11 నుంచి హైదరాబాద్‌లో శ్రీవారి వైభవోత్సవాలు
ABN, First Publish Date - 2022-10-07T09:49:21+05:30
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామికి ఆలయంలో జరిగే నిత్య, వారపు సేవలు, ఉత్సవాలను ఇతర ప్రాంతాల్లోని భక్తులు దర్శించుకునేందుకు వీలుగా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వేంకటేశ్వర వైభవోత్సవాలు నిర్వహిస్తున్నామని
కార్తీకమాసంలో విశాఖ, యాగంటిలో కార్తీక దీపోత్సవాలు: టీటీడీ చైర్మన్
తిరుమల, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామికి ఆలయంలో జరిగే నిత్య, వారపు సేవలు, ఉత్సవాలను ఇతర ప్రాంతాల్లోని భక్తులు దర్శించుకునేందుకు వీలుగా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వేంకటేశ్వర వైభవోత్సవాలు నిర్వహిస్తున్నామని, ఈ నెల 11 నుంచి 15వ తేదీ వరకు హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో ఈ ఉత్సవాలు జరుగనున్నాయని టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమలలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఈ వైభవోత్సవాలకు 10వ తేదీన అంకురార్పణ జరుగుతుందని, ఐదురోజుల పాటు ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు నిత్యకైంకర్యాలు నిర్వహిస్తామని తెలిపారు. కార్తీకమాసంలో గతేడాది తరహాలోనే విశాఖపట్నం, కర్నూలు జిల్లాలోని యాగంటిలో కార్తీక దీపోత్సవాలు నిర్వహిస్తామన్నారు. డిసెంబరులో ప్రకాశం జిల్లా ఒంగోలులో, జనవరిలో ఢిల్లీలో వేంకటేశ్వర వైభవోత్సవాలు నిర్వహిస్తామన్నారు. ఉత్తరాయణంలో చెన్నైలోని పద్మావతీ దేవి ఆలయం, జమ్మూలోని శ్రీవారి ఆలయాలకు మహాసంప్రోక్షణ జరుగుతుందని వివరించారు. అహ్మదాబాద్ నగరంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి గుజరాత్ ప్రభుత్వం ఐదెకరాల స్థలం ఇచ్చిందని, త్వరలో భూమిపూజ చేస్తామన్నారు. ఈ నెలలో అనకాపల్లి, అరకు, రంపచోడవరం ప్రాంతాల్లో శ్రీనివాస కల్యాణాలు నిర్వహిస్తామని వెల్లడించారు.
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుమలలో గురువారం భక్తుల రద్దీ భారీగా పెరిగింది. పెరటాశి మూడవ శనివారంతో పాటు వరుస సెలవులు రావడంతో, బ్రహ్మోత్సవాలు పూర్తయిన క్రమంలో గురువారం ఉదయం నుంచి తిరుమలకు భక్తుల రాక పెరిగింది. ఈ క్రమంలో వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లన్నీ నిండిపోవడంతో పాటు నారాయణగిరి ఉద్యానవనంలోని షెడ్లు కూడా సర్వదర్శన భక్తులతో కిక్కిరిసిపోయాయి.
Updated Date - 2022-10-07T09:49:21+05:30 IST