అదానీ ఆర్థిక నేరాలకు మోదీ, జగన్ ఊతం
ABN, First Publish Date - 2023-02-21T03:32:55+05:30
దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిన అదానీ ఇంతగా ఆర్థిక నేరాలకు పాల్పడటానికి నరేంద్ర మోదీ, వైఎస్ జగన్ ఇచ్చిన ఊతమే కారణమని పలువురు వక్తలు పేర్కొన్నారు.
దేశంలో ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం అమలు
కుంభకోణంపై పోరాటంలో టీడీపీ, జనసేన కలిసి రావాలి
విజయవాడ సదస్సులో వక్తలు
విజయవాడ, ఫిబ్రవరి 20 : దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిన అదానీ ఇంతగా ఆర్థిక నేరాలకు పాల్పడటానికి నరేంద్ర మోదీ, వైఎస్ జగన్ ఇచ్చిన ఊతమే కారణమని పలువురు వక్తలు పేర్కొన్నారు. అదానీకి సాయం అందించడంలో మోదీ, జగన్ తోడుదొంగలుగా వ్యవహరించారని ఆరోపించారు. సోమవారం విజయవాడ ఎంజీ రోడ్డులోని బాలోత్సవ్ భవన్‌లో అదానీ కుంభకోణం-ప్రజల సంపదకు ముప్పు అనే అంశంపై జరిగిన సదస్సుకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ప్రధాన వక్త ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ రాజకీయ పదవుల్లో ఉన్నవారు ప్రజల సంపదను కాపాడాల్సింది పోయి ఆశ్రిత పెట్టుబడిదారీ విధానాన్ని అవలంబిస్తున్నారని అన్నారు. ఈ విధానంతో దేశ సంపదను కార్పొరేట్లకు కట్టబెడుతున్నారని, దీనికి ప్రతిఫలంగా ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలు పొందుతున్నారని అన్నారు. కీలక రంగాల్లో అదానీ కంపెనీలు విస్తరించడానికి ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కారణమన్నారు. మన రాష్ట్రానికి సంబంధించి గంగవరం పోర్టు, కృష్ణపట్నం పోర్టు, రాయలసీమలో వేల ఎకరాల భూములు కేటాయించడం వంటి ప్రయోజనాలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కల్పించారని అన్నారు.
అదానీ కుంభకోణాలు వెలుగు చూస్తున్న వేళ నరేంద్రమోడీ, జగన్ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ నరేంద్ర మోదీ 8 ఏళ్లుగా భారత్ ఆర్థిక వ్యవస్థను అదానీకి దోచిపెడుతున్నారని అన్నారు. పోర్టులు, విమానాశ్రయాలు, బొగ్గు, విద్యుత్ వంటి మౌలిక రంగాల్లో అదానీ వ్యాపార అక్రమాలు చోటుచేసుకున్నాయని అన్నారు. రాయలసీమలో 75 వేల ఎకరాలు అదానీకి కట్టబెట్టడం ద్వారా వైఎస్ జగన్ అదానీ భజన చేస్తున్నారని అన్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు 2.5 లక్షల ఎకరాలు పరిశ్రమల కోసమని కార్పొరేట్లకు కట్టబెట్టారని ఒక్క పరిశ్రమ కూడా వచ్చిన దాఖలాలు లేవన్నారు. అదానీకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు ఉన్న లింకులపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అదానీ ఆర్థిక కుంభకోణాలపై టిడీపీ, జనసేన మాట్లాడాలని అన్నారు. సదస్సులో మాజీ ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ పాల్గొన్నారు.
Updated Date - 2023-02-21T03:32:56+05:30 IST