులు అక్కడే ఉన్నారు. ఒక్కసారిగా తరగతి గది బండ విరిగి కీర్తన తలమీద పడింది. ఆ శబ్దానికి పాఠశాల సిబ్బంది పరుగున వచ్చారు. రక్తపు మడుగులో ఉన్న కీర్తనను చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు, చిన్నారి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.
అయ్యో.. పాపం..
బడి నుంచి మరో గంటలో ఇంటికి చేరాల్సిన కీర్తన మృతిచెందడం పట్టణవాసులను కలిచివేసింది. పాత గుంతకల్లులోని అంకాలమ్మ ఆలయం ఎదురుగా నివసిస్తున్న రంగయ్య ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. ఆయన భార్య శిరీష 7వ సచివాలయంలో వలంటీరు. వీరికి ముగ్గురు పిల్లలు. పెద్ద కూతురు కీర్తన. శ్రీవిద్య ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో యూకేజీ చదువుతోంది. ఈ పాఠశాల 23 ఏళ్ల నుంచి నడుస్తోంది. ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు గదులను నాపరాతి బండలతో ఏర్పాటు చేశారు. ఆ బండలే పసిపాప ప్రాణం తీశాయి. అదృష్టవశాత్తు మిగిలిన చిన్నారులకు ఏమీ కాలేదు. కీర్తన ఉదయం నుంచి బడిలో సంతోషంగా గడిపింది. మధ్యాహ్నం ఇంటికి వెళ్లి.. అమ్మ చేతి గోరుముద్దలు తిని తిరిగి బడికి వెళ్లింది. మూడున్నర గంటల సమయంలో ఇంటర్‌వల్ వదిలారు. కీర్తనతోపాటు కొందరు చిన్నారులు, టీచర్ గదిలోనే ఉండిపోయారు. కీర్తన బ్యాగ్ మీద తలపెట్టి పడుకున్న సమయంలో బండ విరిగి మీద పడింది. దీంతో పాప తలకు బలమైన గాయాలయ్యాయి. విపరీతంగా రక్తస్రావమైంది. చిన్నారని పాఠశాల సిబ్బంది వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే పాప ప్రాణాలు కోల్పోయింది. కొందరు విద్యార్థులు పరుగున వెళ్లి కీర్తన ఇంట్లో ఈ విషయం చెప్పారు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆసుపత్రికి వెళ్లారు. మృతి చెందిన కీర్తనను చూసి గుండెలవిసేలా రోదించారు. ముద్దుల కూతురును ఆ స్థితిలో చూసి తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. టూటౌన సీఐ గణేష్ తరగతి గదిని పరిశీలించారు. పాఠశాల సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
సంపులో పడి.. అశ్విని
గుంతకల్లు మస్తానపేటలో చిన్నారి అశ్విని(3) ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి మృతి చెందింది. కాలనీకి చెందిన పెద్దయ్య, భారతి దంపతుల కూతురు ఈ పసిపాప. పెద్దయ్య బెల్దారి కాగా, ఆయన భార్య దిన కూలీ. మస్తానపేట రెడ్ ట్యాంక్ వద్ద అద్దె ఇంట్లో వీరు ఉంటున్నారు. అదే ప్రాంతంలోని మరో ఇంట్లోకి శుక్రవారం మారారు. పాత ఇంటి నుంచి సామగ్రిని తరలించేందుకు కూతురును వెంటబెట్టుకుని సాయంత్రం వెళ్లారు. ఆ పనిలో వారు నిమగ్నమై ఉండగా.. అశ్విని సంపు మీద ఉన్న అట్టపై కాలు మోపి.. జారి నీటిలో పడిపోయింది. కాసేపటి తరువాత పాపకోసం తల్లిదండ్రులు ఇంట్లో, చుట్టుపక్కల గాలించారు. ఎంతకీ కనిపించకపోవడంతో ఆరగంట తరువాత అనుమానం వచ్చి సంపులో చూశారు. నీట మునిగిన పసిపాపను బయటకు తీసి చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. వనటౌన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - 2023-09-23T00:19:48+05:30 IST