నోటరీ ఆస్తులకు రిజిస్ట్రేషన్?
ABN, First Publish Date - 2022-09-25T09:42:59+05:30
నోటరీ ద్వారా కొనుగోలు చేసిన స్థిరాస్తులను రిజిస్ట్రేషన్ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలిసింది.
- ఆదాయం రాబట్టుకునేందుకు సర్కారు కసరత్తు
- రిజిస్ట్రేషన్ల శాఖ సమావేశంలో చర్చ..
- మార్గదర్శకాలపై అధికారుల దృష్టి
హైదరాబాద్, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): నోటరీ ద్వారా కొనుగోలు చేసిన స్థిరాస్తులను రిజిస్ట్రేషన్ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలిసింది. తద్వారా ఆదాయం రాబట్టుకోవడానికి కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ చేసేందుకు వీలు లేని స్థలాలు(గ్రామ కంఠం, ఇనాం భూములు, సొసైటీల పేర్లపై ఉన్న స్థలాలు), నిర్మాణాలు ఉన్నాయి. ఈ తరహా ఆస్తులను చాలా మంది నోటరీల ద్వారా కొనుగోలు చేస్తున్నారు. ఇలా ఖాళీ స్థలాలు కొనుగోలు చేసిన వారు.. ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. ఇలాంటి నిర్మాణాలకు అధికారికంగా ఎలాంటి గుర్తింపు లేనప్పటికీ.. వాటిలోనే నివసిస్తున్నారు. ఈ పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం నోటరీలపై కొనుగోలు చేసిన స్థిరాస్తులను రిజిస్ట్రేషన్ చేస్తే.. స్టాంప్‌డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీల రూపంలో ఆదాయాన్ని పిండుకోవచ్చన్న అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. నోటరీల ద్వారా ఆస్తులను రిజిస్ట్రేషన్ చేస్తే క్షేత్ర స్థాయిలో ఎదురయ్యే సమస్యలు, వాటికి పరిష్కార మార్గాలు, ప్రభుత్వ ఖజానాకు సమకూరనున్న ఆదాయం.. తదితర అంశాలపై మూడు రోజుల క్రితం జరిగిన స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారుల సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. వాస్తవానికి హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో నోటరీపై ఇళ్ల స్ధలాలు, ఇళ్ల అమ్మకాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లోని పాతబస్తీ పరిధిలోకి వచ్చే ఫలక్‌నుమా, బహుదూర్‌గూడ, కీసర సమీపంలోని జవహర్‌నగర్, నిజాంపేట, పటాన్‌చెరువు, అమీన్‌పూర్, బాచుపల్లి, ఖైరాతాబాద్, కూకట్‌పల్లి, కాప్రా, సిద్దిపేట, మెదక్ జిల్లా కేంద్రాల్లో ఇదే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అక్కడి ప్రజలకు అవగాహన కల్పించి, రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు మందుకు వచ్చేలా చర్యలు చేపడితే ఆదాయం సమకూర్చుకోవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.
నోటరీ ద్వారా కొనుగోలు చేసిన స్థిరాస్తులను రిజిస్ట్రేషన్ చేస్తే కొన్ని చోట్ల వి వాదాలు తలెత్తే అవకాశం ఉంటుందన్న అభిప్రాయాన్ని క్షేత్ర స్థాయి అధికారులు వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇందు లో అసలైన యజమానులను గుర్తించేది ఎలా? ఈ బాధ్యతలు తీసుకునేది ఎవరన్న ప్రశ్నను లేవనెత్తినట్లు తెలిసింది. నోటరీ అసలైందా? నకిలీదా? నోటరీలో పేర్కొన్న వ్యక్తులు నిజమైన యజమానులేనా? అన్నది తేల్చాల్సింది ఎవరు.. వారిని గుర్తించడం ఎలా సాధ్యపడుతుందన్న అభిప్రాయాలను అధికారులు వ్యక్తం చేశారు. నోటరీ ఉన్న వారిని పక్కగా గుర్తించేందుకు మునిసిపాలిటీలు, కార్పొరేషన్లు, హెచ్‌ఎండీఏ అధికారుల సహకారం తీసుకోవాలని సూచించినట్లు సమాచారం.
Updated Date - 2022-09-25T09:42:59+05:30 IST