ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పార్లమెంట్‌ను అడ్డుకోండి

ABN, First Publish Date - 2022-01-31T07:29:50+05:30

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు సరైన కేటాయింపులు లేకపోతే పార్లమెంట్‌ సమావేశాలను అడ్డుకోవాలని టీఆర్‌ఎస్‌ ఎంపీలను ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. రాష్ట్రానికి అన్యాయం జరిగితే సహించవద్దన్నారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 రాష్ట్రానికి అన్యాయం జరిగితే సహించవద్దు

బీజేపీ సర్కారును ఉపేక్షించాల్సినవసరం లేదు

రాష్ట్రానికి రావాల్సిన నిధులపై పట్టుబట్టాలి

బీజేపీయేతర పార్టీల ఎంపీలతో కలిసి పోరాడండి

రాష్ట్రంలోనూ క్షేత్రస్థాయిలో పోరాటం చేస్తాం

నేడు రైల్వే జీఎం కార్యాలయం ఎదుట ధర్నా

‘దళితబంధు’ జాతీయ అమలుకు నిలదీయండి

పెండింగ్‌ నిధుల విడుదలకు పట్టుబట్టండి

టీఆర్‌ఎస్‌ ఎంపీలకు సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం

35 అంశాలపై చర్చ.. ఎంపీలకు బుక్‌లెట్ల పంపిణీ


హైదరాబాద్‌, జనవరి 30 (ఆంఽధ్రజ్యోతి): కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు సరైన కేటాయింపులు లేకపోతే పార్లమెంట్‌ సమావేశాలను అడ్డుకోవాలని టీఆర్‌ఎస్‌ ఎంపీలను ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. రాష్ట్రానికి అన్యాయం జరిగితే సహించవద్దన్నారు. సోమవారం పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆదివారం ప్రగతి భవన్‌లో టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘బీజేపీ సర్కారు రాష్ట్రానికి చేసిందేమీ లేదు. ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్లినా ప్రయోజనం లేదు. నేను స్వయంగా అనేకసార్లు ప్రధానమంత్రిని కలిశాను. లేఖలు ఇచ్చాను. కేంద్రమంత్రులను కలిశాను. అయినా సమస్యలకు పరిష్కారం దొరకలేదు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కేంద్రంలోని బీజేపీ సర్కారును ఉపేక్షించాల్సిన అవసరం లేదు. గట్టిగా నిలదీయాల్సిందే. మన రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన నిధుల కోసం పట్టుబట్టాల్సిందే. ఈ విషయంలో కలిసివచ్చే బీజేపీయేతర రాష్ట్రాల ఎంపీలతో మాట్లాడండి. వారిని కూడా కలుపుకొని పోవాలి. ఇదే సమస్యను చాలా రాష్ట్రాలు ఎదుర్కొంటున్నాయి. బీజేపీయేతర రాష్ట్రాలు కేంద్ర వివక్షకు గురవుతున్నాయి. వారితో కూడా సంప్రదింపులు జరపండి. వారితో కలసి పోరాటం చేయండి. పార్లమెంట్‌ జరిగే సమయంలో రాష్ట్రంలోనూ ఆందోళనలు చేస్తాం. సోమవారం సికింద్రాబాద్‌లో దక్షిణమధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ కార్యాలయం ముందు భారీ ధర్నా నిర్వహిస్తాం. ఇక్కడ క్షేత్రస్థాయిలో పోరాటం చేస్తాం. మీరక్కడ పార్లమెంట్‌లో కేంద్రాన్ని నిలదీయండి’’ అని సీఎం కేసీఆర్‌ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. 


దళితబంధుకు సహకారం కోరండి..

కాళేశ్వరానికి జాతీయ హోదా, రాష్ట్రం నుంచి పన్నుల రూపేణా కేంద్రానికి పోతున్న నిధులు, తెలంగాణకు ఇస్తున్న నిధులపై గట్టిగా నిలదీయాలని ఎంపీలను సీఎం ఆదేశించారు. దళితబంధు పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాల్సిందిగా కేంద్రాన్ని డిమాండ్‌ చేయాలన్నారు. దీనికి కేంద్రం సహకారం కావాలని అడగాలన్నారు. కంటోన్మెంట్‌ స్థలం, రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీ మంజూరు, నిధులు, చెరువుల అభివృద్ధి కోసం కేంద్రం నుంచి నిధులు రావడం లేదని, దీనిపై కూడా నిలదీయాలని అన్నారు. బడ్జెట్‌లో తెలంగాణకు కేటాయింపులకు అనుగుణంగా పార్లమెంట్‌లో తమ వ్యుహం ఉండాలని చెప్పారు. నిధుల కేటాయింపుల పట్ల నిర్లక్ష్యం చూపితే సమావేశాలను అడ్డుకోవాలని, అవసరమైతే బహిష్కరించాలని అన్నారు. రాష్ట్రానికి జీఎస్టీ రూపంలో రూ.2918 కోట్లు రావాల్సి ఉందని, 14వ ఫైనాన్స్‌ నిధులు రూ.965 కోట్లు, 15వ ఫైనాన్స్‌ స్పెషల్‌ ఫండ్‌ రూ.965 కోట్లు, నేషనల్‌ ఎకానమీ నిధులు రూ.2714 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని సీఎం గుర్తు చేశారు. వీటి విడుదల కోసం పార్లమెంట్‌ వేదికగా పోరాటం చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ బిల్లు, బయ్యారం ఉక్కు, రైల్వేకోచ్‌ పరిశ్రమ, వెనుకబడిన ప్రాంతాలకు రావాల్సిన నిధులు, రీజనల్‌ రింగ్‌రోడ్ల నిధులు, రైల్వే పెండింగ్‌ ప్రాజెక్టుల గురించి ప్రస్తావించాలని ఆదేశించారు. 21 కొత్త జిల్లాల్లో నవోదయ, కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు సంబంధించిన అంశాలను కూడా ప్రస్తావించాలన్నారు. ఢిల్లీలో తెలంగాణ భవన్‌ నిర్మాణానికి ఇంతవరకు స్థలం కేటాయించలేదని, దీనిపై కూడా ప్రశ్నించాలని సూచించారు. 


బడ్జెట్‌ చూశాక స్పందిస్తాం..

రాష్ట్రానికి రావాల్సిన నిధులపై ఇప్పటికే సీఎం కేసీఆర్‌ కేంద్రానికి పలు లేఖలు రాశారని, బడ్జెట్‌లో వాటికి సంబంధించిన అంశాలు ఉంటాయో, లేదో చూసిన తర్వాత స్పందిస్తామని ఎంపీలు అన్నారు. పార్టీ అధ్యక్షుడితో సమావేశం ముగిసిన అనంతరం ఎంపీలు రంజిత్‌రెడ్డి, నేతకాని వెంకటేశ్‌ మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్‌లో ప్రస్తావించాల్సిన అంశాలపై ఎంపీలకు ఒక బుక్‌లెట్‌ను ముఖ్యమంత్రి అందజేశారని తెలిపారు. గత పార్లమెంట్‌ సమావేశాల్లో వరిధాన్యం కొనుగోలు అంశాన్ని ప్రస్తావించామని, ఈసారి మరింత ఎక్కువగా నిలదీస్తామని అన్నారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు సభలో తమ వాణిని వినిపిస్తామన్నారు. ఈ సమావేశంలో టీఆర్‌ఎస్‌ రాజ్యసభ పక్షనేత కే.కేశవరావు, లోక్‌సభా పక్షనేత నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు, కేఆర్‌ సురేశ్‌రెడ్డి, జోగినిపల్లి సంతో్‌షకుమార్‌, బడుగుల లింగయ్యయాదవ్‌, లోక్‌సభ సభ్యులు బీబీ పాటిల్‌, పి.రాములు, పసునూరి దయాకర్‌, మన్నె శ్రీనివా్‌సరెడ్డి, గడ్డం రంజిత్‌ రెడ్డి, వెంకటేశ్‌ నేత, మాలోత్‌ కవితానాయక్‌, కొత్త ప్రభాకర్‌రెడ్డితో పాటు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, సీఎం ప్రిన్సిపల్‌ సెక్రటరీ నర్సింగరావు, ఆర్థికశాఖ కార్యదర్శి రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. ఆరు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో 35 అంశాలపై చర్చించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. 

Updated Date - 2022-01-31T07:29:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising