సింగిల్ పర్మిట్ అమలుకు సర్కార్ సానుకూలం
ABN, First Publish Date - 2022-10-17T09:05:48+05:30
తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ పర్మిట్ విధానాన్ని అమలు చేసి పాత లారీలపై గ్రీన్ టాక్స్‌ను తగ్గించేందుకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ప్రకటించారు.
తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్
హైదరాబాద్, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ పర్మిట్ విధానాన్ని అమలు చేసి పాత లారీలపై గ్రీన్ టాక్స్‌ను తగ్గించేందుకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ప్రకటించారు. అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు, పర్యాటక మంత్రి వి.శ్రీనివా్‌సగౌడ్ నేతృత్వంలో తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు బి.నందారెడ్డి, సుర్వి యాదయ్య, మంచిరెడ్డి రాజేందర్‌రెడ్డి, చాంద్‌పాషా తదితరులు ఆదివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, రవాణా శాఖ కార్యదర్శి శ్రీనివాసరాజుతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సమస్యలు విన్నవించి పరిష్కరించాలని కోరారు. ఓవర్ లోడ్పేరుతో లారీ డ్రైవర్ల లైసెన్స్ సస్పెన్షన్ విధానాన్ని ఎత్తివేయాలని, గ్రామ పంచాయతీ, మున్సిపల్ పరిధిలో లారీల రవాణా రుసుము వసూలు చేయకుండా చర్యలు తీసుకోవాలన్న విజ్ఞప్తికి సీఎస్ తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్టు లారీ యజమానుల సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు. లారీ యజమానుల సమస్యల పరిష్కారానికి అంగీకరించడంతో మునుగోడు ఉప ఎన్నికలో అధికార పార్టీ అభ్యర్థిని గెలిపించేందుకు కృషి చేస్తామని సంఘం ప్రతినిధులు ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు హామీ ఇచ్చారు.
Updated Date - 2022-10-17T09:05:48+05:30 IST