అప్‘గ్రేట్’
ABN, First Publish Date - 2022-10-18T05:20:21+05:30
అప్‘గ్రేట్’
అంగన్‌వాడీ కేంద్రాలకు మహర్దశ
ప్రధాన కేంద్రాలుగా మారనున్న మినీ సెంటర్లు
జనాభా ప్రాతిపదికన విధివిధానాలు
ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన అధికారులు
భూపాలపల్లి జిల్లాలో 589 మెయిన్, 55 మినీ అంగన్‌వాడీ కేంద్రాలు
కృష్ణకాలనీ (భూపాలపల్లి), అక్టోబరు 17: అంగన్‌వాడీ కేంద్రాలను ప్రభుత్వం అప్‌గ్రేడ్ చేయనుంది. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు మరింత సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ మేరకు నిర్ణయించింది. మినీ సెంటర్లన్నింటినీ జనాభా ప్రాతిపదికన మెయిన్ సెంటర్లుగా మార్చనుంది. ఇందుకు స్ర్తీ, శిశు సంక్షేమ శాఖకు సర్కారు ఇప్పటికే మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ నేపథ్యంలో భూపాలపల్లి జిల్లాలోని మినీ సెంటర్ల జాబితాను సంబంధిత అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదించారు. తద్వారా మినీ అంగన్‌వాడీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా రూపాంతరం చెందనున్నాయి. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు మెరుగైన సేవలతోపాటు కొత్తగా ళమరిన్ని సెంటర్లు సైతం ఏర్పాటు కానున్నాయి. ఈ క్రమంలో మరిన్ని పోస్టులు కూడా అంగన్‌వాడీ కేంద్రాల్లో భర్తీ కానున్నాయి.
జనాభా ప్రాతిపదికన..
జనాభా ప్రతిపదికన అంగన్‌వాడీ కేంద్రాలను ప్రభుత్వం అప్‌గ్రేడ్ చేయనుంది. ఇప్పటి వరకు వెయ్యి మంది జనాభా ఉన్న చోట అంగన్‌వాడీ సెంటర్‌తోపాటు మినీ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. మెయిన్ సెంటర్‌లో ఉన్న వసతులు, సౌకర్యాలు మినీ సెంటర్లలో లేవు. ఈ క్రమంలో మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. చిన్నారుల సంఖ్యనుబట్టి ఈ చర్యలను చేపట్టనుంది. జనాభా ఎక్కువ ఉన్న ప్రాంతాలను గుర్తించి ఆయా కేంద్రాలను మెయిన్ సెంటర్లుగా మార్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
జిల్లా వ్యాప్తంగా 644 కేంద్రాలు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా 11 మండలాల్లో రెండు ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇందులో ఒకటి భూపాలపల్లి కాగా మరొకటి మహదేవపూర్‌లో ఉన్నాయి. వీటి పరిధిలో మొత్తంగా 644 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. భూపాలపల్లి ప్రాజెక్టు పరిధిలో 375 మెయిన్ కేంద్రాలు, 42 మినీ కేంద్రాలు ఉన్నాయి. అలాగే మహదేవపూర్ ప్రాజెక్టు పరిధిలో 214 మెయిన్ కేంద్రాలు, 13 మినీ కేంద్రాలు ఉన్నాయి. వీటిల్లో అప్‌గ్రేడ్ చేయాల్సిన అంగన్‌వాడీ కేంద్రాలను సర్వే చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్లు అధికారులు వెల్లడించారు.
హెల్పర్ పోస్టుల భర్తీకి అవకాశం
అంగన్‌వాడీ కేంద్రాల అప్‌గ్రేడ్‌తో జిల్లాకు కొత్తగా ఏర్పడే సెంటర్లలో హెల్పర్ల పోస్టులు భర్తీ అయ్యే అవకా శం ఉంది. మినీ సెంటర్లలో పనిచేసే టీచర్లు మెయిన్ టీచర్లుగా ప్రమోటై వారికి జీతాలు కూడా పెరుగను న్నాయి. దీంతో మినీ సెంటర్ల నిర్వాహకుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా మినీ సెంటర్లలో హెల్పర్లు లేకుండా ఒక అంగన్‌వాడీ టీచరే నెట్టుకొస్తున్నారు. అన్నీ తామై చూసుకుంటున్నారు.
అన్ని కేంద్రాలతో ప్రతిపాదనలు
ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాల ప్రకారం సర్వే చేసిన అధికారులు జిల్లా వ్యాప్తంగా ఉన్న 55 మినీ కేంద్రాలను అప్‌గ్రేడ్ చేయాలని కోరతూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ప్రస్తుతం నడుస్తున్న ఈ మినీ కేంద్రాలన్నీ దాదాపు అప్‌గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అయితే.. ప్రభుత్వం ఎన్ని కేంద్రాలను అప్‌గ్రేడ్ చేస్తుందోనని వేచి చూడాల్సిందే నని అంటున్నారు. ప్రభుత్వం ఆమోదం తెలిపితే మినీ కేంద్రాలన్నీ మెయిన్ కేంద్రాలుగా రూపుదిద్దుకొని చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు సేవలు మరింత చేరువకానున్నాయని తెలిపారు. మరింత మెరుగైన పౌష్టికాహారం కూడా అందనుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం : కె.శామ్యూల్, సంక్షేమ శాఖ జిల్లా ఇన్‌చార్జి అధికారి
ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం జిల్లా వ్యాప్తంగా ఉన్న మినీ సెంటర్ల వివరాల న్నింటినీ ప్రభుత్వానికి నివేదికలు పంపించాం. ప్రభుత్వ ఆమోదంతో మినీ సెంటర్లన్నీ మెయిన్ సెంటర్లుగా మారుతాయి. మన జిల్లాలో ఉన్న 55 సెంటర్ల వివరాలను పంపించాం. ప్రభుత్వం ఎన్ని సెంటర్లకు ఆమోదం తెలుపుతుందనేది తెలియాల్సి ఉంది.
Updated Date - 2022-10-18T05:20:21+05:30 IST