భగ్గుమన్న టీఆర్‌ఎస్ శ్రేణులు
ABN, First Publish Date - 2022-10-28T00:24:16+05:30
టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ కుట్రలు చేసిందని ఆరోపిస్తూ టీఆర్‌ఎస్ పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు హనుమకొండ జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులు గురువారం ఆందోళన నిర్వహించాయి. అన్ని మండల కేంద్రాల్లో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు.
జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు
ప్రధాని, కేంద్ర హోంమంత్రి దిష్టిబొమ్మల దహనాలు
హనుమకొండ టౌన్, అక్టోబరు 27 : టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ కుట్రలు చేసిందని ఆరోపిస్తూ టీఆర్‌ఎస్ పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు హనుమకొండ జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులు గురువారం ఆందోళన నిర్వహించాయి. అన్ని మండల కేంద్రాల్లో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు. అధికార పార్టీ జిల్లా ఎమ్మెల్యేలు మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో ఉండటంతో వారి సూచన మేరకు హనుమకొండలో కార్పొరేటర్లు, టీఆర్‌ఎస్ డివిజన్ అధ్యక్షులు, మండలాల్లో మండల పార్టీ అధ్యక్షులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, పార్టీ కార్యకర్తలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు.
హనుమకొండ చౌరస్తాలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ దిష్టిబొమ్మను 7వ డివిజన్ కార్పొరేటర్ వేముల శ్రీనివాస్ ఆధ్వర్యంలో దహనం చేశారు. తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షుడు దాస్యం విజయ్ భాస్కర్ ఆధ్వర్యంలో గురువారం హనుమకొండ వడ్డెపల్లి చర్చి జంక్షన్‌లో టీఆర్‌ఎస్ శ్రేణులు ప్రధాని నరేంద్రమోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. మడికొండ చౌరస్తాలో 45, 46వ డివిజన్ల కార్పొరేటర్లు ఇండ్ల నాగేశ్వర్‌రావు, మునిగాల సరోజన కరుణాకర్ ఆధ్వర్యంలో బీజేపీ దిష్టిబొమను దహనం చేశారు.
పరకాల పట్టణంలోని బస్టాండ్ కూడలి వద్ద టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు మడికొండ శ్రీను, మండల అధ్యక్షుడు చింతిరెడ్డి మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్రమోదీ, అమిత్‌షా, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఐనవోలు మండల కేంద్రంలో ప్రధాని మోదీ దిష్టిబొమ్మను ఎంపీపీ మార్నేని మధుమతి, జడ్పీ వైస్ చైర్మన్ గజ్జెలి శ్రీరాముల ఆధ్వర్యంలో దహనం చేశారు. ధర్మసాగర్ మండల కేంద్రంలో అమరవీరుల స్ధూపం వద్ద టీఆర్‌ఎస్ గ్రామశాఖ ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్ నాయకులు బీజేపీ దిష్టిబొమ్మను దహనం చేశారు. భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ బస్టాండ్ చౌరస్తాలో టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు మార్పాటి మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ధర్నాలో జడ్పీ చైర్మన్ సుధీర్‌కుమార్ పాల్గొన్నారు.
శాయంపేట మండల కేంద్రంలో టీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ధర్నా, రాస్తారోకోలో ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు గంగుల మనోహర్‌రెడ్డి పాల్గొన్నారు. ఆత్మకూరు మండల కేంద్రంలో పార్టీ మండల అధ్యక్షుడు లేతాకుల సంజీవరెడ్డి ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఎల్కతుర్తి మండల కేంద్రంలో జడ్పీ చైర్మన్ సుధీర్‌కుమార్, ఎంపీపీ మేకల స్వప్న, వైస్ ఎంపీపీ తంగెడ నగేష్, మండల పార్టీ అధ్యక్షుడు సమ్మయ్యగౌడ్ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. టీఆర్‌ఎస్ నడికూడ మండల కమిటీ ఆధ్వర్యంలో గురువారం బీజేపీ దిష్టిబొమ్మను దహనం చేశారు. కమలాపూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో గురువారం మండల టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు భారత ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర హోం మంత్రి అమిత్‌షాల దిష్టిబొమ్మలను దహనం చేశారు.
Updated Date - 2022-10-28T00:24:18+05:30 IST