ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గవర్నర్‌కు మళ్లీ అవమానం!

ABN, First Publish Date - 2022-04-12T06:57:55+05:30

రాజ్‌భవన్‌కు, ప్రగతి భవన్‌కు మధ్య మరింత అగాథం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • కొత్తగూడెంలో స్వాగతం పలకని కలెక్టర్‌, ఎస్పీ 
  • కల్యాణం దాకా ఇద్దరూ అక్కడే.. ఒక్కసారిగా సెలవులో
  • సాధారణంగా ఎదుర్కోలు నుంచి పట్టాభిషేకం దాకా
  • భద్రాచలంలోనే దేవాదాయ శాఖ కమిషనర్‌ 
  • పట్టాభిషేకం రోజున కనిపించని అనిల్‌ కుమార్‌
  • మరోసారి చర్చకు దారి తీసిన ప్రొటోకాల్‌ అంశం


ఖమ్మం/భద్రాచలం, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి): రాజ్‌భవన్‌కు, ప్రగతి భవన్‌కు మధ్య మరింత అగాథం పెరుగుతోంది. గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అధికార పర్యటనలో ప్రొటోకాల్‌ అంశం మరోసారి తెరమీదకు వచ్చింది. గవర్నర్‌ తమిళిసై సోమవారం భద్రాద్రికి విచ్చేసిన సందర్భంగా ముగ్గురు ఉన్నతాధికారులు విధులకు దూరంగా ఉండటం చర్చనీయాంశమవుతోంది. ఆదివారం జరిగిన శ్రీరామనవమి కల్యాణ వేడుకల్లో అన్నీ తామై విధులు నిర్వహించిన భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్‌ అనుదీప్‌, ఎస్పీ సునీల్‌దత్‌, ఐటీడీఏ పీవో గౌతమ్‌ సోమవారం జరిగిన మహాపట్టాభిషేకం కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. దేవాదాయ శాఖ కమిషనర్‌ అనిల్‌ కుమార్‌ కూడా ఎక్కడా కనిపించలేదు. కల్యాణంలో భాగంగా ఎదుర్కోలు నుంచి పట్టాభిషేకం ముగిసేదాకా దేవాదాయ శాఖ కమిషనర్‌ అక్కడే ఉంటారు.


అయితే గవర్నర్‌ పర్యటన నేపథ్యంలో శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం రోజు ఆయన కనిపించకపోవడం గమనార్హం. ఇదంతా గవర్నర్‌కు జరిగిన అవమానమంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం సాగుతోంది. పట్టాభిషేకంతో పాటు సోమ, మంగళ, బుధవారాల్లో తమిళిసై జిల్లాలో పర్యటించే షెడ్యూల్‌ ముందే ఖరారైంది. సోమవారం తెల్లవారుజామున ఆమె రైల్లో కొత్తగూడెం చేరుకోగా.. అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, అడిషనల్‌ ఎస్పీ ప్రసాద్‌, ఆర్డీవో స్వర్ణలత స్వాగతం పలికారు. భద్రాచలం ఆలయం వద్ద ఆలయ ఈవో సహా దేవస్థానం అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో గవర్నర్‌కు స్వాగతం పలికారు. ఇతర అధికారిక కార్యక్రమాల్లో సంబంధిత శాఖల అధికారులు మాత్రమే పాలుపంచుకున్నారు.


కాగా, కలెక్టర్‌, ఎస్పీ, ఐటీడీఏ పీవో.. సోమవారం ఉద్దేశపూర్వకంగా సెలవు పెట్టలేదని ముందే తమ సెలవులను ప్రభుత్వానికి తెలియచేశారని సంబంధిత శాఖల అధికారులు చెబుతున్నారు. అయితే ఇటీవల గవర్నర్‌ మేడారం వెళ్లినప్పుడు, అనంతరం నాగర్‌కర్నూల్‌ చెంచుగూడేలు, యాదాద్రి పర్యటనల సందర్భాల్లోనూ ప్రొటోకాల్‌ నిబంధనలు పాటించలేదని ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు వ్యక్తమయ్యాయి. అయినా గవర్నర్‌ భద్రాద్రి పర్యటన విషయంలో ప్రభుత్వం తీరు మారలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కలెక్టర్‌, జిల్లా ఎస్సీ ఆమెకు స్వాగతం పలకకపోవడంతో పాటు ఎలాంటి రవాణా సదుపాయాలు కల్పించకపోవడం ప్రశ్నార్థకమవుతోంది. తమిళిసై, సమ్మక్క-సారలమ్మ జాతర వెళ్లినప్పుడు హెలికాప్టర్‌ను కేటాయించాలని ప్రభుత్వానికి రాజ్‌భవన్‌ లేఖ రాసినా సమకూర్చలేదు. దీంతో ఆమె రోడ్డు మార్గంలోనే వెళ్లారు. తన పర్యటనల కోసం ప్రభుత్వం హెలికాప్టర్‌ కేటాయించకపోవడాన్ని మొన్న ఢిల్లీ పర్యటనలో తమిళిసై పరోక్షంగా ప్రస్తావించారు.


ఇక మీదట తాను రోడ్డు, రైలు మార్గాల్లోనే పర్యటనలు చేస్తానని వెల్లడించారు. అన్నట్లుగానే ఆదివారం రాత్రి రైల్లోనే వెళ్లి భద్రాద్రికి చేరుకున్నారు. మేడారం, భద్రాద్రి వంటి మావోయిస్టుల ప్రాబల్యమున్న ప్రాంతాల్లో పర్యటనల సందర్భంగా గవర్నర్‌కు హెలికాప్టర్‌ సదుపాయం కల్పించకపోవడం ఏమిటినే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టుల ప్రభావం ఉంటుంది. ఇలాంటి ప్రాంతాలకు వెళ్లినప్పుడైనా.. ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేయాల్సి ఉండిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.




మరోవైపు కొత్తగూడెం జిల్లా  పర్యటనలో భాగంగా గవర్నర్‌ తమిళిసై భద్రాచలంలోని ఓ ఫంక్షన్‌ హాల్లో సోమవారం గిరిజన మహిళల సామూహిక సీమంతం వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సంప్రదాయ పద్ధతిలో ఆ మహిళలకు సారెను అందజేశారు. అనంతరం భద్రాద్రిలోనే రెడ్‌క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో రూ.20 లక్షలతో నిర్మించనున్న వార్డు భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే పోదెం వీరయ్య.. భద్రాద్రి ఆలయాన్ని సీఎం కేసీఆర్‌ పట్టించుకోవడం లేదన్నారు. ‘‘మీరైనా కేంద్రంతో మాట్లాడి భద్రాద్రి అభివృద్ధికి సహకరించండి’’ అని గవర్నర్‌ను కోరారు. కాగా మంగళవారం ఆమె, దమ్మపేట మండలంలోని అదీవాసీ గ్రామైన పూసుకుంటను సందర్శించనున్నారు. 


పూర్వజన్మ సుకృతం: గవర్నర్‌ 

కల్యాణరాముడు పట్టాభిరాముడయ్యాడు! భద్రాద్రిలో సోమవారం శ్రీరామ మహా పట్టాభిషేక మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఈ వేడుకకు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ హాజరై స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు ఆమెకు సంప్రదాయ వస్త్రాలు, జ్ఞాపిక, ప్రసాదం అందజేశారు. శ్రీరామ పట్టాభిషేకాన్ని తిలకించడం పూర్వజన్మ సుకృతమని మీడియాతో తమిళిసై పేర్కొన్నారు. రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాలని కరోనా మహమ్మారి నుంచి పూర్తిగా బయటపడాలని భద్రాద్రి రామయ్యను మనస్పూర్తిగా కోరుకున్నానని చెప్పారు.   


Updated Date - 2022-04-12T06:57:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising