అన్మ్యాన్డ్ వర్కర్ల అరిగోస
ABN, First Publish Date - 2022-10-17T05:47:59+05:30
నార్తర్న్ పవర్ డిస్టిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఎన్పీడీసీఎల్)లో అన్మ్యాన్డ్ వర్కర్లుగా పనిచేస్తున్నవారి పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. ప్రాణాలు ఫణంగా పెట్టిచాకిరీ చేస్తున్నప్పటికీ సంస్థ వారిని చిన్నచూపు చూస్తోంది. ఏళ్ల తరబడి పనిచేస్తున్నా పర్మినెంట్ చేయడం లేదు. విధి నిర్వహణలో విద్యుదాఘాతానికి గురై మృతి చెందిన వారి కుటుంబాల పరిస్థితి మరీ హృదయవిదారకం. పెద్ద దిక్కుకోల్పోవడంతో ఈ కుటుంబాలు వీధిన పడ్డాయి. క్షతగాత్రులు జీవచ్ఛవంలాగా బతుకుతుంటే మృతుల కుటుంబాలు తినేందుకు తిండిలేక పస్తులుంటున్నాయి. విద్యుదాఘాతానికి గురై వెన్నుపూస చచ్చుపడి పడకకే పరిమితమైన తన కుమారుడు జాగిళ్లపురం రమేష్‌ను పేదలమైన తాము సాకలేమని ఆయన తల్లిదండ్రులు ఈనెల 10న ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం ఎదుట వదిలేసిన సంఘటన అన్మ్యాన్డ్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్ల దయనీయ స్థితికి అద్దం పడుతోంది.
ఎన్పీడీసీఎల్లో ఏళ్ల తరబడి విధులు
జీతం తక్కువ.. చాకిరీ ఎక్కువ
పర్మినెంట్ లేదు.. పీఎఫ్ లేదు..
ప్రాణాలను పణంగా పెట్టి విధులు
విద్యుదాఘాతంతో 60 మంది మృతి
150 మంది తీవ్రగాయాల పాలు
పట్టించుకోని యాజమాన్యం
నార్తర్న్ పవర్ డిస్టిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఎన్పీడీసీఎల్)లో అన్మ్యాన్డ్ వర్కర్లుగా పనిచేస్తున్నవారి పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. ప్రాణాలు ఫణంగా పెట్టిచాకిరీ చేస్తున్నప్పటికీ సంస్థ వారిని చిన్నచూపు చూస్తోంది. ఏళ్ల తరబడి పనిచేస్తున్నా పర్మినెంట్ చేయడం లేదు. విధి నిర్వహణలో విద్యుదాఘాతానికి గురై మృతి చెందిన వారి కుటుంబాల పరిస్థితి మరీ హృదయవిదారకం. పెద్ద దిక్కుకోల్పోవడంతో ఈ కుటుంబాలు వీధిన పడ్డాయి. క్షతగాత్రులు జీవచ్ఛవంలాగా బతుకుతుంటే మృతుల కుటుంబాలు తినేందుకు తిండిలేక పస్తులుంటున్నాయి. విద్యుదాఘాతానికి గురై వెన్నుపూస చచ్చుపడి పడకకే పరిమితమైన తన కుమారుడు జాగిళ్లపురం రమేష్‌ను పేదలమైన తాము సాకలేమని ఆయన తల్లిదండ్రులు ఈనెల 10న ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం ఎదుట వదిలేసిన సంఘటన అన్మ్యాన్డ్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్ల దయనీయ స్థితికి అద్దం పడుతోంది.
హనుమకొండ, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి) : ఎన్పీడీసీఎల్ సీఎండీగా కార్తికేయ మిశ్రా ఉన్న సమయంలో అన్మ్యాన్డ్ వర్కర్ వ్యవస్థ అమలులోకి వచ్చింది. 2013 నుంచి వీరు పనిచేస్తున్నారు. విద్యుత్ లైన్మెన్ కింద సహాయకులుగా పని చేసేందుకు ఈ అన్మ్యాన్డ్ డిస్ట్రిబ్యూషన్ కార్మికులను నియమించారు. అన్మ్యాన్డ్ అంటే అన్‌స్కిల్డ్ అని అర్థం. ఎన్పీడీసీఎల్లో పనిచేస్తున్న అన్మ్యాన్డ్ కార్మికుల్లో దాదాపు అందరూ ఐటీఐ, డిప్లొమా చేసిన స్కిల్డ్ వర్కర్లే. ఫ్యూజులు వేయడం, నెలలో 25 ట్రాన్స్ఫార్మర్లు (డీటీఆర్) మరమ్మతు చేయడం వీరి పని.
వెట్టిచాకిరి
అన్మ్యాన్డ్ డిస్ట్రిబ్యూషన్ కార్మికులు రాత్రింబవళ్ళు చా కిరి చేస్తున్నారు. కరెంట్ పనులన్నిటినీ వీరితోనే చేయిస్తున్నారు. ఎక్కడ కరెంట్ సరఫరా నిలిచిపోయినా వీరు వెళ్లాల్సిందే. చాలీచాలనీ జీతంతో అతికష్టం మీద కుటుంబాలను నెట్టుకువస్తున్నారు. అన్మ్యాన్డ్ కార్మికులకు ఇచ్చే వేతనం కూడా చాలా తక్కువ. మొదట్లో వీరికి వేతనంలో కోతలు లేకుండా రూ.4వేలు ఇచ్చేవారు. ఆ తర్వాత వేత నం రూ8వేలకు పెంచారు. ఎంతో పోరాటం చేసిన తర్వా త ప్రస్తుతం రూ. 14,727 ఇస్తున్నారు. కోతలు పోను చివరికి వారికి చేతికి అందేది రూ.8,440 మాత్రమే. కాంట్రాక్ట ర్లు కమీషన్ పేరుతో వీరి వేతనాల నుంచి మరికొంత మినహాయించుకుంటున్నారు. ఈ వేతనాలు కూడా నెలనెలా సక్రమంగా చెల్లించడం లేదు. అది కూడా ఆరు నెలలకు ఒకసారి చెల్లిస్తున్నారు. పీఎఫ్, ఈఎ్‌సఐ వంటి సౌకర్యాలు వర్తించడం లేదు.
పోల్ పనులు
వాస్తవానికి అన్మ్యాన్డ్ వర్కర్లను విద్యుత్ స్తంభాలు ఎక్కించే పనిచేయించకూడదు. కానీ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా బలవంతంగా విద్యుత్ స్తంభాలను ఎక్కిస్తున్నారు. ట్రాన్స్ఫార్మర్లకు మరమ్మతులు చేయిస్తున్నారు. విద్యుత్ మరమ్మతు పనులు చేయించేప్పుడు అధికారులు తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవడం లేదు. ఈ సందర్భంగా తప్పుడు ఎల్సీలు ఇవ్వడంతో విద్యుత్ షాక్‌కు గురై ప్రాణాలు వదులుతున్నారు. తీవ్రంగా కాలి గాయపడుతున్నారు. ఒక వేళ ప్రమాదం జరిగితే సంబంధిత అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని నిమామక నిబంధనల్లో సంస్థ స్పష్టంగా పేర్కొన్నది.
మృత్యువాత
విధి నిర్వహణలో అన్మ్యాన్డ్ కార్మికులు తరుచూ ప్రమాదాలకు గురై మృత్యువాత పడుతున్నారు. అనేకమంది తీవ్రంగా గాయాలపాలవుతున్నారు. ఎన్పీడీసీఎల్ పరిధిలో ఇప్పటి వరకు సుమారు 60 మంది చనిపోయారు. మరో 150 మంది తీవ్రంగా గాయపడి లేవలేని స్థితిలో దుర్భర జీవితలు గుడుపుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో గాయాలపాలైనవారు 30మంది కాగా, మృతిచెందిన వారు 15 మంది వరకు ఉన్నారు. వరంగల్ కరీమాబాద్‌లో వారం కిందట కునమల్ల శంకర్ అనే అన్మ్యాన్డ్ వర్కర్ ఇలాగే కరెంట్ షాక్‌కు గురై మృత్యువాతపడ్డాడు.
పీఎఫ్ లేదన్న సాకుతో..
అన్మ్యాన్డ్ వర్కర్లకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ వారి సర్వీ్‌సను రెగ్యులర్ చేయడం లేదు. ఎన్పీడీసీఎల్లో మిగతా కాంట్రాక్ట్ వర్కర్లతో సమానంగా వీరు విధులు నిర్వర్తిస్తున్నారు. సీఎం కేసీఆర్ హామీ మేరకు 2016 డిసెంబర్ 4 కటాఫ్ తేదీతో ఎన్పీడీసీఎల్లోని 23,600 మంది ఆర్టిజన్ కార్మికులను రెగ్యులర్ చేశారు. ఆన్మ్యాన్డ్ వర్కర్లు 2013 నుంచి పనిచేస్తున్నప్పటికీ ప్రావిడెండ్ ఫండ్ (పీఎఫ్) అమలుకావడం లేదన్న ఒకే ఒక్క కారణంతో వారిని మాత్రం పర్మినెంట్ చేయలేదు. ఎస్పీడీసీఎల్ మాత్రం మొదటి నుంచి పీఎఫ్ అమలుకావడంతో అక్కడ మాత్రం అన్మ్యాన్డ్ వర్కర్లను రెగ్యులర్ చేశారు. అప్పటి నుంచి అన్మ్యాన్డ్ వర్కర్లు తమను రెగ్యులర్ చేయాలని పోరాడుతూనే ఉన్నా ఫలితం లేకుండా పోతోంది. రూ.8 వేల నుంచి రూ.14 వేలకు వేతనం పెంచినప్పటి నుంచి తమకు పీఎఫ్ అమలవుతున్న దృష్ట్యా ఇప్పుడైనా తమను పర్మినెంట్ చేయాలని కోరుతున్నారు.
పర్మినెంట్ ఎప్పుడు?
అన్మ్యాన్డ్ కార్మికులు తమ సమస్యలపై చాలాకాలంగా పోరాడుతున్నారు. అయినా ఎన్పీడీసీఎల్ వా రి గోడును పట్టించుకోవడం లేదు. ఐటీఐ, డిప్లొమా విద్యార్హతను బట్టి స్కిల్డ్, ఇతర విద్యార్హతలను బట్టి అన్‌స్కిల్డ్ వర్కర్లుగా విభజించి ఆర్టిజన్ కార్మికులుగా గుర్తించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సమానపనికి సమాన వేతనం ఇవ్వడంతో పాటు సబ్స్టేషన్లలో ఖాళీగా ఉన్న ఆపరేటర్ పోస్టులను అన్మ్యాన్డ్ వర్కర్లతో భర్తీ చేయాలని కోరుతున్నారు. ప్రస్తుతం సబ్స్టేషన్లలో ఆపరేటర్లుగా పనిచేస్తున్న రిటైర్డ్ ఉద్యోగులను తొలగించి అన్మ్యాన్డ్ వర్కర్లకు అవకాశం కల్పించాలని అభ్యర్ధిస్తున్నారు. ఎన్పీడీసీఎల్ పరిధిలోని అన్మ్యాన్డ్డ్ కార్మికులను (కట్టర్స్)ను ఆర్టిజన్ కార్మికులు మాదిరిగానే, అన్మ్యాన్డ్ వర్కర్లను ఆర్టిజన్ కార్మికులుగా గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రమాదంలో మరణించిన అన్మ్యాన్డ్ కార్మికుల కుటుంబాలకు పరిహారం చెల్లించి, వారి కుటుంబసభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కోరుతున్నారు. వేతనాలను ప్రతీనెల క్రమం తప్పకుండా చెల్లించాలని, వేతనాలను కార్మికుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని, జూనియర్ లైన్మెన్ నియామకాల్లో ఆన్మ్యాన్డ్ వర్కర్ల సీనియారిటీ ప్రకారం వెయిటేజ్ మార్కులు కేటాయించాలని కోరుతున్నారు.
మొత్తం 1,488 మంది
ఎన్పీడీసీఎల్ పరిధిలో ఉమ్మడి వరంగల్‌తో పాటు నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో మొత్తం 1,488 మంది అన్మ్యాన్డ్ వర్కర్లు పని చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో 614 మంది అన్మ్యాన్డ్ కార్మికులు పని చేస్తున్నారు. హనుమకొండలో 180 మంది, వరంగల్‌లో 131 మంది, ములుగు, జయశంకర్ భూపాలపల్లిలో కలిపి 99 మంది. జనగామలో 75 మంది, మహబూబాబాద్‌లో 129 మంది విధులు నిర్వహిస్తున్నారు. ఎన్పీడీసీఎల్ పరిధిలోని మిగతా జిల్లాలైన ఉమ్మడి ఖమ్మం జిల్లా లో 137 మంది, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 344 మంది, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 92 మంది, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 302 మంది ప్రస్తుతం పని చేస్తున్నారు.
Updated Date - 2022-10-17T05:47:59+05:30 IST