ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

wife husband: పక్క చూపులు.. దారుణ హత్యలు

ABN, First Publish Date - 2022-11-15T02:56:16+05:30

‘ధర్మార్థ కామములోన ఏనాడు ఈమె తోడును నేను విడవను’’ అనేది పెళ్లి పీటల మీద వరుడు ‘నాతి చరామి’ అంటూ చేసే ప్రమాణం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భర్తలను హతమార్చుతున్న భార్యలు

వివాహేతర సంబంధాలతో తెలంగాణలో సగటున ప్రతి మూడు రోజులకో హత్య

ఎన్‌సీఆర్‌బీ నివేదికలో వెల్లడి

కన్నవారు దూరమై దయనీయ స్థితికి పిల్లలు

భార్యాభర్తల మధ్య ప్రేమ రాహిత్యమే కారణం

ఇద్దరూ కలిసి నాణ్యమైన సమయం గడపడమే ఈ సమస్యకు పరిష్కారమంటున్న సైకాలజిస్టులు

ఆంధ్రజ్యోతి, హైదరాబాద్‌: ‘‘ధర్మార్థ కామములోన ఏనాడు ఈమె తోడును నేను విడవను’’ అనేది పెళ్లి పీటల మీద వరుడు ‘నాతి చరామి’ అంటూ చేసే ప్రమాణం. ‘నాతి చరామి’ అంటే.. న+అతిచరామి.. అతిక్రమించను అని ఆ పదానికి అర్థం! వధువుతో ఇలాంటి ప్రమాణాలేవీ చేయించరు!! అయినా.. ధర్మార్థకామాల్లో భర్తతో కలిసి నడిచేవారు మహిళలు! పెళ్లిపీటల మీద ప్రమాణం చేసిన పురుషులే దాన్ని అతిక్రమించి ‘తిరిగే’ ఘటనలు ఎక్కువగా ఉండేవి. కానీ.. ఇటీవలికాలంలో ‘నాతి’.. అంటే ‘స్త్రీ’యే భర్తతో చేసుకున్న బాసలను అతిక్రమించి చరిస్తున్న ఘటనల సంఖ్య పెరుగుతోంది. దాంపత్య బంధంలో ‘ఆమే’ చిచ్చు రేపుతోంది!! భర్త తీరు నచ్చకుంటే.. అతడంటే ఇష్టం లేకుంటే.. విడాకులిచ్చి నచ్చినవాడిని కట్టుకునే హక్కు తనకుందని మరచి జీవితాన్ని కష్టాలపాలు, కటకటాలపాలు చేసుకుంటోంది. తండ్రి చనిపోయి.. తల్లి జైలుపాలైతే.. వారి బిడ్డల దయనీయస్థితి మరో సమస్య!! భర్తను చంపి అతడి స్థానంలో తన ప్రియుణ్ని తెచ్చుకోవాలని చూసిన నాగర్‌కర్నూల్‌ స్వాతి గుర్తుందా? 2017లో.. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఘటన అది!! అది మొదలు.. ‘ప్రియుడి కోసం భర్తను కడతేర్చిన భార్య’ తరహా ఘటనలు తరచుగా పత్రికల్లో పతాకశీర్షికలుగా మారుతున్నాయి.

ప్రియుడితో జీవితాన్ని గడపడం కోసం జీవిత భాగస్వామిని హత్యచేసి.. ఆ నేరం బయటపడడంతో ఎంతోమంది జైల్లో ఊచలు లెక్కిస్తున్నారు. వారి తీరుతో కుటుంబం పరువు రోడ్డున పడిందన్న కోపం, ఆవేదనతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న కుటుంబసభ్యుల పలకరింపు లేక జైలు గోడల మధ్య దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారు. పిల్లలకు తల్లిదండ్రుల ప్రేమను దూరం చేయడమే కాదు.. వారి బంగారు భవిష్యత్తును నిలువునా పాతరేస్తున్నారు. తల్లిదండ్రుల్లో ఒకరు చనిపోయి మరొకరు జైలుకెళ్తుండటంతో పిల్లలు అనాథలుగా మారుతున్నారు. ఈ ఘటనలతో రెండు వైపుల కుటుంబాలూ చిత్రవధ అనుభవిస్తున్నాయి. నేషనల్‌ క్రైం రికార్డు బ్యూరో(ఎన్‌సీఆర్‌బీ) విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం తెలంగాణలో గత సంవత్సరం రాష్ట్రంలో 1026 హత్యలు జరిగాయి. అందులో వివాహేతర సంబంధాల కారణంగా జరిగిన హత్యలు 115. భార్యలు భర్తలను చంపిన కేసులు.. భర్తలు భార్యలను/వారి ప్రియులను చంపిన కేసులు ఇవి. అంటే.. సగటున ప్రతి 3 రోజులకు ఒకరు ఈ కారణంగా హత్యకు గురవుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఈ విషయంలో 2021లో ఏకంగా 232 కేసులతో మహారాష్ట్ర అగ్రస్థానంలో నిలవగా.. ఆంధ్రప్రదేశ్‌లో 2021లో వివాహేతర సంబంధాల కారణంగా జరిగిన హత్యల సంఖ్య 186.

ఎన్నెన్నో దారుణాలు...

వివాహేతర సంబంధాల కారణంగా జరిగే హత్యల సంఖ్య రాష్ట్రంలో క్రమేపీ పెరుగుతోంది. ఈ వాస్తవ ఘటనలు.. క్రైమ్‌, సస్పెన్స్‌ సినిమాల్ని తలదన్నే రీతిలో ఉండడం గమనార్హం. ఖమ్మం జిల్లాలో ఇటీవల జరిగిన ఒక ఘటనే ఇందుకు ఉదాహరణ. జిల్లాలోని చింతకాని మండలం, బొప్పారం గ్రామానికి చెందిన జమాల్‌ సాహెబ్‌, ఇమాంబీ భార్యాభర్తలు. వీరిద్దరు ఐదు పదుల వయస్సుకు దగ్గరైనవారే. మోహన్‌రావు అనే వ్యక్తితో వివాహేతర సంబంధంలో ఉన్న ఇమాంబీ.. ఆ విషయం భర్తకు తెలియడంతో అతణ్ని అడ్డుతొలగించుకునేందుకు ప్రియుడితో కలిసి పథకం పన్నింది. బండి మీద వెళ్తున్న భర్తకు విషం ఇంజెక్షన్‌ ఇప్పించి హత్య చేయించింది. మరో కేసులో.. జనగామ జిల్లా హన్మంతపురం గ్రామానికి చెందిన లకావత్‌ కొమ్రెల్లి, భారతికి 8 సంవత్సరాల క్రితం పెళ్లైంది. వీరికి ముగ్గురు పిల్లలు. రెండేళ్ల క్రితం పరిచయమైన వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పరచుకుంది. ఓ రోజు భర్తకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడటంతో వివాహేతర సంబంధం నెరపుతున్న వ్యక్తితో కలిసి అత్యంత దారుణంగా భర్తను హత్య చేసింది.

దాన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు.. ఇద్దరూ కలిసి శవాన్ని 50 కిలోమీటర్లు ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లి వంతెన పైనుంచి కిందకు తోసేశారు. పోస్టుమార్టం నిర్వహించిన వైద్యుడు హత్యగా తేల్చడంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేయగా.. తల్లి తన ప్రియుడితో కలిసి ఎలా తన తండ్రిని చున్నీతో ఉరేసి చంపిందో భారతి మూడేళ్ల కుమార్తె తనకు తెలిసిన మాటల్లో చెప్పడంతో ఆ హత్య గుట్టు రట్టయింది. ఇవే కాదు.. ప్రియుడితో కలిసి భర్తను చంపి ఇద్దరు కుమార్తెలు చూస్తుండగా అతడి మృతదేహాన్ని నీళ్ల ట్యాంకులో పడేసిన భార్య ఒకరు.. బాబాయి వరుస అయ్యే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుని గుట్టు రట్టవుతుందనే భయంతో.. భర్తను రోకలి బండతో మోది హత్య చేసిన ఇల్లాలు మరొకరు. ఈ తరహా ఘటనలు రాష్ట్రంలో తరచూ ఎక్కడో ఒకచోట వెలుగు చూస్తూనే ఉన్నాయి.

నరకప్రాయం.. జైలు జీవితం..

వివాహేతర సంబంధం ఏర్పరుచుకున్న మహిళలుగానీ, వారికి సహకరించే వారి ప్రియులుగానీ మరచిపోతున్న విషయం ఏంటంటే.. అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ఈ రోజుల్లో ఏ నేరమైనా చేసి తప్పించుకోవడం దాదాపు అసాధ్యం! ఆ విషయం తెలిసేసరికే వారి పరిస్థితి ఘోరంగా ఉంటుంది. వ్యామోహంలో తాము చేసిన తప్పు తెలుసుకుని ప్రతి క్షణం నరకం అనుభవిస్తుంటారు. కుటుంబ సభ్యులు జైలుకు వచ్చి పలకరించే పరిస్థితి కూడా ఉండదు. కన్నబిడ్డలను అసలు దగ్గరకు రానివ్వరు. ఇలా అందరూ ఉన్నా ఒంటరిగా నాలుగు గోడల మధ్య జైలు జీవితం గడపాల్సిందే. జైలు నుంచి విడుదలైన తర్వాత ఎటు వెళ్లాలో తెలియక వసతి గృహాల్లో తలదాచుకుంటున్నవారెందరో. ఉదాహరణకు.. నాగర్‌కర్నూలు స్వాతి పరిస్థితి ప్రస్తుతం అదే! ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తనే మరో వ్యక్తి మోజులో పడి కిరాతకంగా హతమార్చిన ఆమె.. జైలు నుంచి విడుదలైన తర్వాత ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితుల్లో ప్రస్తుతం వసతి గృహంలో ఉంటోంది. కారణాలేవైనాగానీ.. ఇలాంటి ఘటనల్లో ఎక్కువగా నష్టపోయేది పిల్లలే. తల్లిదండ్రుల్లో ఒకరు చనిపోయి, మరొకరు జైలుకెళ్తే.. వారి పిల్లలను అక్కున చేర్చుకునే బంధువులు చాలా తక్కువ సందర్భాల్లోనే ఉంటున్నారు. దీంతో ఆ చిన్నారులు అనాథాశ్రమాల పాలవుతున్నారు. ఒకవేళ బంధువుల పంచన చేరినా సహజమైన అనుబంధాలు, ఆప్యాయతలు లేక వారి మనసులు దారి తప్పే ప్రమాదం ఉంటుంది.

ఎందుకిలా?

లైంగిక కోర్కెలు సరిగ్గా తీరకపోవడమే అన్ని సందర్భాల్లోనూ వివాహేతర సంబంధాలకు కారణం కాదని మనస్తత్వ శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. భార్యాభర్తల మధ్య సత్సంబంధాలు లేకపోవడం.. ఒకరిపై ఒకరికి నమ్మకం లేకపోవడం.. ఒకరి మాటకు మరొకరు గౌరవం ఇవ్వకపోవడం.. సర్దుకుపోయే మనస్తత్వం లేకపోవడంతో చిన్న చిన్న అంశాలకే దంపతుల మధ్య గొడవలు వస్తాయని.. క్రమేపీ అవి పెద్దవి అయ్యి.. ఆ సమయంలో వారి మధ్యలోకి మూడో వ్యక్తి చేరడంతో మూడుముళ్ల బంధం ముక్కలవుతోందని వారు వివరిస్తున్నారు. జీవిత భాగస్వామి తనకు తగిన వ్యక్తి కాదనో.. ఆర్థిక స్థితిగతులో.. శృంగార జీవితం సరిగ్గా లేకపోవడమో.. ఇలా ఏదో ఒక అసంతృప్తి, అపోహ, అనుమానం, పనిచేసే చోట కొత్త ఆకర్షణ వంటి కారణాలతో కొందరు, థ్రిల్‌ కోసం, కొత్తదనం కోసం, కెరియర్‌ కోసం మరికొందరు.. ఇలా రకరకాల కారణాలతో వివాహేతర సంబంధాలు పెట్టుకుంటుండడంతో కాపురాలు కుప్పకూలుతున్నాయని చెబుతున్నారు. అలాగే.. పెరుగుతున్న సామాజిక మాధ్యమాల ప్రభావం కూడా ఈ సంబంధాలకు ఒక కారణంగా పేర్కొంటున్నారు. ‘‘గతంలో ఒక వ్యక్తికి వేరే ప్రాంతంలో ఉన్న ఇంకొకరితో పరిచయం కావాలంటే అంత సులువుగా కుదిరేది కాదు. కానీ ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌, ట్విటర్‌ వంటివి వచ్చాక పరిచయాలు సులువయ్యాయి. జీవితభాగస్వామి నుంచి తమకు కావాల్సినంత ప్రేమ, ఆప్యాయత లభించనప్పుడు.. సామాజిక మాధ్యమాల్లో పరిచయమైనవారు మాట్లాడే తీయటి మాటలకు పొంగిపోతారు. క్రమంగా ఆ పరిచయాలు వివాహేతర సంబంధాలుగా మారే అవకాశం ఎక్కువగా ఉంది.

ఇప్పుడు జరుగుతోంది అదే’’ అని వారు విశ్లేషిస్తున్నారు. మరి దీనికి పరిష్కారం ఏమిటంటే.. భర్తయినా, భార్య అయినా.. జీవిత భాగస్వామికి ఏమైనా అసంతృప్తులు ఉన్నాయా అనే విషయాన్ని గమనించుకుంటూ ఉండాలని, ఒకరితో ఒకరు వీలైనంత ఎక్కువసేపు గడపడానికి, ప్రేమగా మాట్లాడడానికి ప్రాధాన్యమివ్వాలని, ఎదుటివారి భావాలకు విలువ ఇవ్వాలని సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల తమకు కావాల్సిన ప్రేమ, కేరింగ్‌ భార్య/భర్త నుంచి దొరకడంతో.. మూడో వ్యక్తి వారి బంధంలోకి చొరబడే ప్రమాదం తగ్గుతుందని సైకాలజిస్టులు చెబుతున్నారు. భాగస్వామి తీరు నచ్చకపోతే తొలుత ఆ విషయంపై వారితో మాట్లాడి.. ఆ అసంతృప్తిని తొలగించుకోవడానికి ప్రయత్నించాలే తప్ప, ఆ బాధను మనసులోనే దాచుకుని వేరొకరికి దగ్గరవడం వల్ల సమస్య పరిష్కారం కాకపోగా కొత్త సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. ఒకవేళ తాము చెప్పలేం అనుకుంటే ఇంట్లో పెద్దలను లేదా వైద్యులను సంప్రదిస్తే కౌన్సెలింగ్‌ చేస్తారని.. దాని వల్ల మంచి ఫలితాలు ఉంటాయని సూచిస్తున్నారు. ఇవేవీ చేయకుండా.. ఇతరులను ఇష్టపడి వారితో ఉండాలనుకుంటే.. చట్టపరంగా భర్త/భార్యకు విడాకులు ఇచ్చి, తమకు నచ్చినవారిని పెళ్లి చేసుకునే హక్కు ఉందని.. జీవితభాగస్వామిని చంపడం కంటే అది మేలైన ప్రత్యామ్నాయం అనే విషయాన్ని గుర్తిస్తే మంచిదని వారు పేర్కొంటున్నారు.

విలువలు లేకపోవడం వల్లే..

సమాజంలో విలువలు లేకపోవడం వల్ల ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. నేరాలు, హింస, హత్యలు, వివాహేతర సంబంధాల వంటివాటికి ఇం తకాలం మగవారు ఎక్కువగా పాల్పడేవారు. ఇటీవల కాలంలో మహిళలు ఇందులో భాగమవుతున్నారు. ప్రజాస్వామిక కుటుంబ విలువలు లేకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది. ఆ విలువలు ఉన్న చోట భా ర్యాభర్తలు అంగీకారంతో విడిపోతారు. హింసకు గురవుతున్నవారిలో మహిళలే ఎక్కువగా ఉన్నారు. అక్కడక్కడ భార్యల చేతిలో భర్తలు చనిపోతున్నారు.

- సంధ్య, పీవోడబ్ల్యూ అధ్యక్షురాలు

కౌన్సెలింగ్‌తో మార్పు తేవొచ్చు

వివాహేతర సంబంధం కారణంగా భార్య భర్తను, భర్త భార్యను చంపడం వంటి ఘటనలు తరచూ వెలుగు చూస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో వేధించడం వల్ల కూడా హత్యలు జరుగుతుంటాయి. ఏది ఏమైనా పరిస్థితి అదుపు తప్పుతుందనుకునే సందర్భంలో కౌన్సెలింగ్‌ ఇవ్వడం వల్ల వారి ప్రవర్తనలో మార్పు తెచ్చేందుకు అవకాశం ఉంటుంది.

- డా. ఉమాశంకర్‌, సూపరింటెండెంట్‌,

ఎర్రగడ్డ మానసిక చికిత్సా కేంద్రం

Updated Date - 2022-11-15T05:05:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising