ప్రజారోగ్యం ‘వధ’
ABN, First Publish Date - 2022-10-27T00:24:47+05:30
బల్దియా ఆధ్వర్యంలోని కబేళాలకు వెళ్లకుండా మాంసం విక్రయదారుల్లో కొందరు గొర్రెలు, మేకల కొట్టాల్లో వధిస్తుండగా మరి కొందరు ఆయా ప్రాంతాల్లో ఒక చోటును ఎంపిక చేసుకొని ప్రతీ రోజు అక్కడే వధిస్తున్నారు.
నగరంలో నామమాత్రంగా మారిన 3 కబేళాలు
ఎక్కువశాతం ప్రైవేటు స్థలాల్లోనే వధిస్తున్న మాంసం వ్యాపారులు
అనారోగ్యంగా ఉన్న మేకలు, గొర్రెలను వధిస్తున్న వైనం
యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన
పట్టించుకోని జీడబ్ల్యూఎంసీ ప్రజారోగ్య అధికారులు
కబేళాల సంఖ్య పెంచితేనే సమస్యకు పరిష్కారం
జీడబ్ల్యూఎంసీ(హనుమకొండ సిటీ), అక్టోబరు 26 : జంతు వధశాలల (కబేళాలు) నిర్వహణపై అధికారుల నిఘా కరువైంది. మాంసం విక్రయదారులు నిబంధనలు తుంగలో తొక్కి లాభార్జనే ధ్యేయంగా వ్యవహరిస్తున్నారు. దీనిని అరికట్టాల్సిన గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) ప్రజారోగ్య విభాగం అధికారులు మామూళ్లను దండుకొని నజర్ పెట్టడం లేదు. మాంసం విక్రయదారులు కబేళాల్లో కాకుండా కొట్టాల్లోనే మేకలు, గొర్రెలను వధిస్తున్న విషయం తెలిసిన బల్దియా అధికారులు పట్టించుకోవడం లేదు.
నిబంధనలు తూచ్..
జీడబ్ల్యూఎంసీ ఆధ్వర్యంలో కాజీపేట జూబ్లీ మార్కెట్, హనుమకొండ బాలసముద్రం, వరంగల్ లక్ష్మీపురంలో మూడు వధశాలల నిర్వహణ జరుగుతోంది. ప్రతియేటా వధశాలల టెండర్లను నిర్వహించి కాంట్రాక్టర్లకు బల్దియా అప్పగిస్తుంది. అయితే జంతువుల వధ పర్యవేక్షణ బాధ్యత అంతా కూడా బల్దియా సీఎంహెచ్‌వో, ఎంహెచ్‌వో, వెటర్నరీ డాక్టర్‌కు ఉంటుంది. నగరంలోని మూడు కబేళాల్లో నామమాత్రంగా జంతువుల వధ జరుగుతోంది. ప్రతీ రోజు మాంసం విక్రయదారులు వధించే జంతువుల్లో 60 శాతం బయట ప్రాంతాల్లోనే వధ జరుగుతోంది. వధశాలల్లో మినహా బయట ప్రాంతాల్లో ఎక్కడా కూడా మేకల, గొర్రెల వధ జరగకూడదనే నిబంధనలు పేరుకే పరిమితమవుతున్నాయి.
కొట్టాల్లోనే వధ
కొందరు మినహా అత్యధిక మంది మాంసం విక్రయదారులు మేకలు, గొర్రెలు పెంచే కొట్టాల్లోనే వధిస్తున్నా రు. కబేళాల్లో జంతువుల వధకు ముందుగా అవి సంపూ ర్ణ ఆరోగ్యంగా ఉన్నాయో లేదో వెటర్నరీ డాక్టర్లు పరీక్షిస్తారు. ఈ విషయంలో బల్దియా ప్రజారోగ్య అధికారులు కూడా పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహిస్తారు. ఆరోగ్యంగా ఉన్న జంతువులకే సిక్కా (ముద్ర) వేస్తారు. అన్ని పక్కా గా నిర్ధారించాకే వధిస్తారు. కానీ కొందరు మాంసం విక్రయదారులు బయట ప్రాంతాల్లో, కొట్టాల్లో జంతువులను వధించడం ద్వారా వాటి ఆరోగ్య పరిస్థితి నిర్ధారించే అవకాశమే లేదు. లాభార్జనే ధ్యేయంగా అనారోగ్య జంతువులను కూడా వధిస్తూ ప్రజల ఆరోగ్యానికి చేటు కలిగిస్తున్నారు. బయటి ప్రాంతాల్లో వధించడం వల్ల జంతువుల వ్యర్థాలు నివాసిత ప్రాంతాల్లో వేయడం, డ్రెయినేజీల్లో వ్యర్థాలు వేయడం వంటివి జరుగుతున్నాయి.
ఈ పరిణామాలు ప్రజల ఆరోగ్యంపై నేరుగా ప్రభా వం చూపడమే కాకుండా పర్యవరణానికి కూడా ముప్పు తెస్తున్నాయి. బల్దియా ఆధ్వర్యంలోని కబేళాలకు వెళ్లకుండా మాంసం విక్రయదారుల్లో కొందరు గొర్రెలు, మేకల కొట్టాల్లో వధిస్తుండగా మరి కొందరు ఆయా ప్రాంతాల్లో ఒక చోటును ఎంపిక చేసుకొని ప్రతీ రోజు అక్కడే వధిస్తున్నారు. ఈ పరిస్థితి నగరం నలుదిక్కులా ఉంది. కబేళాలకు కూత వేటు దూరంలో ఉన్న ప్రాంతాల్లో కూడా జంతువుల వధ జరుగుతోంది. అండర్ రైల్వే గేట్ ప్రాంతాలు, ఏనుమాముల, దేశాయిపేట, డాక్టర్స్ కాలనీ, గిర్మాజీపేట, లేబర్ కాలనీ, వరంగల్ కుమార్‌పల్లి మార్కెట్ సమీప ప్రాంతాలు, గోపాలపురం, కేయూ వంద ఫీట్ల రోడ్డు, గోపాలపురం, బీమారం, హసన్‌పర్తితో పాటు విలీన గ్రామాల్లో అయితే దుకాణాల్లోనే విక్రయదారులు జంతువులను వధిస్తున్నారు.
మామూళ్ల దందా
బయట ప్రాంతాల్లో జంతువుల వధ ప్రజారోగ్య అధికారులకు మామూళ్ల దందాగా మారింది. మాంసం విక్రయదారులపై చర్యలు తీసుకోవాల్సిన సీఎంహెచ్‌వో, ఎంహెచ్‌వో తనిఖీలే చేయడం లేదు. ఇక తమ డివిజన్లలో ఎక్కడెక్కడ నిబంధనలకు విరుద్ధంగా జంతువుల వధ జరుగుతుందనే విషయాలు శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, జవాన్లకు పక్కగా తెలుసు. అయినా వీరిలో కొందరు నెల నెలా వసూళ్లకు పాల్పడుతూ అక్రమంగా సంపాదిస్తున్నారు. ప్రజారోగ్య అధికారులు అక్రమ వసూళ్లకు పాల్పడుతూ ప్రజారోగ్యాన్ని పరిహాసం చేస్తున్నారు.
66 డివిజన్లకు మూడే కబేళాలు
వరంగల్ మహానగరం 66 డివిజన్లతో విస్తరించింది. జనాభా 11 లక్షలకు చేరింది. నగరంలో 2 లక్షల 23 వేలకు పైగా ఇళ్లు ఉన్నాయి. విలీన గ్రామాలు నగర ప్రధాన సెంటర్లకు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఈ క్రమంలో మూడే కబేళాలు ఉండడం పట్ల కూడా ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కబేళాలు దూరంగా ఉండడం, వాటిలో సదుపాయాల కొరత కారణంగా తాము బయటే వధించే పరిస్థితి ఏర్పడుతుందనే వాదనలు వినిపిస్తున్నారు. నగరం మరో ఆరు కబేళాలు కొత్తవి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు.
Updated Date - 2022-10-27T00:24:48+05:30 IST