విద్య, వైద్యా రంగాలను జాతీయం చేయాలి
ABN, First Publish Date - 2022-12-16T00:04:44+05:30
విద్య, వైద్యా రంగాలను జాతీయం చేసినప్పుడే అన్ని వర్గాలకూ సమన్యాయం జరుగుతుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ అన్నారు.
భూపాలపల్లిటౌన్, డిసెంబరు 15: విద్య, వైద్యా రంగాలను జాతీయం చేసినప్పుడే అన్ని వర్గాలకూ సమన్యాయం జరుగుతుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ అన్నారు. పాలమూరు నుంచి ఆయన చేపట్టిన పోరుయాత్ర గురువారం భూపాలపల్లికి చేరుకుంది. ఈ సందర్భంగా పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో 12లక్షల మంది బీసీ విద్యార్థులు ఉన్నారని తెలిపారు. ప్రతి గ్రామంలోనూ 70 శాతం ఉంటారన్నారు. అయినప్పటికీ జనాభా దామాషా ప్రకారం బీసీలకు పాలకులు న్యాయం చేయడం లేదని ధ్వజమెత్తారు. జనాభా ప్రాతిపదికన గణన చేసి రిజర్వేషన్లు కల్పిస్తేనే బీసీలకు సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో న్యాయం జరుగుతుందన్నారు. ఎమ్మెల్యేల కు, మంత్రులకు, ఎంపీలకు జీతాలు పెంచుతున్నారే తప్ప పేద విద్యార్థులకు మెస్‌చార్జీలు ఎందుకు పెంచడం లేదని ప్రశ్నించారు. బీసీలకు ప్రైవేటు యూని వర్సీటీల్లో రిజర్వేషన్లు ఇస్తున్నారా..? అని ధ్వజమెత్తారు. బీసీలకు కూడా ‘బంఽధు’ పథకాన్ని వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. బీసీల్లో ఉన్న వివిధ వృత్తుల వారు ఏకమై దండు కడితేనే హక్కులు సాధించుకోవచ్చని అన్నారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ విద్యార్థి సంఘం కేంద్ర కమిటీ అధ్యక్షుడు విక్రమ్, యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కనకాల శ్యాంకుర్మ, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.శ్రీనివాస్, నాయకులు ముంజాల రవీందర్, పైడిపల్లి రమేష్, బుర్ర కుమారస్వామి, వెంకన్న, శ్రీనివాస్, రాజన్న తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-12-16T00:04:46+05:30 IST