REVANTHREDDY : పోలీసులా..కిరాయి గూండాలా?
ABN, First Publish Date - 2022-12-15T02:48:25+05:30
కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు కార్యాలయంపై పోలీసులు దాడి చేయడం ఆటవిక చర్య అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
కాంగ్రెస్ వార్‌రూమ్‌పై దాడి ఆటవిక చర్య
పోలీసులు రౌడీమూకల్లా వ్యవహరించారు
దౌర్జన్యంగా 50 కంప్యూటర్లు ఎత్తుకెళ్లారు
సిబ్బందినీ తీసుకెళ్లారు.. వారెక్కడున్నారో ఏమో?
వారెంట్, ఎఫ్ఐఆర్ లేకుండా ఎలా తీసుకెళ్తారు
హైదరాబాద్ సీపీకి ఫోన్ చేసినా తీయలేదు: రేవంత్
న్యూఢిల్లీ, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు కార్యాలయంపై పోలీసులు దాడి చేయడం ఆటవిక చర్య అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడారు. దౌర్జన్యంగా, రౌడీమూకల తరహాలో వార్‌రూమ్‌లోని 50 కంప్యూటర్లను ఎత్తుకెళ్లారని, దాదాపు ఏడాదికాలంగా తెలంగాణలో క్షేత్రస్థాయి పరిస్థితులపై సేకరించిన డేటాను దొంగిలించారని తెలిపారు. సిబ్బందిని ఎత్తుకెళ్లారని, ఇప్పటి వరకు వాళ్లు ఎక్కడ ఉన్నారో తెలియక వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారని వివరించారు. డీజీపీతో సీనియర్ నేత జానా రెడ్డి మాట్లాడారని, తనకు సమాచారం లేదంటూ డీజీపీ తప్పించుకున్నారని రేవంత్ చెప్పారు. డీజీపీ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, సైబర్ క్రైమ్ సంయుక్త కమిషనర్‌తో పాటు ఏసీపీలకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎవరూ ఫోన్ తీయలేదని పేర్కొన్నారు. ఇది అనాగరిక, ఆటవిక చర్య అని ఆయన స్పష్టం చేశారు.
ఫోన్లలో అందుబాటులోకి రాకుండా తప్పించుకొని తిరుగుతున్నారంటే వాళ్లు పోలీసులా లేదా దొంగలా అని ప్రశ్నించారు. నిజంగానే తప్పు జరిగితే వచ్చిన ఫిర్యాదులు, నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను చూపించి వారెంట్ ఇచ్చి దర్జాగా చర్యలు తీసుకోవాల్సిందని, కానీ టీఆర్ఎస్ అల్లరిమూకల మాదిరిగా, కిరాయి గూండాల్లా పోలీసులు కాంగ్రెస్ వార్‌రూమ్‌పై దాడి చేశారని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని, ప్రజల హక్కులను కాపాడడానికి బీఆర్‌ఎ్‌సను స్థాపించి దాని కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నామని చెబుతున్న సీఎం కేసీఆర్‌కు సిగ్గుండాలని రేవంత్ విమర్శించారు. ప్రజాస్వామ్యంపై విశ్వాసం ఉంటే వారెంట్ లేకుండా, ఎఫ్ఐఆర్ లేకుండా తమ పార్టీ కార్యాలయంపై ఎలా దాడి చేస్తారని ఆయన ప్రశ్నించారు. రాహుల్ గాంధీ పాదయాత్రలో ప్రస్తావిస్తున్న అంశాలకు సంబంధించి సునీల్ సూచనలు చేస్తున్నారని, దీనివల్ల ప్రధాని మోదీకి, సీఎం కేసీఆర్‌కు ఇబ్బంది కలుగుతున్నందువల్లే తమ కార్యాలయంపై దాడి చేశారని ఆయన ఆరోపించారు.హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని, న్యాయపోరాటం చేస్తామని రేవంత్ హెచ్చరించారు. ఈ ఘటనను ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఖండించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లిక్కర్ కుంభకోణంలో ఉన్న విషయం దేశం మొత్తానికి తెలుసునని, దాన్ని సామాజక మాధ్యమాల ద్వారా పోస్ట్ చేస్తే పోలీసులు ఎందుకింత అత్యుత్సాహం ప్రదర్శించారో అర్థంకావడంలేదన్నారు. కాగా, ఢిల్లీలో సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తుండగా దాన్ని ముట్టడించాలని తొలుత కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు రేవంత్ రెడ్డి అధికారికంగా కూడా ప్రకటించారు. ఆ తర్వాత ఇతర నేతలతో చర్చించిన తర్వాత ముట్టడి కార్యక్రమాన్ని ఉపసంహరించుకున్నారు.
లోక్‌సభలో మాణిక్కం ఠాగూర్ వాయిదా తీర్మానం
సునీల్ కార్యాలయంపై తెలంగాణ పోలీసుల దాడి చేసిన అంశంపై లోక్‌సభలో చర్చించాలంటూ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి, ఎంపీ మాణిక్కం ఠాగూర్ వాయిదా తీర్మానం ఇచ్చారు. దాన్ని స్పీకర్ ఓం బిర్లా తిరస్కరించారు. సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఫేస్బుక్లో పోస్టు చేసినందుకు వారెంటు, నోటీసు ఇవ్వకుండానే అరెస్టులు చేశారని ఆరోపించారు. దక్షిణాది హిట్లర్‌గా ప్రవర్తిస్తున్న సీఎం కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న ఇటువంటి చర్యలను అడ్డుకుంటూ ఈ సభ ఆదేశాలివ్వాలని పేర్కొన్నారు.
Updated Date - 2022-12-15T02:48:26+05:30 IST