Settlements : మళ్లీ.. వసూల్ రాజా!
ABN, First Publish Date - 2023-05-03T02:57:36+05:30
సెటిల్‌మెంట్లు, వసూళ్ల దందాలతో గత ఏడాది ఆగస్టులో ఆంధ్రప్రదేశ్‌ను కుదిపేసిన వసూల్ రాజా మళ్లీ తెరపైకి వచ్చారు. ముఖ్యనేత అభయహస్తం ఇచ్చారో, లేక సమయం మించిపోతుందనో మళ్లీ దందాలు మొదలుపెట్టారు.
ఈసారి పకడ్బందీగా 2.0 సిరీస్‌కు సిద్ధం
సీన్‌లో తాను లేకుండా సొంత బావతో దందా
ఏసీబీ కేసుల్లో దొరికిన ఆదాయాన్ని బట్టి రేటు
కేసుకు కనీసం 20-50 లక్షల చొప్పున వసూలు
డైరెక్టర్ పోస్టులకు రూ.50 లక్షలు ఫిక్స్
కోరుకున్నచోటకు బదిలీ.. లేదంటే డిప్యుటేషన్
ఫోకల్ పాయింట్‌ను బట్టి 5 నుంచి 15 లక్షలు
వర్కవుట్ కాని కేసుల్లో బాధితులు లబోదిబో
నోటిఫికేషన్ లేకున్నా ప్రభుత్వ రంగ సంస్థల్లో డైరెక్టర్‌గా వెళ్లాలనుకునేవారు ముందుగా పూర్తి చెల్లింపులు చేయాలని షరతు పెడుతున్నారు. ఆ తర్వాత తమ పలుకుబడి ఉపయోగించి పోస్టు భర్తీకి నోటిఫికేషన్ ఇప్పిస్తున్నారని సమాచారం. ఇలా ఇటీవలి కాలంలో చాలానే సెటిల్ చేశారని తెలిసింది.
ఒక్కో కేసుకు ఏసీబీకి దొరికిన ఆదాయాన్నిబట్టి రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షలమేర వసూలుచేస్తున్నట్టు తెలిసింది. ఈ కేసుల్లో అభియోగాలు నమోదుచేయకుండా, కేసులను మరింత సంక్లిష్టం చేయకుండా సంబంధిత అధికారులకు ఫోన్లు చేయడం, ఇంకా అవసరమైతే ఒత్తిడి తీసుకురావడం చేస్తున్నారు.
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
సెటిల్‌మెంట్లు, వసూళ్ల దందాలతో గత ఏడాది ఆగస్టులో ఆంధ్రప్రదేశ్‌ను కుదిపేసిన వసూల్ రాజా మళ్లీ తెరపైకి వచ్చారు. ముఖ్యనేత అభయహస్తం ఇచ్చారో, లేక సమయం మించిపోతుందనో మళ్లీ దందాలు మొదలుపెట్టారు. ఈసారి తనకు బాగా నమ్మినబంటు, సొంత బావనే సీన్‌లోకి తీసుకొచ్చారు. ఆయన కూడా తాను పనిచేసే కార్పొరేషన్‌లో తిమింగలమే. వసూళ్లు, సెటిల్‌మెంట్లలో ఆయనా ఆరితేరారు. దీంతో ఈసారి మరింత పకడ్బందీగా వసూల్‌రాజా తనదైన శైలిలో కొత్తరకం వసూళ్లపర్వాన్ని ప్రారంభించారని తెలిసింది. అవినీతి నిరోధక శాఖ కేసులు, కీలకమైన విద్యుత్ రంగ సంస్థల పరిధిలోకి వచ్చే డైరెక్టర్ పోస్టులు, ఫోకల్ పోస్టుల్లో డిప్యూటేషన్లు, బదిలీల్లో కీలక పోస్టులు ఇస్తామంటూ పెద్ద కౌంటర్ తెరిచారు. ఇప్పటివరకు రూ.16 కోట్లపైనే వసూళ్లకు దిగినట్లు తెలిసింది. ఇందులో సింహభాగం ఏసీబీ కేసుల వాటానే ఉన్నట్లు సమాచారం. వసూలయిన సొమ్ముతో విశాఖలోని గాజువాక, హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఏరియాలో విల్లాలు కొనుగోలు చేసినట్లు తెలిసింది. విశాఖ విల్లాలో గృహప్రవేశం జరిగింది. అక్కడినుంచే ఉత్తరాంధ్ర వ్యవహారాలను చక్కబెతున్నారు. మరో ఏడాదిలో వ సూల్‌రాజా రిటైర్ కాబోతున్నారు. అధికార పార్టీ తరపునే ఉమ్మడి కడప జిల్లాలో ఎన్నికల బరిలోకి దిగబోతున్నారు. దీంతో భారీ వసూళ్లలో దూసుకెళ్లేందుకు సొంత బావతో కలిసి ప్రణాళిక వేశారు.
సీన్‌లోకి బావ...
గతంకంటే ఘనంగా, కొత్త కోణంలో వసూల్ రాజా 2.0 సీరి్‌సను ప్రారంభించినట్లు కనిపిస్తోంది. సెటిల్‌మెంట్లు చేసే విధానం మార్చారు. నేరుగా తను సీన్‌లో ఉండకుండా జాగ్రత్త పడుతున్నారు. సొంత బావే తెరపై కనిపించేలా, ఆయన వద్దకే క్లయింట్లు వెళ్లేలా, ఆయన చేతికే సొమ్ము ముట్టచెప్పేలా కొత్త పంథాను ఎంచుకున్నారు. ఆయన చేసేదల్లా..కంటికి కనిపించని వర్క్‌వుట్. వసూల్ రాజా బావ ఇంధన శాఖ పరిధిలోని ఓ ప్రభుత్వ రంగ సంస్థలో కాంట్రాక్టు పద్ధతిలో కీలక పోస్టులో పనిచేస్తున్నారు. ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్, మున్సిపల్, ఇరిగేషన్, రూరల్ వాటర్ వంటి ఇంజనీరింగ్ విభాగాలతోపాటు రెవెన్యూ, పురపాలక, స్టాంప్స్, రిజిస్ట్రేషన్, విద్యుత్ (ఇంధన శాఖ), వాణిజ్యపన్నులు త దితర శాఖల పరిధిలో భారీగా ఏసీబీ కేసులున్నాయి. ఇందులో ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినవి, డైరెక్ట్‌గా లంచాలు తీసుకుంటూ దొరికిపోయిన కేసులు ఉన్నాయి. వీటిలో ఆదాయానికి మించి ఆస్తుల కేసుల సెటిల్‌మెంట్‌ను వసూల్ రాజా ప్రారంభించారు. ఒక్కో కేసుకు ఏసీబీకి దొరికిన ఆదాయాన్ని బట్టి రూ.20 నుంచి రూ.50 లక్షల రూపాయల మేర వసూలు చేస్తున్నట్టు తెలిసింది. ఇటీవలి కాలంలో వసూల్ రాజా బావను 28 మంది కలిసి అడ్వాన్స్‌లు ఇచ్చినట్లు తెలిసింది. కొందరు పూర్తిస్తాయి చెల్లింపులు జరిపినట్లు సమాచారం.
డైరెక్టర్ పోస్టులు..
రిటైర్డ్ ఇంజనీర్లు, నిపుణులు ప్రభుత్వ రంగ సంస్థల్లో రెండేళ్లు లేదా మూడేళ్లపాటు డైరెక్టర్‌లుగా పనిచేయాలనుకుంటారు. నిపుణులు, అనుభవజ్ఞులను ప్రభుత్వమే గుర్తించి నియమించడం ఒక పద్ధతి. ఇందుకు నోటిఫికేషన్‌లు కూడా పెద్దగా అవసరం లేదు. కానీ కొన్ని సందర్భాల్లో నోటిఫికేషన్ ఇచ్చి నచ్చినవారిని ఎంపిక చేస్తున్న ఉదంతాలున్నాయి. ఇంధన శాఖ పరిధిలోని వివిధ సంస్థల్లో డైరెక్టర్ పోస్టులకు నోటిపికేషన్ ఇచ్చి భర్తీచేస్తున్నారు. డైరెక్టర్ పోస్టులపై ఆసక్తి ఉన్న వారు వివిధ మార్గాల్లో వసూల్ రాజాతో మాట్లాడి, ఆ తర్వాత ఆయన బావను కలుస్తున్నారు. డిమాండ్‌ను బట్టి పోస్టుకు ధరను నిర్ణయించినట్లు తెలిసింది. సగటున రూ.50 లక్షల నుంచి కోటి దాకా వసూలు చేస్తోన్నట్లు సమాచారం. ముందు అడ్వాన్స్‌గా రూ.30 లక్షలు చెల్లించాలని, ఆ తర్వాత మిగతాది పూర్తిచేయాలని ముందే షరతులు పెడుతున్నట్లు తెలిసింది. బయటకు చూడటానికి పారదర్శకంగా కనిపించేలా ఉండే ఈ వ్యవహారంలో, వసూల్‌రాజా తనదైన చీకటికోణాన్ని ప్రదర్శిస్తున్నారని తెలిసింది.
ఫోకల్ పోస్టులు..: రెవెన్యూ, స్టాంప్స్, అండ్ రిజిస్ట్రేషన్, విద్యుత్ రంగ సంస్థలు, ఆర్‌అండ్‌బీ పరిధిలోని బదిలీల్లో ఆయనకు చేయితిరిగింది. ఫోకల్ పోస్టుల్లో బదిలీ కోరుకునే వారికి ఒకలా, డిప్యూటేషన్ కోరుకునేవారికి మరోలా పనయ్యేలా చూస్తున్నారు. బదిలీలపై నిషేధం ఉన్న సమయంలో ఎక్కువగా డిప్యూటేషన్‌లకే మొగ్గుచూపుతున్నారు.
సొమ్ములు వెనక్కి ఇవ్వండి!
ఎంత ఉన్నతస్థాయి దందా అయినా ఒక్కోసారి పనులుకావు. వీరి విషయంలోనూ అలాగే జరిగింది. ఏసీబీ కేసుల నుంచి బయటపడేస్తారన్న నమ్మకం సన్నగిల్లిన వారు, డైరెక్టర్ పోస్టులు రాని వారు సొమ్ము వెనక్కు ఇవ్వాలంటూ వసూల్ రాజా బావపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. దీంతో వారి మధ్య ప్రత్యక్ష సంబంధాలు చెడాయి. సొమ్ము వెనక్కు తీసుకునేందుకు కొందరు బాధితులు నేరుగా వసూల్ రాజా పనిచేసే ఆఫీసుకు వెళ్తున్నారు. ఒకటి రెండు సార్లు వాద, ప్రతివాదనలు జరిగినట్లు తెలిసింది. దీంతో ఆయన ఆఫీసుకున్నా బయటే ఎక్కువగా ఉంటున్నారని సమాచారం. ఈ విషయం కనిపెట్టిన బాధితులు గత కొద్దిరోజులుగా ఆయన ఇంటి వద్దకు వెళ్తున్నట్లు తెలిసింది.
ఆయనపై వేటు ఉత్తిదే...
వసూల్ రాజా ఎవరో గుర్తుంది కదా? ముఖ్యనేత దగ్గర పనిచేస్తోన్న ఓ సీనియర్ అధికారి. ముఖ్యనేతకు సన్నిహితుడయిన ఆ అధికారి స్వామికార్యంతోపాటు స్వకార్యాలు ఎన్నో చేశారు. పదవిని, ముఖ్యనేతతో ఉన్న ప్రాపకాన్ని అడ్డుపెట్టుకొని రాష్ట్రంలో ఆయన చేయని సెటిల్‌మెంట్ లేదు. పరిష్కరించని ఆర్ధిక పంచాయతీ లేదు. తనకంటే సీనియర్ అయినా, జూనియర్ అధికారి అయినా జీ హుజూర్ అనేంతగా ఎదిగారు. పేరుకే ముఖ్యనేత. పెత్తనమంతా ఈయనదే అన్నట్లుగా వ్యవహరించారు. ఈ విషయంలో ‘ఆంధ్రజ్యోతి’కి పలు ఆధారాలతో సహా కీలక సమాచారం దొరకడంతో వసూల్ రాజా దందాలను గత ఏడాది ఆగస్టు 2 నుంచి ఐదో తేదీ వరకు వరసగా వార్తా కథనాలను ప్రచురించింది. అమరావతి నుంచి విశాఖ, హైదరాబాద్, బెంగళూరు, కడప, అన్నమయ్య, గుంటూరు, కృష్ణా జిల్లాల పరిధిలో వసూల్‌రాజా భారీగా ఆస్తుల కొనుగోళ్లు చేపట్టిన అంశాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ వార్తల నేపథ్యంలో సర్కారు ఆయన్ను పక్కనపెట్టిందన్న ప్రచారం జరిగింది. కానీ, తాజా పరిణామాలను పరిశీలన చేస్తే అది ఉత్తుదే అని తేలిపోతోంది.
Updated Date - 2023-05-03T02:57:36+05:30 IST