ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముందస్తు ఉండదు

ABN, First Publish Date - 2022-07-16T08:34:39+05:30

తెలంగాణలో ఎన్నికలు షెడ్యూలు ప్రకారం వచ్చే ఏడాది డిసెంబరులోనే జరుగుతాయని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మున్సిపల్‌, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • షెడ్యూలు ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు
  • తేదీ ప్రకటిస్తే మాత్రం రద్దుకు సిద్ధమే
  • ప్రధాని మోదీ చేతుల్లో ఎన్నికల సంఘం
  • అన్ని వ్యవస్థలు వాళ్ల చేతుల్లోనే ఉన్నాయి
  • సీఎంగా కేసీఆర్‌ హ్యాట్రిక్‌ కొట్టడం ఖాయం
  • దక్షిణాదిలోనే రికార్డు.. మా సర్వేలో 90 సీట్లు
  • బీజేపీ, కాంగ్రెస్‌ సర్వేల్లోనూ మాదే గెలుపు
  • ఈడీ, మోడీ; జుమ్లా, హమ్లా.. ఇదే  డబులింజన్‌
  • రూపాయి పతనంపై మోదీ ఏం చెబుతారు
  • ఎన్నికల్లో మాకు ఒక్కో చోట ఒక్కో ప్రత్యర్థి
  • రాహుల్‌, రేవంత్‌ సొంత సీట్లలోనే గెలవలేరు
  • కాంగ్రెస్‌ను ఏదో ఒక పార్టీ భర్తీ చేయాల్సిందే
  • మీడియాతో చిట్‌చాట్‌లో మంత్రి కేటీఆర్‌


హైదరాబాద్‌, జూలై 15 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో ఎన్నికలు షెడ్యూలు ప్రకారం వచ్చే ఏడాది డిసెంబరులోనే జరుగుతాయని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మున్సిపల్‌, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. ఎన్నికల తేదీని ప్రకటిస్తే మాత్రం అసెంబ్లీని రద్దు చేస్తామని, ముందస్తుకు సిద్ధమేనని చెప్పారు. ‘‘ఎన్నికల సంఘం ప్రధాని మోదీ చేతుల్లో ఉంది. ఇదే కాదు. అన్ని వ్యవస్థలూ వాళ్ల చేతుల్లోనే ఉన్నాయి. ప్రభుత్వాన్ని రద్దు చేసిన తర్వాత ఆరు నెలల్లోపు ఎన్నికలు పెట్టాలి. ఒక నెలలో పెట్టొచ్చు. ఆరు నెలల్లో పెట్టొచ్చు. ఒక్కోసారి అసలు పెట్టకపోవచ్చు కూడా’’ అని ఆరోపించారు. తన నివాసంలో

 శుక్రవారం ఆయన మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ హ్యాట్రిక్‌ కొట్టడం ఖాయమని, దక్షిణాదిలోనే హ్యాట్రిక్‌ సీఎంగా కేసీఆర్‌ రికార్డు సృష్టిస్తారని చెప్పారు. ‘‘కరుణానిధి, జయలలిత, ఆఖరికి ఎన్టీఆర్‌, తర్వాత చంద్రబాబు, వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి.. ఎవరూ వరుసగా మూడుసార్లు ముఖ్యమంత్రులుగా ఎన్నికవలేదు. దక్షిణాదిన ఆ ఘనత ను కేసీఆర్‌ సాధిస్తారు’’ అని ధీమా వ్యక్తం చేశారు. తొలుత బీజేపీ ఒక సర్వేను విడుదల చేయించిందని, ఆ తర్వాత వచ్చిన సర్వే కాంగ్రెస్‌ చేయించిందని, ఆ రెండింట్లోనూ గెలుపు టీఆర్‌ఎ్‌సదేనని వచ్చిందని తెలిపారు. ఇప్పుడు ఇలా చెప్పి కొన్ని నెలలయ్యాక పరిస్థితి మారిపోయిందని, కాంగ్రెస్సే గెలుస్తుందని ఆ పార్టీ చెబుతుందని ఎద్దేవా చేశారు. తమ పార్టీ చేయించిన ఫీడ్‌ బ్యాక్‌ సర్వేలో 90 సీట్లు టీఆర్‌ఎ్‌సకేనని తేలిందన్నారు. 90 లక్షల ఓట్లు రాకపోతే పేరు మార్చుకుంటానని రేవంత్‌ సవాల్‌ విసిరిన విషయాన్ని ప్రస్తావించగా.. గతంలో కొడంగల్‌లో ఓడినప్పుడు కూడా రాజకీయ సన్యాసం తీసుకుంటానని మాట తప్పారని విమర్శించారు. రాజకీయ సన్యాసం విషయంలో మాటమీద నిలబడింది లగడపాటి ఒక్కరేనని కేటీఆర్‌ అన్నారు. 


డబుల్‌ ఇంజిన్‌ అంటే ఈడీ, మోడీ

డబుల్‌ ఇంజన్‌ ప్రభుత్వమంటూ బీజేపీ ప్రచారం చేయడాన్ని మంత్రి కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. ‘‘డబుల్‌ ఇంజన్‌ అంటే ఈడీ, మోడీ! లేకపోతే, జుమ్లా, హమ్లా! మోదీ గుజరాత్‌కు మాత్రమే ప్రధాని. ఆయన పచ్చి అబద్ధాలు చెబుతారు. హైదరాబాద్‌లో రూ.1500 కోట్లతో ఫ్లై ఓవర్లు కట్టామని పరేడ్‌ గ్రౌండ్స్‌లో చెప్పారు. ఎవరికీ కనిపించకుండా వాటిని కట్టారా? ’’ అని ఎద్దేవా చేశారు. ‘‘మోదీ నీతులు చెబుతారు. కానీ, బంగ్లాదేశ్‌, బర్మా, శ్రీలంకల్లో కరెన్సీ విలువ పడిపోలేదు. ఒక్క రూపాయి విలువే పడిపోయింది. దీనికి అవినీతే కారణమని గతంలో మోదీ ట్వీట్‌ చేశారు. మరిప్పుడు రూపాయి విలువ డాలర్‌ ముందు ఎన్నడూ లేనంత దిగజారి రూ.80కి పడిపోయింది. మోదీ ఇప్పుడేం చెప్తారు?’’ అని నిలదీశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక 67 ఏళ్లలో అందరు ప్రధానులూ కలిసి 56 లక్షల కోట్లు అప్పులు చేస్తే.. మోదీ ఒక్కరే ఎనిమిదేళ్లలో 100 లక్షల కోట్లు అప్పు చేశారని, ‘‘మనసున్న ప్రధాని అయితే ఇప్పటి వరద విపత్తు కోసం అడ్వాన్సుగా నిధులివ్వాలి. గతంలో గుజరాత్‌కు వెయ్యి కోట్లు ఇచ్చారు. కర్ణాటకకు 994 కోట్లు ఇచ్చారు. గతంలో హైదరాబాద్‌ వర్షాలప్పుడు అన్ని నివేదికలూ ఇచ్చాం. ఒక్క రూపాయి కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు’’ అని తప్పుబట్టారు.


కూల్చడం అహంకారానికి నిదర్శనం

టీఆర్‌ఎ్‌సను చీలుస్తామని, కూలుస్తామని బీజేపీ నేతలు అంటున్నారని, అది వారి అహంకారానికి నిదర్శనమని కేటీఆర్‌ మండిపడ్డారు. మధ్యప్రదేశ్‌ నుంచి మహారాష్ట్ర వరకు 9 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చారని ధ్వజమెత్తారు. కేసీఆర్‌ ఎవరికీ భయపడరని, ఎవరికీ లొంగరని స్పష్టం చేశారు. ‘‘పార్లమెంటులో జుమ్లా జీవి, సిగ్గుచేటు వంటి పదాలను అనొద్దన్నారట. మరి పార్లమెంటులో నిరసన వ్యక్తం చేస్తున్న వారిని ప్రధాని మోదీ ఆందోళన్‌ జీవి అన్నారు. బీజేపీ సీఎం ఒకరు గోలీమారో సాలొంకో అన్నారు. కానీ, సిగ్గుచేటు అనొద్దట’’ అని ఎద్దేవా చేశారు. పైథాగరస్‌ సిద్ధాంతం తప్పంటూ కర్ణాటకలో పాఠ్యపుస్తకాల్లో పెట్టారని, చిన్నప్పటి నుంచీ చదువుకున్న దానిని మార్చేశారని తప్పుబట్టారు. ‘‘మాంసం తినకూడదని పెట్టారు. భిన్నత్వంలో ఏకత్వం ఉన్న దేశంలో ఏది తినాలో ఏది తినకూడదో చెప్పేందుకు వీళ్లెవరు? తాజ్‌మహల్‌ కట్టేందుకు షాజహాన్‌ టెండర్లు పిలిచారా? అని గోవా సీఎం ప్రశ్నించారు. ఆయన పేరే చెప్పి టెండర్లు పిలవరేమో’’ అని దుయ్యబట్టారు.


జీతాల ఆలస్యం సాధారణమే

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాల చెల్లింపు ఆలస్యమవుతోందన్న విలేకరుల ప్రశ్నకు స్పందిస్తూ.. జీతాలు ఆలస్యం కావడం సాధారణమేనని, అది పెద్ద విషయం కాదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. తెలంగాణలో ఉద్యోగులకు 73 శాతం జీతాలు పెంచామని, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువ పెరిగాయని చెప్పారు. ధరణిలో ఉన్న లోపాలను సవరిస్తామని, దాన్ని రద్దు చేస్తామనడం అర్థరహితమని తప్పుబట్టారు. వరదలకు పంప్‌హౌజ్‌లు మునగడంపై ప్రశ్నించగా.. గతంలో కాంగ్రెస్‌ పాలనలో కల్వకుర్తిలో పంపుహౌజ్‌ మునిగిందని గుర్తు చేశారు. తెలంగాణలో వరదలు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వల్లే అంటున్న నడ్డా.. ఉత్తరాఖండ్‌ వరదలు బీజేపీ వల్లేనా? చెప్పాలన్నారు.


వరదల్లో ఉంటే తనిఖీ బృందాలా? 

రాష్ట్రం ఓవైపు వరదలతో అతలాకుతలం అవుతుంటే.. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పనులను తనిఖీ చేసేందుకు బృందాల్ని పంపుతుందా? అని మంత్రి కేటీఆర్‌  మండిపడ్డారు. రైతులకు ధాన్యం ఫ్లాట్‌ఫాములను కట్టడం కూడా తప్పంటే ఎలా? అని ప్రశ్నించారు. శత్రు దేశంపై ఆర్థిక ఆంక్షలు విధించినట్లు తెలంగాణపై విధిస్తున్నారని, రెండేళ్ల కిందటి అప్పులను కూడా లెక్కల్లోకి తీసుకుని భవిష్యత్తు అప్పులకు పరిమితులంటున్నారని మండిపడ్డారు. ‘‘కేంద్రానికి సిగ్గు, మానం ఉందా? ఇక్కడేమో ధాన్యం కొనేది లేదంటారు. దేశంలో ధాన్యం సాగు చేయాలంటారు. సర్కారును నడిపిస్తున్నారా? సర్కస్‌ చేస్తున్నారా?’’ అని ధ్వజమెత్తారు. ‘పల్లె గోస.. బీజేపీ భరోసా’ అంటూ యాత్ర చేస్తున్నారని, తెలంగాణలో పల్లెలు గోస పెట్టడం లేదని, బీజేపీ రాష్ట్రాల్లోనే పల్లె గోస పెడుతోందని విమర్శించారు. దేశానికి తెలంగాణ రూపాయి ఇస్తే.. దేశం తెలంగాణకు తిరిగి 46 పైసలే ఇచ్చిందని, ఇది తప్పయితే ముక్కు నేలకు రాస్తానని, లేకుంటే రాజీనామాకు సిద్ధమని కేటీఆర్‌ మరోసారి సవాల్‌ విసిరారు. జీఎ్‌సడీపీ, అప్పుల నిష్పత్తిలో తెలంగాణ 23వ స్థానంలో ఉందని, అన్నీ జాగ్రత్తగా చేయబట్టే అలా ఉందని చెప్పారు.


మాకు ఒక్కో చోట ఒక్కో ప్రత్యర్థి

వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎ్‌సకు ప్రధాన ప్రత్యర్థి ఎవరన్న విలేకరుల ప్రశ్నకు.. ‘‘మేం అన్నిచోట్లా బలంగా ఉన్నాం. మాకు ఒక్కోచోట ఒక్కో పార్టీ ప్రత్యర్థిగా ఉంటుంది’’ అని కేటీఆర్‌ చెప్పారు. టీఆర్‌ఎ్‌సలో అసంతృప్తులు, గొడవలు పెరుగుతున్నాయిగా అని ప్రశ్నించగా.. అది పార్టీ బలానికి నిదర్శనమన్నారు. ‘‘అందరితోనూ మాట్లాడుతున్నాం. సర్దుబాటు చేస్తున్నాం. టీఆర్‌ఎస్‌ పుట్టాక ఎంతోమంది చేరారు. ఇక్కడ అవకాశాలు లేవనుకున్నవాళ్లు వెళ్లిపోతారు. దాన్నేం తప్పుబట్టను. కొందరు వస్తారు. కొందరు వెళ్తారు. అది సహజమే’’ అని అన్నారు. కొత్త ఫించన్లు, కొత్త రేషన్‌ కార్డులు, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను త్వరలోనే ఇస్తామని, ఎవరూ అడగకుండానే వాటిని ఇస్తామని తెలిపారు. 


కాంగ్రెస్‌లో మిగిలేదెవరు!?

రాహుల్‌, రేవంత్‌ తమ సొంత స్థానాల్లోనే గెలవలేరని, వీరిద్దరూ సిరిసిల్ల వచ్చి అక్కడ కాంగ్రెస్‌ను గెలిపిస్తారా? అని మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు. రాహుల్‌ సిరిసిల్లలో 3 రోజులుండి అక్కడ అభివృద్ధి చూసి.. దానిని తన నియోజకవర్గంలోనూ అమలు చేయాలని సూచించారు. ‘‘రమ్మనండి.. వచ్చి నేర్చుకోమనండి’’ అని అన్నారు. ఇక, కాంగ్రెస్‌కు త్వరలోనే ఎదురుదెబ్బలు తగులుతాయన్నారు. ‘‘హిమాచల్‌ ప్రదేశ్‌, కర్ణాటక, గుజరాత్‌ల్లో కాంగ్రెస్‌ ఓడిపోతుంది. ఇక రాహుల్‌ గాంధీ నాయకత్వంలో ఆ పార్టీలో మిగిలేదెవరు? ఆ పార్టీ స్థానాన్ని ఎవరో ఒకరు భర్తీ చేయాల్సిందే’’ అని వ్యాఖ్యానించారు.

Updated Date - 2022-07-16T08:34:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising