ఖాకీల మోహరింపు
ABN, First Publish Date - 2022-06-18T05:18:06+05:30
ఖాకీల మోహరింపు
‘సికింద్రాబాద్ రైల్వే స్టేషన్’ ఘటన నేపథ్యంలో అప్రమత్తం
ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైల్వే స్టేషన్లకు భారీ భద్రత
పెద్ద ఎత్తున మోహరించిన
పోలీసు, ఆర్‌పీఎఫ్, జీఆర్‌పీ బలగాలు
ఆలస్యంగా నడిచిన రైళ్లు.. మరికొన్ని దారి మళ్లింపు
బస్సులు, ఇతర వాహనాల ద్వారా వెళ్లిన ప్రయాణికులు
కాజీపేట/గిర్మాజిపేట/నెక్కొండ /జనగామ, మహబూబాబాద్ (ఆంధ్రజ్యోతి), జూన్ 17 : కేంద్ర ప్రభుత్వ ‘అగ్నిపథ్’ పథకాన్ని నిరసిస్తూ శుక్రవారం ఉదయం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ఆర్మీ ఉద్యోగార్థులు చేసిన ఆందోళన హింసాత్మకంగా మారడంతో... పోలీసులు వెంటనే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రైల్వేస్టేషన్ల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధానంగా వరంగల్, కాజీపేట, జనగామ, మహబూబాబాద్, నెక్కొండ, డోర్నకల్ రైల్వే స్టేషన్లకు పహారా కాశారు. కొన్ని రైళ్లు ఆలస్యంగా నడవగా, మరికొన్ని రైళ్లను దారి మళ్లించారు.
వరంగల్ రైల్వేస్టేషన్‌లో..
వరంగల్ రైల్వేస్టేషన్‌లో ఆర్పీఎఫ్ జీఆర్పీ, వరంగల్ కమిషనరేట్ పోలీసులు అప్రమత్తం అయ్యారు. రైల్వే పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాలతో ఆర్పీఎఫ్ సీఐ టి.కృష్ణ, ఎస్సై ప్రజ్ఞ, జీఆర్పీ సీఐ జి.నరేష్, ఎస్సైలు పరశురాం, అయిలయ్య తమ సిబ్బందితో ప్లాట్‌ఫారాలు, రైల్వేస్టేషన్ ప్రధాన రహదారి, పరిసరాల్లో వద్ద పహారా కాశారు. వరంగల్ సీపీ తరుణ్‌జోషి ఆదేశాలతో వరంగల్ ఏసీపీ కె.గిరిధర్, ఇంతేజార్‌గంజ్ సీఐ మల్లేష్, మిల్స్‌కాలనీ సీఐ శ్రీనివాస్ ప్రత్యేక బలగాలతో రైల్వేస్టేషన్ పరిసరాల్లో బందోబస్తు నిర్వహించారు. వరంగల్, శివనగర్ వైపు ఉన్న రైల్వేస్టేషన్ ద్వారాలు, ప్లాట్‌ఫారాలపై పోలీసులు పహారా కాశారు. రైల్వేస్టేషన్‌లో పోలీసులు మోహరించిన సమయంలోనే గుంటూరు నుంచి సికింద్రాబాద్ వెళ్లే గోల్కొండ ఎక్స్‌ప్రెస్ రావడంతో పోలీసులు ప్రయాణికుల్లో అనుమానాస్పద వ్యక్తులపై దృష్టి పెట్టారు. రైల్వేస్టేషన్ మేనేజర్ ఎం.శ్రీనివాస్ స్టేషన్‌లో తమ సిబ్బందిని అలర్ట్ చేశారు. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేశారు.
హౌరా రద్దు.. ఆలస్యంగా పలు రైళ్లు..
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ఆర్మీ ఉద్యోగార్థుల ఆందోళనల నేపథ్యంలో రైల్వేశాఖ పలు రైళ్లను రద్దు చేసింది. కొన్ని రైళ్లను సికింద్రాబాద్‌కు వెళ్లకుండా దారి మళ్లించింది. శుక్రవారం ఉదయం హైదరాబాద్ నుంచి షాలిమార్ (18046) వెళ్లాల్సిన హౌరా ఎక్స్‌ప్రెస్ రైలును రద్దు చేశారు. ఈ సమాచారాన్ని మైక్‌లో అనౌన్స్ చేయడంతో ఈ రైలులో మహబూబాబాద్, ఖమ్మం, విజయవాడ వెళ్లాల్సిన ప్రయాణికులు కొందరు ఆర్టీసీ బస్సులను ఆశ్రయించగా, మరికొందరు గోల్కొండ, శాతవాహన, సాయి షిర్డీ సాయినగర్ రైళ్లలో వెళ్లేందుకు విశ్రాంతి మందిరాల్లో వేచిఉన్నారు.
అలాగే శుక్రవారం ఉదయం సికింద్రాబాద్ వైపు వెళ్లిన గోల్కొండ ఎక్స్‌ప్రెస్ మౌలాలి నుంచి తిరిగి గుంటూరుకు బయలుదేరింది. మధ్యాహ్నం 3గంటలకు రావాల్సిన ఈ రైలు 2 గంటలు ఆలస్యంగా సాయంత్రం 5గంటలకు వరంగల్‌కు వచ్చింది. శాతవాహన ఎక్స్‌ప్రెస్ చర్లపల్లి నుంచి తిరిగి విజయవాడకు బయలుదేరింది. ఈ రైలు సాయంత్రం 6.20 గంటలకు రావల్సి ఉండగా 2 గంటలు అలస్యంగా రాత్రి 8 గంటలకు వచ్చింది. అలాగే షిర్డ్డీ నుంచి సికింద్రాబాద్ మీదుగా వరంగల్ రావాల్సిన షిర్డ్డీ సాయినగర్ ఎక్స్‌ప్రెస్ రైలును సనత్‌నగర్ బైపాస్ మీదుగా దారి మళ్లించారు. దీంతో ఉదయం 11.30 గంటలకు వరంగల్ రావాల్సిన ఈ రైలు 4గంటలు ఆలస్యంగా సాయంత్రం 5.30 గంటలకు వరంగల్‌కు చేరుకుంది.
మహబూబాబాద్, ఖమ్మం, విజయవాడ వెళ్లే ప్రయాణికులు వరంగల్ రైల్వేస్టేషన్‌లోని విశ్రాంతి మందిరాల్లో వెయిట్ చేశారు. రైళ్ల ఆలస్యం కారణంగా సాధారణ, రిజర్వేషన్, మహిళా వెయిటింగ్ హాళ్లు నిండిపోయాయి. అలాగే సాయంత్రం సికింద్రాబాద్ వెళ్లే హౌరా, కృష్ణా ఎక్స్‌ప్రెస్, ఇంటర్‌సిటీ రైళ్లు కూడా ఆలస్యంగా నడుస్తున్నట్లు రైల్వేవర్గాల ద్వారా తెలిసింది.
కాజీపేట రైల్వేస్టేషన్‌లో..
కాజీపేట రైల్వే జంక్షన్‌లో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. సెంట్రల్ టీసీపీ అశోక్‌కుమార్ ఆదేశాల మేరకు కాజీపేట ఏసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీస్ సబ్ డివిజన్ పరిధికి చెందిన లా అండ్ ఆర్డర్, ఆర్‌పీఎఫ్, జీఆర్‌పీ సీఐ, ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది, డాగ్ స్వ్కాడ్‌లతో స్టేషన్‌లో ప్రతిచోటా క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ప్రయాణికులు స్టేషన్‌లోకి రాకుండా భారీ బందోబస్తు నిర్వహించారు. ప్రయాణికుల బ్యాగులను తనిఖీ చేశారు. ప్లాట్‌ఫామ్‌పై ఎవరూ ఉండకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. ఇన్‌చార్జి సీటీఐ కట్టస్వామి ఆధ్వర్యంలో హెల్ప్‌లైన్ కౌంటర్‌ను ఏర్పాటు చేసి రైళ్ల రాకపోకల పరిస్థితిని ప్రయాణికులకు సిబ్బంది వివరించారు. సికింద్రాబాద్ వైపునకు వెళ్లు రైళ్లను కొద్దిపాటి గంటల ఆలస్యంతో అధికారులు నడిపించారు. రైల్వేజంక్షన్‌లో కాజీపేట ఏసీపీ శ్రీనివాస్, కాజీపేట, మడికొండ, ధర్మసాగర్, ఎల్కతుర్తి మహేందర్‌రెడ్డి, రవికుమార్, రమేశ్, శ్రీనివాస్, ఆర్పీఎఫ్ సీఐలు సంజీవరావు, రాంమూర్తిలతోపాటు ఎస్‌ఐలు, వెంకటేశ్వర్లు, అపూర్వరెడ్డి, అశోక్‌కుమార్‌తోపాటు సిబ్బంది పాల్గొన్నారు. రైళ్ల రద్దుతో జంక్షన్‌కు చేరుకున్న ప్రయాణికులు వెనుదిరిగారు.
మానుకోట జిల్లాలో..
మహబూబాబాద్ జిల్లాలో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. రైల్వేస్టేషన్‌లలో పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహించారు. ఎస్పీ శరత్‌చంద్రపవార్ స్వయంగా మహబూబాబాద్ రైల్వేస్టేషన్‌ను సందర్శించి రైల్వే ప్రొటక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్), జీఆర్పీ పోలీసులకు తోడుగా సివిల్ పోలీసులకు భద్రతా ఏర్పాట్ల బాధ్యతను అప్పగించారు. మహబూబాబాద్ స్టేషన్‌లో డీఎస్పీ సదయ్య, టౌన్ సీఐ సతీష్ ఎస్సైలు రవి, వినయ్‌కుమార్, గోపి, మంగీలాల్, 20మంది సివిల్ కానిస్టేబుళ్లతో పాటు సెంట్రల్ రిజర్వుడ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) పోలీసులు పహారా కాశారు. అనుమానితులు ఎవరూ కూడా స్టేషన్‌లోకి అడుగుపెట్టకుండా స్టేషన్‌కు వెళ్లేదారిలో ప్రధాన ద్వారం వద్ద బారికేడ్‌లను ఏర్పాటు చేసి పోలీస్ బందోబస్తు నిర్వహించారు. ప్రయాణికులు లోనికి వెళ్లే క్రమంలో రైల్వే టికెట్‌ను పరిశీలించి అనుమతించారు. మహబూబాబాద్‌తో పాటు డోర్నకల్, గార్ల, గుండ్రాతిమడుగు, తాళ్లపూసపల్లి, కేసముద్రం, ఇంటికన్నె రైల్వేస్టేషన్‌లలో, వెలుపల పోలీసుల భద్రత కన్పించింది. గార్లలో బయ్యారం సీఐ జి.బాలాజీ, ఎస్సై వెంకన్న, డోర్నకల్‌లో ఆర్పీఎఫ్ ఎస్సై శ్రీనివాస్, జీఆర్పీ ఎస్సై శ్రీకాంత్, సివిల్ ఎస్సై శ్యాంసుందర్, కేసముద్రంలో ఎస్సై రమే్‌షబాబుల నేతృత్వంలో పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. నెక్కొండ రైల్వే స్టేషన్‌లో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. సర్కిల్ ఇన్‌స్పెక్టర్ హతిరామ్, నెక్కొండ, చెన్నారావుపేట ఎస్సైలు సీమాఫర్హీన్, మహేందర్ తదితరులు భద్రతను పర్యవేక్షించారు.
జనగామలో..
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జరిగిన ఘటన నేపథ్యంలో జనగామ జిల్లా పోలీసులు శుక్రవారం అప్రమత్తం అయ్యారు. పోలీసు ఉన్నతాధికారుల సూచనల మేరకు జిల్లాలోని ప్రధాన రైల్వే స్టేషన్లలో పోలీసులను ముందస్తుగా మోహరించారు. జనగామ డీసీపీ ఆదేశాల మేరకు జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్ రైల్వే స్టేషన్లలో ఏసీపీలు గజ్జి కృష్ణ, రఘుచందర్ నేతృత్వంలో సీఐలు, ఎస్సైలు, కానిస్టేబుళ్లు ముందస్తుగా బందోబస్తు నిర్వహించారు. జనగామ రైల్వే స్టేషన్‌లో సికింద్రాబాద్ వైపు వెళ్తున్న రైళ్లలోని ప్రయాణికులతో జనగామ ఏసీపీ కృష్ణ స్వయంగా మాట్లాడారు. సికింద్రాబాద్ అల్లర్ల నేపథ్యంలో రైలును ముందు స్టేషన్లలోనే ఆపుతారని, అక్కడి నుంచి వెళ్లాల్సిన చోటుకు వెళ్లాలని, ఎలాంటి ఆందోళన చెందొద్దని సూచించారు. సికింద్రాబాద్ వెళ్లడానికి స్టేషన్‌కు వచ్చిన వారికి అక్కడి పరిస్థితిని వివరించి బస్సుల్లో వెళ్లాలని సూచించారు. ఆయన వెంట జనగామ, నర్మెట్ట సీఐలు శ్రీనివాస్, నాగబాబు ఉన్నారు.
Updated Date - 2022-06-18T05:18:06+05:30 IST