APERC: ఇక నెలనెలా సర్దు‘పోటే’!
ABN, First Publish Date - 2023-04-03T01:31:09+05:30
రాష్ట్ర ప్రజలపై మరో పెద్ద పిడుగు! ఇక వారు నెలనెలా సర్దుబాటు చార్జీలు చెల్లించాల్సిందే!! డిస్కమ్‌లు విద్యుత్‌ను ఎంతకు కొనుగోలు చేస్తున్నాయో.. ఆ మొత్తాన్నీ వినియోగదారుల నుంచే వసూలు చేసుకోవాలని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) ఆదేశించింది.
జనం నెత్తిన ఈఆర్‌సీ పిడుగు
కరెంటు ఎంతకు కొన్నారో అంతా జనం నుంచే వసూలు
డిస్కమ్‌లకు కమిషన్ పూర్తి స్వేచ్ఛ
గెజిట్ విడుదల చేసిన ప్రభుత్వం
నిపుణులతో సంప్రదింపుల్లేవు
నేరుగా ప్రజాభిప్రాయ సేకరణా లేదు
విద్యుత్ సంస్థలకే కమిషన్ సానుకూలం
జనానికి నష్టం చేకూర్చేలా చర్యలు
(అమరావతి-ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రజలపై మరో పెద్ద పిడుగు! ఇక వారు నెలనెలా సర్దుబాటు చార్జీలు చెల్లించాల్సిందే!! డిస్కమ్‌లు విద్యుత్‌ను ఎంతకు కొనుగోలు చేస్తున్నాయో.. ఆ మొత్తాన్నీ వినియోగదారుల నుంచే వసూలు చేసుకోవాలని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) ఆదేశించింది. ఆ విషయంలో వాటికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చేసింది. కొనుగోలు ధరల నియంత్రణపై పూర్తిగా చేతులెత్తేసింది. డిస్కమ్‌లు విద్యుత్ కొనుగోళ్ల వాస్తవ సమాచారాన్ని ప్రతి ఏటా జూన్ 30 నాటికి తనకు నివేదించాలని.. ఈ సమాచారం అందిన 90 రోజుల్లోగా.. ట్రూఅప్ లేదా ట్రూడౌన్ చార్జీలపై ఆదేశాలిస్తామని పేర్కొంది. గత నెల 29వ తేదీన కమిషన్ ఇచ్చిన ఈ ఆదేశాలపై రాష్ట్రప్రభుత్వం తాజాగా గెజిట్ విడుదల చేసింది. వినియోగదారుల విద్యుత్ అవసరాలకు కొనుగోలు చేస్తున్నందున ఆ వ్యయాన్ని నెలవారీ బిల్లు నుంచి వసూలు చేసుకోవాలని అందులో స్పష్టం చేసింది. ప్రస్తుతం ఉన్న టారి్‌ఫకూ.. కరెంటు కొనుగోలు ధరకూ మధ్య వ్యత్యాసాన్ని ప్రతినెలా డిస్కమ్‌లు వినియోగదారులకు తెలియజేయాలని ఈఆర్‌సీ పేర్కొంది. ఇందుకోసం విస్తృత ప్రచారం చేయాలని సూచించింది. కొనుగోళ్ల అదనపు భారాన్ని ఒకేసారి వినియోగదారుల నుంచి వసూలు చేయలేనప్పుడు.. యూనిట్‌కు 40 పైసల చొప్పున లెక్కించి నెలవారీ బిల్లుల నుంచి వసూలు చేయాలని తెలిపింది.
ఏటా విద్యుత్ కొనుగోళ్ల కోసం ఎంత వ్యయమవుతుందో డిస్కమ్‌లు ఇదివరకు అంచనా వేసేవి. వాటికనుగుణంగా టారి్‌ఫను నిర్దేశించుకునేవి. కానీ ఇప్పుడు నిర్దేశిత ధరను దాటి బహిరంగ మార్కెట్‌లో కరెంటు కొనుగోలు చేస్తున్నాయి. ఏడాది మొత్తానికి ఒకేసారి విద్యుత్ ధరలు పెరిగినట్లుగా చూపిస్తే.. ప్రజల్లో ప్రభుత్వం పై తీవ్ర వ్యతిరేకత పెల్లుబుకుతుంది. దానిని నివారించేందుకు ప్రతి మూడు నెలలకోసారి సర్దుబాటు పేరిట ట్రూఅప్ చార్జీలను డిస్కమ్‌లు వసూలు చేసేవి. ఇప్పుడు గతంలో కొనుగోలు ధరకూ, ఇప్పుడు కొంటు న్న ధరకూ ఏమాత్రం పొంతన లేకుండా పోతోంది. అధిక ధరకు కొనుగోలు చేస్తున్నాయి. దీంతో నెలనెలా జనాన్ని సర్దుబాబు చార్జీలతో బాదాలని డిస్కమ్‌లను ఈఆర్‌సీ ఆదేశించింది. ఏపీఈఆర్‌సీ ధోరణితో విద్యుత్ వినియోగదారులకు స్వేచ్ఛ లేకుండా పోతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతంలో ప్రజాభిప్రాయాన్ని కమిషన్ క్షేత్రస్థాయిలో సేకరించేది. ఇప్పుడు ఆన్‌లైన్ విధానంలో జరుపుతోంది. డిస్కమ్‌లకు పూర్తి సానుకూలంగా వ్యవహరిస్తూ.. వినియోగదారులకు నష్టం వాటిల్లే చర్యలకు దిగుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రోజంతా నిరాటంకంగా కరెం టు ఇస్తున్నామని ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసం ప్రచారం చేసుకుంటోంది. దీనికి అనుగుణంగా డిస్కమ్‌లు కూడా బహిరంగ మార్కెట్లో భారీ ధరలకు విద్యుత్ కొంటున్నాయి. ఈ అధిక ధరల భారాన్ని కోటీ 80 లక్షల మంది వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్నాయి.
Updated Date - 2023-04-03T01:31:09+05:30 IST