ఆస్పత్రికి సమస్యల వేదన
ABN, First Publish Date - 2022-03-05T06:03:46+05:30
ఆస్పత్రికి సమస్యల వేదన
సీకేఎం ప్రసూతి ఆస్పత్రికి సిబ్బంది కొరత
వంద పడకలకు పెంచినా సిబ్బంది లేక అవస్థ
పొరుగు జిల్లాల నుంచీ రోగుల రాక
రోజురోజుకూ పెరుగుతున్న పేషెంట్లు
నేడు జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖామంత్రి రాక
ఆస్పత్రి గోడు తీర్చాలని రోగుల వినతి
నిరుపేదలకు పెద్దదిక్కుగా మారిన సీకేఎం ప్రసూతి ఆస్పత్రిలో సరిపడా సిబ్బంది లేక రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నేడు జిల్లా పర్యటనకు వస్తున్న వైద్య, ఆరోగ్యశాఖా మంత్రి తన్నీరు హరీష్‌రావు స్పందించి ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని జిల్లా వాసులు కోరుతున్నారు. సీకేఎం ఆస్పత్రిపై ప్రత్యేక కథనం.
గిర్మాజిపేట, మార్చి 4 : వరంగల్ జిల్లా కేంద్రంలోని దాత చందాకాంతయ్య ఇచ్చిన 5 ఏకరాల స్థలంలో 60 పడకల ప్రసూతి ఆస్పత్రిని కాకతీయ వైద్య కళాశాల బోధనాస్పత్రిగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచే కాకుండా కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలతో పాటుగా సరిహద్దు మహారాష్ట్ర ప్రాంతాల నుంచి కూడా మహిళలు ప్రసవాలు, స్త్రీ సంబంధిత వైద్య చికిత్స కోసం వస్తుంటారు. పడకల సంఖ్య సరిపోకపోవడంతో 2011లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వంద పడకలకు పెంచినా, ఆ మేరకు సిబ్బందిని పెంచలేదు. ప్రసవాలు పెంచడంతో పాటుగా శిశు మరణాలను తగ్గించాలనే లక్ష్యంతో సీఎం చేపట్టిన కేసీఆర్ కిట్‌లు, ఉచిత అంబులెన్స్ సేవలతోపాటుగా సిబ్బంది మెరుగైన వైద్యంతో రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఆస్పత్రిలో నిత్యం 40కు పైగా సాధారణ, సీజేరియన్ ప్రసవాలు జరుగుతుంటాయి. గర్భసంచి తొలగింపు, గర్భసంచి జారడం, గర్భశాయానికి బుడిపెలు తదితర ఆపరేషన్‌లు సైత్యం నిత్యం 20కు పైగా జరుగుతుంటాయి. ఏటా ఏడు వేల వరకు ప్రసవాలు, నాలుగు వేల వేల స్త్రీ గైనిక్ సర్జరీలు జరుగుతున్నాయి. రోగులు పెరుగుతుండటంతో ఆ మేరకు సిబ్బంది లేకపోవడంతో సిబ్బందిపై భారం పడుతోంది.
వైద్యులు, సిబ్బంది కొరత
ఆస్పత్రిలో మొత్తం 96 పోస్టులకు 56మందే పనిచేస్తున్నారు. ఇందులో ఇద్దరు గైనకాలజీ, ఇద్దరు అనస్థీషియా అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సివిల్ అసిస్టెంట్ సర్జన్, డైటీషియన్, ఫార్మసిస్ట్ గ్రేడ్-1, ఫార్మసిస్ట్ గ్రేడ్-2 ఇద్దరు చొప్పున కొరత ఉంది. ల్యాబ్ టెక్నిషియన్ గ్రేడ్ 1 ఒకటి, గ్రేడ్ 2 ఒకటి, స్టాఫ్‌నర్సులు 14 ఖాళీగా ఉన్నాయి. ఫార్మసీ, ల్యాబ్ రెండు కూడా ఉర్సు ఆస్పత్రి డిప్యూటేషన్ సిబ్బందితో నడిపిస్తున్నారు. పీపీ యూనిట్‌లో మొత్తం 15 పోస్టులకు 6 ఖాళీలు, ఫ్యామిలీ వేల్ఫేర్ సెంటర్‌లో 6 పోస్టులకు 4 ఖాళీలున్నాయి. ఆస్పత్రికి అనుబంధంగా ఉన్న ఉర్సు ప్రసూతి ఆస్పత్రిలో మొత్తం 25 పోస్టులకు 12 ఖాళీలున్నాయి. ఇందులో వైద్యులు 4, స్టాఫ్‌నర్సులు 4 ఖాళీగా ఉన్నాయి.
ఆస్పత్రికి కావాల్సినవి
200 పడకల స్థాయికి పెంచి వైద్యులు, నర్సింగ్, పారామెడికల్ తదితర సిబ్బందిని నియమించాలి.
పాతభవనాల స్థానంలో నూతన భవనాలు నిర్మించాలి.
ఇన్ ఫెర్టిలిటీ సెంటర్‌ను ఆస్పత్రిలోనే ఏర్పాటు చేయాలి.
రక్త నిల్వకేంద్రంను వెంటనే తెరిపించాలి.
మిల్క్ బ్యాంక్ ఏర్పాటు చేయాలి.
Updated Date - 2022-03-05T06:03:46+05:30 IST