KTR: శబాష్ హైదరాబాద్
ABN, First Publish Date - 2022-12-15T02:52:52+05:30
గృహోపకరణాలు, పారిశ్రామిక ఉత్పత్తులు, టెక్నాలజీ, రవాణా రంగాల్లో వివిధ రకాల ఉత్పత్తులు అందిస్తున్న ప్రముఖ అంతర్జాతీయ సంస్థ బాష్.. హైదరాబాద్‌లో స్మార్ట్ క్యాంపస్ ఏర్పాటు చేసింది.
రాజధానిలో బాష్ గ్లోబల్ సాఫ్ట్‌వేర్ టెక్నాలజీస్ స్మార్ట్ క్యాంపస్ ప్రారంభం
1.5 లక్షల చదరపు అడుగుల్లో క్యాంపస్..
విశ్వస్థాయి సదుపాయాల కల్పనకు చొరవ
అందుకే ప్రముఖ సంస్థలు రాష్ట్రంలో తమ
కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నాయి: కేటీఆర్
హైదరాబాద్, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): గృహోపకరణాలు, పారిశ్రామిక ఉత్పత్తులు, టెక్నాలజీ, రవాణా రంగాల్లో వివిధ రకాల ఉత్పత్తులు అందిస్తున్న ప్రముఖ అంతర్జాతీయ సంస్థ బాష్.. హైదరాబాద్‌లో స్మార్ట్ క్యాంపస్ ఏర్పాటు చేసింది. బుధవారం హైటెక్‌సిటీలో నిర్వహించిన కార్యక్రమంలో బాష్ గ్లోబల్ సాఫ్ట్‌వేర్ టెక్నాలజీస్ స్మార్ట్ క్యాంప్‌సను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కొత్త క్యాంపస్ తెలంగాణలో ఇంజనీరింగ్ ప్రతిభ, ఆవిష్కరణలకు సాక్ష్యంగా ఉంటుందన్నారు. టెక్నాలజీ కంపెనీలకు ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలను కల్పించడంపై ప్రభుత్వం దృష్టి సారించడం వల్ల రాష్ట్రంలో అనేక ప్రముఖ సంస్థలు తమ కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నాయని తెలిపారు. ఐటీ, పరిశ్రమల రంగంలో పెద్దఎత్తున పెట్టుబడులు సాధించి ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న నగరంగా హైదరాబాద్ దేశంలోనే పేరుగాంచిందన్నారు. బాష్ గ్లోబల్ సాఫ్ట్‌వేర్ టెక్నాలజీస్ సెంటర్ హెడ్, హైదరాబాద్ వైస్ ప్రెసిడెంట్ కిరణ్ సుందర రామన్ మాట్లాడుతూ.. 1.5 లక్షల చదరపు అడుగుల్లో స్మార్ట్ క్యాంపస్ ఉందని, ఐటీ, క్లౌడ్ టెక్నాలజీస్, ఐవోటీ, ఎంఎల్, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో పరిష్కారాలకు ఇక్కడి కేంద్రం కృషి చేస్తుందని తెలిపారు. తమ సంస్థకు ఇప్పటికే నగరంలో 1,500 మంది ఉద్యోగులున్నారని చెప్పారు. కాగా గ్లోబల్ డెలివరీ నెట్‌వర్క్, సాఫ్ట్‌వేర్ సెంట్రిక్ ఇన్నోవేషన్‌లను బలోపేతం చేయడానికి హైదరాబాద్‌లో కొత్త క్యాంపస్ ప్రారంభించినట్టు సంస్థ తెలిపింది. 2025నాటికి ఈ కేంద్రంలోని ఆటోమోటివ్ ఇంజనీరింగ్, డిజిటల్ ఎంటర్‌ప్రైజ్ విభాగాల్లో 3 వేల మంది నిపుణులను నియమించుకోనున్నట్టు పేర్కొంది. ఈ సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-12-15T02:52:53+05:30 IST